Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

ఆయుధ పోటీలో నూతన శకం ‘‘హైపర్‌ సోనిక్‌’’

బుడ్డిగ జమిందార్‌

ఆయుధ పోటీలో నూతన శకం ఆరంభమైంది. ఈ నూతన అధ్యాయాన్ని ఈసారి రష్యా ప్రారంభించింది. శక్తిమంతమైన జిక్రోన్‌ యుద్ధ నౌక నుండి ఈ నెలలో హైపర్‌సోనిక్‌ క్షిపణిని దిగ్విజయంగా ప్రయోగించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దీనిని ‘‘అజేయమైనది’’గా వర్ణించాడు. నేవీ అడ్మిరల్‌ గోర్ష్‌కోవ్‌ నౌకాదళంలో ఈ యుద్ధనౌక జిక్రోన్‌ ఉంది. జిక్రోన్‌ నుండి ప్రయోగించిన క్షిపణి శబ్ధతరంగాల వేగం కంటే 7 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించి ప్రపంచ ఆయుధ ఉత్పత్తిదారులను ఆశ్చర్యపర్చింది. బేరెంట్స్‌ సముద్రంలో 350 కి.మీ. కనురెప్పపాటులో దూసుకు పోయిన ఈ క్షిపణి తన లక్ష్యాన్ని ఛేదించింది. మరిన్ని క్షిపణులను విజయవంతంగా పరీక్షించితే తొందరలోనే ఈ క్షిపణిని యుద్ధ విమానాలకు అమర్చే ప్రక్రియ మొదలవుతుందని రష్యా మిలిటరీ నిపుణులు అంటున్నారు.
ప్రపంచంలో ఇప్పటికే హైపర్‌సోనిక్‌ యుద్ధ విమానాలు ఉన్నాయి. రష్యా, జర్మనీ, చైనాలు ముందంజలో ఉండగా అమెరికా ఆ తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. రష్యాకు చెందిన అవన్‌గార్డ్‌ ప్రపంచంలో మొదటిస్థానాన్ని ఆక్రమించింది. ఏ విధమైన న్యూక్లియర్‌ హెడ్‌తోనైనా పయనించగల అపారశక్తి కల్గి ఉంది. రెండు మెగా టన్నుల బరువు మోయగలదు. అత్యంత వేగవంతమయిన ఎయిర్‌క్రాఫ్ట్‌గా పేరుగాంచింది. దీనితోపాటుగా రష్యా మరొక 5 రకాల హైపర్‌సోనిక్‌ విమానాలను కల్గి ఉంది. రెండవ స్థానంలో జర్మనీ షెఫ్లెక్స్‌ విమానాలున్నాయి. మూడవ స్థానంలో చైనాకు చెందిన డబ్ల్యుయు14 డిఎఫ్‌జడ్‌ఎఫ్‌లు ఉన్నాయి. నాల్గవ స్థానాన్ని బోయింగ్‌ (అమెరికా) ఎక్స్‌43 ఆక్రమించగా, 5వ స్థానంలో కూడా అమెరికాకు చెందిన ఎక్స్‌15 విమానం, 6వ స్థానంలో మనదేశం పరీక్షలు చేస్తున్న హెచ్‌ఎస్‌టిడివి, 7వ స్థానంలో అమెరికాకు చెందిన లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఎస్‌ఆర్‌72, 8వ స్థానంలో యు.కె. ఆర్‌ఇఎల్‌ స్కైలోన్‌లు, 9వ స్థానంలో అమెరికాకు చెందిన బోయింగ్‌ ఎక్స్‌5, 10వ స్థానంలో ఎక్స్‌సిఒఆర్‌ (అమెరికా) ఉన్నాయి.
హైపర్‌సోనిక్‌ ఆయుధాలు శబ్ధ వేగం కంటే కనీసం 5 రెట్లు వేగవంతంగా ప్రయాణించి శత్రుసేనల రాడార్లు పసిగట్టే లోపునే లక్ష్యాన్ని సాధిస్తాయి. హైపర్‌సోనిక్‌ ఆయుధాలు కల్గి ఉన్నవారు రహస్యంగా శత్రు దేశాలపై ఆకస్మిక దాడులు చేసే ప్రమాదముంది. రష్యాకు తప్ప మరెవరికీ హైపర్‌సోనిక్‌ ఆయుధాలు లేవు, కానీ అందరూ ఈ తరహా ఆయుధాల్ని కోరుకొంటున్నారని ఫ్రీలాన్స్‌ రక్షణ విశ్లేషకుడు అలెగ్జాండర్‌ గోల్ట్స్‌ అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న క్షిపణుల వ్యవస్థను ఛేదించటానికి రష్యా తలపెడుతున్న హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీ ఉపకారిగా ఉంటుందని 2018లో పుతిన్‌ ప్రకటించాడు. దానికి అనుగుణంగానే ప్రస్తుత ప్రాజెక్టు నడిసింది.
