Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

ఆసక్తి కలిగిస్తున్న ఏపీ ఎన్నికలు

గత పదేళ్లుగా రాజధాని పేరు చెప్పుకోలేని ఆంధ్రప్రదేశ్‌లో మరో 24 గంటల్లో ఎవరు ముఖ్యమంత్రి అన్నది చూచాయగా తేలనుంది. దక్షిణ భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికపై ఆసక్తికరంగా చూస్తోంది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మరోసారి విజనరీ నాయకుడుగా చెప్పుకుంటున్న చంద్రబాబుతో తలపడనున్నారు. జగన్మోహన్‌ రెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి ఒంటరిగానే గత ఎన్నికల్లో రణరంగంలో ఉంటున్నారు. తెలుగు ప్రజల కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ ఏదొఒక పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పడంలేదు. 2014లో బీజేపీ జనసేనతో పొత్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2019లో ఒంటిరిగా పోటీ చేసి ఘోరంగా ఓటమి చవిచూశారు. ఈదఫా పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో బీజేపీిని ఒప్పించి మరీ పొత్తుపెట్టుకుని ఎన్నికలో నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదారు శాతం ఉన్న ఉన్నత సామాజిక వర్గాలవారు ముఖ్యమంత్రులయ్యారు. 26శాతం ఉన్న కాపు, బలిజలు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదన్న పవన్‌ కల్యాణ్‌ సామాజిక లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చారు. అయితే వైసీపీ గేమ్‌ ప్లాన్‌ తో ఆంధ్రప్రదేశ్‌ లో కాపు సామాజిక వర్గానికి పెద్దదిక్కయిన ముద్రగడను కూటమి వైపు రాకుండా జాగ్రత్తపడిరది. ఇదిలా ఉంటే 50 శాతంపైబడి ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలలో ఒక్కరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఆంధ్రప్రదేశ్‌లో కనిపించడంలేదంటే ఇందిరాగాంధీ ఆనాడు ఆంధ్రా ప్రజలు గొర్రెలు అన్న విమర్శ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో సీఎం పదవికి అర్హులయ్యే బడుగువర్గాల నేతలు ఎంతో మంది ఉన్నారు. ఎంతసేపు ఆ రెండు అగ్రవర్ణాల కుటుంబాల కాళ్లదగ్గరే ఉండటమే బీసీలకు ఇష్టమేమోమరి. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ సాధారణ ఎన్నికలు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలుగా చెప్పొచ్చు. ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయాక ఎలాంటి ఉపాధిలేక కూలీలు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, పనులు లేక కాంట్రాక్టర్లు, సరైన జీతాలు పీఆర్సీలు లేక ప్రభుత్వ ఉద్యోగులు కొట్టుమిట్టాడు తున్నారు. చంద్రబాబు ఎన్నోఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న అపోహ ప్రజల్లో గట్టిగా ఉంది. ఇదే తెలుగుదేశం శ్రేణుల్లో భయాందోళన కలిగిస్తుంది. బాబు ఎన్ని హామీలిచ్చినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని చాలా మంది విశ్లేషకుల వాదన. అయితే కూటమిలో పవన్‌ కల్యాణ్‌, బీజేపీ ఉండటం వల్ల ఒకవేళ అధికారం వస్తే చంద్రబాబు ఒంటెద్దు పోకడలు సాగవని బీజేపీ, జనసేన నేతలు అంతర్గతంగా చెప్తున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విషయానికొస్తే ఈ ఐదేళ్లు ఓటు బ్యాంకు కోసం 1 కోటి 10 లక్షల కుటుంబాలకు నేరుగా రూ.2,70 లక్షల కోట్లు వివిధ పథకాల రూపేణా బ్యాంకు ఖాతాల్లో వేశారు. ఇది వాస్తవానికి మంచి పనే, కానీ ఇక్కడే ప్రతీ ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న, ఈ రాష్ట్రం అప్పుల్లో లేకుండా అభివృద్ధిలో ఉండి ఉపాధి ఉద్యోగాలు ఉండి ప్రభుత్వ ఖాజానాలో అదనపు నిధి ఉంటే పేదలకు పంచడంలో ఎలాంటి తప్పులేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో 12 లక్షల కోట్లు ప్రభుత్వ అప్పు ఉంది. ఉపాధి, ఉద్యోగాలు ఏ మాత్రం లేవు. కేవలం ఐదేళ్లకొకసారి ప్రభుత్వ మార్పిడి కోసం ప్రజలనుంచి తీసుకున్న డబ్బును తిరిగి వాళ్లకే పంచితే రాష్ట్రం దివాళ తీయక తప్పదు. ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడాలేని వనరులున్నాయి. ఇదే 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, పరిశ్రమలు, వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు కేటాయించివుంటే మరో పదేళ్లల్లో ఈ దేశంలో నంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉండేది. ఈ పథకాల వల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి సుమారు 100 గ్రామీణ నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు పూర్తిగా తనవైపు ఉంది. అదే జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యం. వాస్తవానికి ఈ ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉండటం వల్ల సుమారు 75 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలను మార్చడంలో ఆంతర్యమే