Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఊపిరి పోసిన వ్యాఖ్యలు

కూన అజయ్‌బాబు

ఉన్మాదులు, మతోన్మాదులు, అవినీతిపరులు, అక్రమార్కులు రాజ్యమేలే రోజులు వచ్చి ఉండవచ్చు. హక్కుల హననం మూకుమ్మడిగా సాగుతుండవచ్చు. మా రాజ్యంలో రాజ్యాంగాన్ని ఉక్కుపాతరేస్తామని బీరాలు పలికేవారూ ఉండవచ్చు. ఆ దిశగా వారి కుయుక్తులు సాగుతున్నట్లుగా అన్పించవచ్చు. కానీ అదే సమయంలో దేశంలో హక్కుల గురించి మాట్లాడేవారు ఇంకా వున్నారని తాజా ఉదంతాలు చూస్తే ఊరట కలుగుతోంది. ఇటీవల పది రోజుల వ్యవధిలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ రెండు వ్యాఖ్యలు చేశారు. ఈ న్యాయవ్యవస్థను బాగుచేయడానికి, దాన్ని పట్టిపీడిస్తున్న రాజకీయ మూకలను తరిమికొట్టడానికి, దేశాన్ని వినాశనం చేస్తున్న కొన్ని జాడ్యాలను నిర్మూలించడానికి జస్టిస్‌ రమణ పడుతున్న తపన ఈ వ్యాఖ్యల్లో స్పష్టమవుతున్నది. ఆ రెండు వ్యాఖ్యానాలకు సరైనరీతిలో భాష్యం చెప్పుకుంటే కచ్చితంగా హక్కులకు ఊతం లభించగలదు. రాజద్రోహం కేసులు, ట్రిబ్యునల్స్‌ విషయంలో ప్రభుత్వాల అరాచక విధానాలను ఆయన ఎండగట్టిన తీరు అద్వితీయం.
సర్కారు మారినప్పుడల్లా రాజద్రోహం కేసులు పెడుతూ హక్కులను చంపేస్తున్న ప్రభుత్వాల వైఖరి తీవ్ర ఆందోళనకర పరిణామంగా జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌ పోలీసు ఉన్నతాధికారి గుర్జీందర్‌సింగ్‌పై రాజద్రోహం కేసు పెట్టడానికి జరిగిన ప్రయత్నాన్ని ఆయన తిప్పికొట్టారు. పోలీసులపై రాజద్రోహం కేసులు పెడుతున్నారా అన్న సందేహం తలెత్తక మానదు. న్యాయపాలన (రూల్‌ ఆఫ్‌ లా)ను ఆమోదించి, పాటిస్తే ప్రస్తుత దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడి ఉండేవికావు. ఈ విషయంలో పోలీసులు కూడా మారాల్సిన అవసరం వుంది. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తే ఆ తర్వాత కచ్చితంగా వారికి సమస్యలు వస్తాయి. పోలీసులు అధికార పార్టీ వైపు ఉన్న సమయంలో వారిపై ఎలాంటి రాజద్రోహం కేసులు నమోదుకావు. ఆ పార్టీ అధికారం నుంచి దిగగానే రాజద్రోహం కేసులు మొదలవుతున్నాయి. ఇది సరికొత్త పోకడ. దాన్ని ఆపాల్సిన అవసరం వుందని జస్టిస్‌ నొక్కి వక్కాణించడం శుభపరిణామం. 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి గుర్జీందర్‌ పాల్‌ సింగ్‌ ఛత్తీస్‌గఢ్‌లో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయ్‌పూర్‌, దుర్గ్‌, బిలాస్‌పూర్‌ వంటి ప్రాంతాల్లో ఐజీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన అదనపు డీజీపీ హోదాతో పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా వున్నారు. కేసుల కారణంగా సస్పెండయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అవినీతి నిరోధక శాఖ (ఎసిబి), ఆర్థికనేరాలవిభాగం అధికారులు మూకుమ్మడిగా ఆయన నివాసాలపై దాడులుచేసి, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నట్లు కేసు నమోదు చేశారు. వివిధ వర్గాల మధ్య విభేదాలు కలిగేలా ఆయన వ్యవహరిస్తున్నారని, అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్ను తున్నారంటూ రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఆయన గతంలో ఏ పార్టీకి అనుకూలంగాపనిచేశారు? ఇప్పుడు ఏ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? అనే ప్రశ్నలు పక్కనబెడితే, తమకు అనుకూలంగా లేనివారిపై రాజద్రోహం కేసులు బనాయిస్తున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. రాజద్రోహం కేసులు చాలా ఇబ్బందికర పరిణామంగా మారాయని, దీని వల్ల దేశంలో విచారకర పరిస్థితులు దాపురిస్తున్నాయని జస్టిస్‌ రమణ సారథ్యంలోని ద్విసభ్య ధర్మాసనం చేసిన వ్యాఖ్య…హక్కుల కార్యకర్తల వాదనతో ఏకీభవిస్తున్నది. సంబంధిత అధికారి ఇంట్లో సోదాలు చేసిన సమయంలో చించి పారేసినకాగితాలు దొరికాయని, వాటిని అతికించిచూస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసినట్లు తేలిందని అధికారులు వాదించారు. ఈ వ్యవహారం సరిగ్గా బీమా కొరెగావ్‌ కేసు, వరవరరావు తదితరుల అరెస్టుల తరహాలోనే వుంది. అంటే రాజద్రోహం కేసు పెట్టడానికి ఏదో ఒక సాకు తప్పదని నిర్ధారణయింది.
అన్నింటికీ మించి కోర్టు తీర్పులంటేనే ప్రభుత్వాలకు గౌరవం లేకుండా పోయింది. కోర్టు ఏదైనా తీర్పునిస్తే, దానికి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకురావడమనేది కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది. ట్రిబ్యునళ్లలో నియామకాలు చేపట్టకుండా వాటిని నాశనం చేస్తారా అని ఇటీవల చీఫ్‌జస్టిస్‌ రమణ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసుల సత్వరపరిష్కారానికి, కొన్ని విభాగాల్లో సమస్యల పరిష్కారంలో జాప్యం జరగకుండా ఉండటానికి ట్రిబ్యునళ్లు చేస్తున్న కృషి గొప్పది. కానీ సెంట్రల్‌ గూడ్స్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ (సీజీఎస్‌టి) ట్రిబ్యునల్‌ ఏర్పాటుతోపాటు సాయుధ దళాల ట్రిబ్యునల్‌ (టిఎఫ్‌టీ), జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) తదితర కీలక ట్రిబ్యునల్స్‌లో ఛైర్‌పర్సన్లు, సాంకేతిక సిబ్బంది నియామకాలు జరగడం లేదు. వాటిని నిర్వీర్యం చేసే పనిలో ప్రభుత్వం ఉంది. తమ సహనాన్ని పరీక్షించవద్దని జస్టిస్‌ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం చేసిన హెచ్చరిక సరైనదే. కొన్ని వర్గాల హక్కులు నిలబడటానికి ట్రిబ్యునల్స్‌ను పరిపుష్టం చేయడం అవసరం. అదేవిధంగా రాజద్రోహ చట్టాన్ని తక్షణమే రద్దు చేయడం అంతకన్నా అవసరం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img