Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

అరుణమయ చరిత అమరం

తనకోసం, తన కుటుంబం కోసం జీవించడంకాక, సమాజం కోసం, అణగారిన ప్రజలకోసం, ఎన్ని ఇక్కట్లు, నిర్బంధాలు, సవాళ్లు ఎదురైనా నిబద్ధతతో నిలబడటం కమ్యూనిస్టు ఆశయ పథగామికి మాత్రమే సాధ్యమయ్యే ఆచరణ. ప్రపంచీకరణ, వస్తు వ్యామోహ, వినియోగదారీ, ద్రవ్య భ్రమల ప్రపంచంలోనూ కమ్యూనిస్టుగా నిలబడటం మరింత కష్టమైన సమయం లోనూ నిబద్ధతతో, త్యాగాలతో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు ఆదర్శనీయంగా వున్నారు. కమ్యూనిస్టు ఉద్యమ ఒరవడి అలాంటిది. అలాంటి వారిలో కమ్యూనిస్టు యోథ మోదుమూడి శ్రీహరిరావు ఒకరు. ఆయన జీవితం మహోన్నత ప్రేరణ. కమ్యూనిస్టు నాయకునిగా ఆయన సేవలు నిరూపమానం. కృష్ణాజిల్లా చరిత్రకు ఘనమైన జీవితాన్ని అందించిన అమరుడు ఆయన. ఉత్తమమైన, ఉన్నతమైన మానవ జీవితాన్ని ఎలా జీవించాలో ఆయన జీవిత చరిత్రను చూసి తెలుసుకోవచ్చు. సీటు కోసమో, ఓటు కోసమో, పదవి కోసమో, పైసా కోసమో మాటను, బాటనూ మార్చుకునే నేటి రాజకీయ విన్యాసాల వేళలో అంకిత భావం, నిబద్ధమైన ఆశయ ప్రస్థానంగల మోదుమూడి శ్రీహరిరావు స్మరణ కారు చీకట్లో కాంతి రేఖలా కనపడుతుంది. నిరంతర అధ్యయనశీలి. భూ పోరాటయోధుడు. కమ్యూనిస్టు ఉద్యమకారుడు ఆయన.
బడుగుల గొంతుక: మానవీయ విలువలకు, ఆచరణీయవాదానికి శ్రీహరిరావు చిరునామా. దాదాపు ఆరుపదుల రాజకీయ జీవితంలో బడుగుల గొంతుకగా మారి, వారిని గెలిపించేందుకు అలుపెరగని కృషిచేసిన మహోన్నత మానవతామూర్తిగా, ఆ కాలపు మహనీయుడిగా వెలుగొందారు. సనాతన బ్రాహ్మణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పటికీ అభ్యుదయ భావాల సంస్కారంతో పెరిగారు. కమ్యూనిజం వికాసానికి పట్టుదలతో పనిచేశారు. ప్రజాసేవను, కుటుంబ జీవితాన్ని రెండు కళ్లుగా భావించారు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అన్యాయాలను ఎదిరించి నిలవడంతోపాటు సమైక్యాంధ్ర భావనకు కట్టుబడి దాడులను సైతం ధైర్యంగా ఎదుర్కొన్నారు. అమరులు చండ్ర రాజేశ్వరరావు, చండ్ర రామలింగయ్య, నీలం రాజశేఖరరెడ్ది, తమ్మారెడ్డి సత్యనారాయణ, నల్లమల గిరిప్రసాద్‌, చెన్నమనేని రాజేశ్వరరావు, దాసరి నాగభూషణరావు, జేఎస్‌ఆర్‌ ఆంజనేయ శాస్త్రి తదితర కమ్యూనిస్టు అగ్రనాయకులతో కలిసి పనిచేసిన నిఖార్సయిన ఎర్రజెండా శ్రీహరిరావు. పేద, బడుగు, బలహీనవర్గాల హక్కులకోసం నిరంతరం పోరాటాలు కొనసాగించిన నిస్వార్థ ప్రజాసేవకుడు కామ్రేడ్‌ శ్రీహరిరావు 25వ వర్థంతి ఈ నెల 8వ తేదీన జరుగుతున్న సందర్భంగా ఆయన కమ్యూనిస్టు జీవితాన్ని ఓ సారి గుర్తు చేసుకుంటే…