ఇక్కడ ప్రశ్నించవచ్చు. ఇంత చేసినా పథకాలు పొందిన ప్రజలను జగన్మోహన్‌రెడ్డి నమ్మడంలేదు. పూర్తిగా వారిని నమ్మివుంటే 75 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలను మార్చే అవసరం ఉండేది కాదు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గేమ్‌ చేంజ్‌ చేయడమే జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యం. ఇందిరా గాంధీ అన్నట్లు ప్రజలు గొర్రెలే. ఎందుకంటే ఏది చెప్పినా నమ్ముతారు. జగన్మోహన్‌ రెడ్డి అంటున్నట్లు వై నాట్‌ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ ఎందుకు రావంటున్న విషయం ప్రజలు నమ్మవచ్చేమో కానీ, కొంచెం చదువుకున్న విద్యా వంతులు ఎవరూ నమ్మరు. ఇక్కడ ఒక్కటే… ప్రజలను అయోమయానికి గురిచేసి తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యం. ఇక్కడ వైసీపీకి అనుకూలించే అంశాలు.. నవరత్నాలు, 75 నియోజకవర్గాల సిటింగ్‌ ల మార్పు, బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయింపు. ఈ మూడిరటిమీదే జగన్మోహన్‌ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రస్తావన పూర్తిగా తెరమరుగైంది. చాలామంది వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనయుడన్న దృష్టితోనే ప్రజలు ఓట్లేస్తున్నారన్నది అసంభవం. ఎందుకంటే 2014 రాజశేఖర్‌ రెడ్డి చనిపోవడం, ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డి వైఎస్‌ఆర్సీపీతో తండ్రి బొమ్మతో ప్రజల్లోకి వచ్చినా కేవలం 68 సీట్లతో సర్దుకోవాల్సి వచ్చింది. రాజశేఖర్‌ రెడ్డి ప్రభావం ఉన్నప్పటికీ 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాకపోవడానికి రాష్ట్రం విడిపోవడం వంటి కారణాలతో, అనుభవజ్ఞుడైన వ్యక్తి కావాలన్న సంకల్పంతో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్రా ప్రజలు. ఈ ఐదేళ్ల కాలంలో కరోనా పరిస్థితులను దాటుకొని ఓడరేవులు, ఫిషింగ్‌ హార్బర్లు, ఫిషింగ్‌ ల్యాండ్స్‌, 15వేల రైతు కేంద్రాలు, వీలేజ్‌ క్లీనిక్‌ లు, నాడు-నేడు కింద పాఠశాలల ఆధునీకరణ, ఆంగ్లంలో బోధన, ఆసుపత్రుల ఆధునీకరణ, 17 మెడికల్‌ కాలేజీలు, రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో భారీ పరిశ్రమల కారిడార్లు, రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లో భారీ ఫ్లైఓవర్లు, విదేశీ విద్య, ఆరోగ్యశ్రీ వంటి ప్రాజెక్టులతోపాటు నవరత్నాలు వంటి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యారు. ఇక చంద్రబాబు విషయానికొస్తే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ఉపయోగించు కుని లబ్ధిపొందాలని చూస్తున్నారు. అలాగే కల్తీమద్యం, ఇసుక దోపిడీ, భూకబ్జాలు వంటి వాటితో ప్రతీ వేదికపైనా ప్రసంగిస్తున్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై గత ఐదు రోజులుగా, వైసీపీ ప్రభుత్వంపై గట్టిగా వ్యతిరేకతను కనపరుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు ఈసారి తనవైపే ఉన్నారన్న ఆశతో ఉన్నారు. అలాగే ఎలాంటి ప్రలోభాలకు గురికాని జనసైనికులపై మరింత ఆశపెట్టుకున్నారు. బ్రాహ్మణ, వైశ్య, ఆర్‌ఎస్‌ఎస్‌, కరుడుగట్టిన హిందూ ఓటుబ్యాంకు తమవైపే ఉంటుందని చంద్రబాబు ఆశపెట్టుకన్నారు. అయితే టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్న 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిర్ణయించకపోవడం ఆయా నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకులు అంతర్గతంగా వైసీపీకి మద్దతిస్తున్నారన్న సమాచారం ఉంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కొన్ని సామాజిక వర్గాల్లోని ప్రముఖ నేతలకు సముచిత స్థానం కల్పించలేదన్న అపోహవుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు అత్యంత క్రీయా శీలక పాత్రను పోషిస్తున్నాయి. వైసీపీకి న్యూట్రల్‌ మీడియాగా ఉన్న టీవీ 9, ఎన్టీవీ, 10టీవీ, సాక్షి టీవీ, సాక్షి పత్రిక పూర్తిస్థాయి మద్దతుగా నిలిచాయి. ఏబీఎన్‌, టీవీ5, ఈటీవీ, మహాన్యూస్‌, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తెలుగుదేశం వైపు నిలిచాయి. ఈ హోరా హోరీలో ఎన్నో సర్వే సంస్థలు, పత్రికలు, టీవీలు టీడీపీ, వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయి.. అన్ని సీట్లు వస్తాయని చెప్పుకుంటూ వచ్చాయి. జాతీయ మీడియాలు కూడా ఐవీఆర్‌ఎస్‌ సర్వేలతో కొన్ని టీడీపీకి, మరి కొన్ని వైసీపీకి మొగ్గుచూపాయి. 12వ తేదీ రాత్రి జరిగే ఓటుకు నోటు విషయంలో ఎవరు ఎక్కువ పంచితే వారికే అవకాశం ఉంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు. ఏది జరిగినా కేవలం మూడుశాతం ఓట్లతో జగన్మోహన్‌ రెడ్డి లేదా చంద్రబాబు సీఎం అవుతారు.

రామారావు, సీనియర్‌ జర్నలిస్టు,
సెల్‌: 9030715343

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img