ఆయుధ పోటీల్లో కూడా వేరే సాంకేతిక పరిజ్ఞాన పరిశోధనలలో మాదిరిగా తొందరగానే ఆయా దేశాలు ఫలితాలు సాధిస్తున్నాయి. కొన్ని కొన్ని సందర్భాలలో మరింత నూతన పరిజ్ఞానాన్ని జోడిరచి ఆయుధాల్ని తయారు చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, చైనా, ఫ్రాన్స్‌ తదితర దేశాలు ఈ దిశగా ప్రణాళికలను సిద్ధం చేసుకొంటున్నాయి. 1945 ఆగస్టు 6 నాడు అణు బాంబును హిరోషిమాపై ప్రయోగించిన అమెరికా తనకు తిరుగులేదనుకొన్నది. కానీ అనతికాలంలోనే 1950 దశకం ప్రారంభం నాటికి సోవియట్‌ యూనియన్‌ అణు బాంబులను, హైడ్రోజన్‌ బాంబులను కనిపెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. ఇప్పుడు ప్రపంచంలో 18 వేలకు పైగా అణ్వస్త్రాలున్నాయి. మన భూగోళాన్ని సర్వనాశనం చేయాలంటే 200 అణుబాంబులు సరిపోతాయి. అయినా ఆధిపత్యం కోసం, ఉగ్రవాదం నుండి రక్షణ పేరిట ఆయుధ పోటీ జరుగుతూనే ఉంది. మరోవైపు నేటికీ ఇంకా ప్రపంచంలో 74.5 కోట్ల మంది ప్రజలు కటిక దారిద్య్రంలోనే మగ్గు తున్నారని ఐక్యరాజ్యసమితి ఎఫ్‌ఏఓ (ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌) తెలియజేసింది.
రష్యన్లు సాధించిన ఈ విజయం తాత్కాలికమే కావచ్చు, అమెరికన్లు సంవత్సరంలోపే ఈ ఆయుధాల్ని ప్రయోగిస్తారని ఇగోర్‌ డిలోనోయ్‌ వ్యాఖ్యానించారు. పెంటగాన్‌ ప్రతినిధి జాన్‌ కిర్బీ మాట్లాడుతూ ఈ క్షిపణులు గణనీయమైన ప్రమాదాలతో రక్షణ వ్యవస్థను అస్థిరపరుస్తాయని అన్నారు. నాటో అధికారి ఒకరు స్పందిస్తూ ‘తీవ్రతరమైన ఈ హైపర్‌ సోనిక్‌ ఆయుధాలు తప్పుల తడకలతో ఎక్కువ ప్రమాదాల్ని సృష్టిస్తాయి’ అన్నారు. రష్యా గంటకు 33 వేల కిలోమీటర్లు వేగంతో ప్రయాణించగల క్షిపణులు తయారు చేయడం, ఆ దేశానికి ఆయుధ రంగంలో ఇంకా తనకు ఉన్న ఆధిపత్యాన్ని పట్టును, సాంకేతిక పరిజ్ఞాన పరిశోధన విజయాల్ని తెలియజేస్తోంది. అయితే ఇటువంటి అధునాతన ఆయుధాలను రష్యా అంబులపొదిలోకి తేవటం ద్వారా అమెరికాను నిరాయుధీకరణ చర్చలకు లొంగేటట్లు చేసుకోగలదని నిపుణులు అంటున్నారు. ట్రంప్‌ హయాంలో అనేక ఒప్పందాల్ని రద్దు చేసుకొన్నాడు. వీటిలో 6500 కిలోమీటర్లు లోపు ప్రయాణించగల క్షిపణుల రద్దుకు సంబంధించిన ఐ.ఎన్‌.ఎఫ్‌ (ఇంటర్మీడియట్‌ రేంజ్‌ న్యూక్లియర్‌ ఫోర్సెస్‌ (టీటీ) ఒకటి. జోబైడెన్‌ ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండటానికి సంసిద్ధత వ్యక్తపరుస్తున్నాడు.
ప్రస్తుత ప్రపంచ అగ్రదేశాలు జాతీయవాదం, రక్షణ పేరిట పిచ్చిపిచ్చిగా మారణాయుధాలను తయారు చేస్తున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగుదల, నిరుద్యోగ నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, దారిద్య్ర నిర్మూలన, మెరుగైన విద్యావైద్య సదుపాయాలు తదితర ప్రధాన సమస్యల కంటే, ఈ మానవాళిని, భూగోళాన్ని ఎంత తొందరగా వినాశనం చేయాలనే దిశగానే ఆయుధపోటీకి వెళ్తున్నాయి. ప్రపంచశాంతి ఉద్యమమే దీనికి విరుగుడుగా ఎదగాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img