Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

ప్రజల మనిషి కోటేశ్వరరావును గెలిపించుకుందాం

జల్లివిల్సన్‌ పిలుపు

విశాలాంధ్ర- విజయవాడ (వన్‌టౌన్‌): భారతదేశ లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమిని ఆదరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ కోరారు. నిత్యం ప్రజల మధ్య ఉండే కమ్యూనిస్టులను ఆశీర్వదించాలన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి బలపరిచిన సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. స్థానిక ప్రైజర్‌పేట తెలుగు బాప్టిస్టు చర్చి పెద్దలతో జల్లి విల్సన్‌, జి.కోటేశ్వరరావు ఆదివారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జల్లి విల్సన్‌ మాట్లాడుతూ బాప్టిస్టు సంఘంతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, ఇక్కడి ప్రజలతో ఆత్మీయ సంబంధాలను గుర్తుచేసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్‌, సీపీఎం మద్దతుతో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన షేక్‌ నాసర్‌వలీని అందరూ ఆశీర్వదించి 30వేల ఓట్లతో గెలిపించారని గుర్తుచేశారు. 2004లో కమ్యూనిస్టుల సహకారంతో కేంద్రంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని తెలిపారు. నాడు రాష్ట్రంలో సీఎంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కేంద్రంలో ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ అనేక మంచి పనులు చేశారని పేర్కొన్నారు. నేడు మళ్లీ అదే తరహాలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయని వివరించారు. ఇండియా కూటమి తరపున విద్యాధికుడు, స్థానికుడు, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి జి.కోటేశ్వరరావు పోటీ చేస్తున్నారని, నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు ఆయన్ను ఆదరిస్తున్నారని తెలిపారు. బాప్టిస్టు సంఘ పెద్దలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు.
డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో మారణహోమం: కోటేశ్వరరావు
విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెబుతున్న డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వల్ల అభివృద్ధి కన్నా అరాచకాలు పెరిగిపోయాయని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్‌లో క్రైస్తవులపై మారణకాండను ప్రతి ఒక్కరం చూశామని, అక్కడ ఏకంగా 155 చర్చిలను బుల్డోజర్లతో కూల్చివేశారని, మహిళలను వివస్త్రలుగా మార్చి మాన ప్రాణాలను హరించివేశారని ఆవేదన వ్యక్తంచేశారు. మణిపూర్‌ మారణకాండకు కారణమైన పార్టీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్నారని… భవిష్యత్‌లో మన ప్రాంతంలో అటువంటి దారుణ పరిస్థితులు రాకుండా ఉండేందుకు బీజేపీని చిత్తు చిత్తుగా ఓడిరచాలని కోరారు. తాను 40ఏళ్లుగా ఈ గల్లీల్లోనే తిరుగుతున్నానని, ఏ సమస్య వచ్చినా ప్రజల పక్షాన నిలుస్తానన్నారు. స్థానికుడినైన తనను ఆదరించాలని కోరారు. బాప్టిస్టు చర్చి అధ్వర్యాన నిర్మిస్తున్న కమ్యూనిటీ హాలుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో బాప్టిస్టు సంఘ పాస్టర్‌ రెవరెండ్‌ కొమ్ము నిక్సన్‌ ఆండ్రూస్‌, స్టాండిరగ్‌ కమిటీ చైర్మన్‌ రెడ్డిబోయిన మోజెస్‌, కార్యదర్శి వినుకొండ ఇమ్మానుయేల్‌, సంయుక్త కార్యదర్శి బూదాల విక్టర్‌ జోసఫ్‌, కోశాధికారి దారివేముల ఏలియాబాబు, సంయుక్త కోశాధికారి కటికల కిశోర్‌కుమార్‌, ఏపీ కాంగ్రెస్‌ కమిటీ సభ్యులు బూదాల జోసెఫ్‌, 49వ డివిజన్‌ కార్యదర్శి బుర్రా రామకృష్ణ, సహాయ కార్యదర్శి వినుకొండ శ్యామ్‌సంగ్‌, సీపీఐ నాయకులు మురికిపూడి భూషణం, జీ లాజర్‌, పేటేటి రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img