కృష్ణాజిల్లా దివితాలుకా అవనిగడ్డ సమీపంలోని మోదుమూడి శివారు రామచంద్రపురంలో 1917లో జన్మించిన ఆయన చిన్నతనం నుంచే అభ్యుదయ భావాలను అలవర్చుకున్నారు. అగ్రకులానికి చెందిన వారైనప్పటికీ అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. గురజాడ అప్పారావు, విరేశలింగం పంతులుగార్ల సంస్కరణల ప్రభావంతో అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. అప్పట్లో హరిజనులు సముద్రస్నానం చేయకూడదనే ఆంక్షలను లెక్కచేయకుండా హంసలదీవి వద్దకు హరిజనులను తీసుకువెళ్లి సముద్రస్నానాలు చేయించి, గుళ్లో ప్రవేశింపచేశారు. ఈ ఘటన ఆనాడు ఎంతో సంచలనం సృష్టించింది. 1938లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించిన శ్రీహరిరావు 1999 జులై 8వ తేదీన తుదిశ్వాస విడిచే వరకు కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం, పటిష్టతకు ఎనలేని కృషి చేశారు. ఎందరినో కమ్యూనిస్టు కార్యకర్తలుగా తయారుచేశారు. అనేక భూపోరాటాలు, కూలి పోరాటాల్లో పాల్గొన్నారు. 1937 నుంచి 1943 వరకు దివిసీమలో కమ్యూనిస్టు పార్టీ, వ్యవసాయ కార్మికసంఘ నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. సామ్రాజ్యవాద యుద్ధానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని, యుద్ధానికి డబ్బుకానీ, మనుషుల సహాయం కానీ చేయరాదన్న పార్టీ నిర్ణయాన్ని శిరసావహించిన ఆయన పూనేలో ఎకౌంట్స్‌ ఆఫీసులో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టారు. వ్యవసాయ కార్మికులకు పిచ్చి ముంతల (తక్కువ)తో ధాన్యం యివ్వటం, బస్తా ధాన్యం యిచ్చి రెండు, రెండున్నర బస్తాలు వసూలు చేయటం వంటి దోపిడీ విధానానికి, జమీందారీ విధానానికి వ్యతిరేకంగా, నజరానా వసూళ్ల నిలిపివేత కోసం దివిసీమలో సాగిన ఉద్యమాల్లో శ్రీహరిరావు ముందుండి పోరాడారు. భూ ఆక్రమణోద్యమాలలో చురుకైన పాత్ర వహించారు.
అజ్ఞాతవాసం : మూడున్నర సంవత్సరాలపాటు అజ్ఞాతవాసం, రెండున్నర సంవత్సరాలు కడలూరు సెంట్రల్‌ జైలు జీవితం అనుభవించారు. యుద్ధ వ్యతిరేక ప్రచారంచేస్తూ కరపత్రాలు పంచినందుకు 1940లో నూజివీడు పోలీసులు ఆయనను అరెస్టుచేసి నెల రోజులు బందరు సబ్‌జైలులో వుంచారు. కమ్యూనిస్టుపార్టీ దివితాలుకా కమిటీ సభ్యునిగా, దివిసీమ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న సమయంలో పార్టీ జిల్లా ఆర్గనైజర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీహరి జిల్లాలోని కైకలూరు, జగ్గయ్యపేట, మైలవరం, గుడివాడ తాలుకాల్లో పార్టీ నిర్మాణానికి కృషి చేశారు. పార్టీ ఆదేశానుసారం 1943లో కుటుంబంతో సహా మచిలీపట్నం వచ్చిన ఆయన అక్కడ పార్టీ నిర్మాణ బాధ్యతలు చేపట్టి తుదిశ్వాస వరకు మచిలీపట్నం కేంద్రంగా పనిచేశారు. 1943 నుంచి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యునిగా, 1974లో జిల్లా సమితి సహాయ కార్యదర్శిగా, కార్యదర్శివర్గ సభ్యునిగా, రాష్ట్ర సమితి సభ్యునిగా, కంట్రోల్‌ కమిషన్‌ సభ్యునిగా, వ్యవసాయ కార్మిక సంఘం, శాంతిస్నేహ సంఘాలు, ట్రేడ్‌ యూనియన్‌, ఎడ్యుకేషన్‌ సబ్‌కమిటీ బాధ్యతలు నిర్వర్తించారు. నేడు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)గా ఉన్న ఆంధ్రాసైంటిఫిక్‌ కంపెనీ కార్మికుల సంక్షేమంలో, కంపెనీ జాతీయకరణలో ఆయన విశేష పాత్ర నిర్వహించారు. కోన, పల్లెతుమ్మల పాలెం, చల్లపల్లి భూపోరాటాలకు నాయకత్వం వహించారు. సీపీఐ అగ్రనాయకులు అమరజీవి చండ్ర రాజేశ్వరరావుకు అత్యంత ఆత్మీయులుగా మెలిగారు. పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకులు ఎవరు వచ్చినా ఆయన ఆతిధ్యం స్వీకరించకుండా వెళ్లేవారు కాదు. ఆయన నిర్వహించిన విశాలాంధ్ర బుక్‌హౌస్‌ పార్టీ కార్యాలయంగా, ఇల్లు పార్టీ తరపున వచ్చిన వారికి మకాంగా వుండేది. ఆయన శ్రీమతి లలితాదేవి కూడా ఉత్తమ కమ్యూనిస్టుగా ఆయనకు చేదోడువాదోడుగా నిలిచారు. పార్టీ కార్యక్రమాలకోసం యావదాస్తిని ఖర్చుచేశారు. పశ్చిమబెంగాల్‌లో సంభవించిన కరువుతో అనారోగ్యానికి గురైన పార్టీ, ప్రజాసంఘాల కామ్రేడ్స్‌కు బందరులో వైద్య శిబిరాన్ని నిర్వహించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దారు. కార్మిక సంఘాల నిర్మాణంలో : మచిలీపట్నంలో మున్సిపల్‌, ప్రెస్‌, మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్ల నిర్మాణంలో కీలకపాత్ర నిర్వహించారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మచిలీపట్నంలో ప్రెస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నెలకొల్పిన ఘనత శ్రీహరికే దక్కింది. జై ఆంధ్ర ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించడంతో సహించలేని వేర్పాటువాదులు ఆయనపై భౌతిక దాడి చేయాలనుకున్నారు. ప్రజల అండ ఉండడంతో చేయలేక, ఆయన నిర్వహిస్తున్న విశాలాంధ్ర బుక్‌హౌస్‌ను రెండుసార్లు దగ్ధం చేశారు. అయినా మొక్కవోని దీక్షతో సమైక్యాంధ్రకు శ్రీహరిరావు కట్టుబడ్డారు. బందరు తీరప్రాంతంలో ఎక్కువ భాగం ఫారెస్టు కావటంతో అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్పుచేసి పేదలకు పంపిణీ చేసేందుకు వివిధ రూపాలలో ఆయన ఆందోళనలు నిర్వహించారు. ఫలితంగానే నేడు మచిలీపట్నం సర్కార్‌తోట వాసులు డి పట్టాలు సాధించుకున్నారు. బందరు మండలం కోన ప్రాంతాన్ని డి ఫారెస్టు చేయించి వేలాది మందికి పట్టాలు ఇప్పించేందుకు పోరాటాలు నిర్వహించారు. కానూరు, పెదపట్నం, పల్లెతుమ్మలపాలెం బంజర్లు, శివగంగ మిగులు భూముల పంపిణీకోసం నిర్విరామంగా పోరాటాలు నిర్వహించారు. ఉదాత్త స్వభావం, దాతృత్వం, సోషలిజం, కమ్యూనిజంపై శ్రీహరిరావుకున్న నిబద్ధత ఎనలేనిది. శ్రీహరిరావు జీవితమే ఒక పోరాటం...పోరాట జీవులకు నిరంతరం మార్గనిర్దేశం. (ఈ నెల 8వ తేదీ సోమవారం కామ్రేడ్‌ శ్రీహరిరావు 25వ వర్ధంతి సందర్భంగా) జేవీ స్టాలిన్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img