Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కనిష్ఠ స్థాయికి దారిద్య్రం` నిజమా, కలా!

మక్కెన సుబ్బారావు

మన దేశంలో నిరుపేదల సంఖ్య దేశ జనాభాలో 5 శాతం దిగువకు తగ్గినట్లు నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఒ) గణాంకాలు తెలియజేస్తున్నాయి. నమ్మక తప్పదు. తమ పదేళ్లపాలనలో 20 కోట్లు మందిని దారిద్య్రం నుండి బైటకు తెచ్చామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ప్రకటించాక మీరు 5 శాతం సంఖ్యను నమ్మనంటే మీలో ఏదో లోపం ఉన్నట్లే! ఎన్‌ఎస్‌ఎస్‌ఒ సర్వే ఫలితాలను గణాంక మంత్రిత్వశాఖ అసాధారణంగా శనివారం (24వ తేదీ) పొద్దుగుంకాక విడుదల చేసింది. తెల్లవారితే ఆదివారం సెలవుదినం. కాబట్టి దేశ ప్రజలకు ఈ శుభవార్త చెప్పడానికి సోమవారం దాకా ఆగటం మహాపరాధమవుతుందని సంబంధీకులు భావించి ఉండవచ్చు. 202223 సంవత్సరంలో నెలసరి తలసరి వ్యయం(ఎంపీసీఇ) ప్రాతిపదికగా ఈ నిర్ధారణ చేశారు. నీతి ఆయోగ్‌ సీఇఓ బివిఆర్‌ సుబ్రహ్మణ్యం దీన్ని సమర్థిస్తూ, చూశారా ఆహార ద్రవ్యోల్బణం అదుపు అంటూ రిజర్వుబ్యాంక్‌ దాని అమలుపైనే దృష్టిపెట్టింది. తాజా గణాంకాల ప్రకారం, ద్రవ్యోల్బణ స్థాయి తగ్గుతుంది. ఆర్‌బీఐ దీన్ని పరిగణలోకి తీసుకుని వృద్ధి ప్రోత్సాహంపై అనగా ‘వడ్డీరేట్లు తగ్గింపుపై దృష్టి సారించాలి’ అన్నారు. అంటే దేశ ప్రజలు బ్యాంకుల్లో పోగుచేసుకున్న డబ్బును నామమాత్రపు వడ్డీరేటుకు పెట్టుబడిదారులకు ధారపోయాలి, వారు అది భోంచేసి తనకు పరిశ్రమలు/కంపెనీలు దివాలా ప్రకటిస్తే, వాటిని ఐబిసి (ఇన్‌సాల్వెన్సీదివాలా) అండ్‌ బ్యాంక్‌ ట్రప్సీ కోడ్‌కు నివేదించి, రూపాయికి 1025పైసలు కాబట్టి బ్యాంకుల కొంపముంచాలి. మోదీ ప్రభుత్వం 2016లో ఐబిసి తెచ్చింది. ఈ అప్పులుమారి కొంపను రిపేరు చేసుకునేందుకు, సామాన్య రుణగ్రహీతల నుండి వడ్డీ రుపేణా పిండిన లాభాన్ని ఆ నష్టాలకు సర్దుబాటుచేసి తమ ఆర్థిక నిర్వహణ సమర్థవంతమైనదిగా పాలకులు చాటుకునే అవకాశం కల్పించాలి. ఇదీ ఇప్పుడు సాగుతున్న, మున్ముందు సాగే రుణభాగోతం. మోదీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో దాదాపు 15 లక్షల కోట్లు మొండి బాకీలను మాఫీ చేసింది. ఆ నష్టాన్ని బ్యాంకులు పైన చెప్పిన పద్ధతిలో భర్తీ చేసుకున్నాయి. నష్టపోయిందెవరు? ప్రజలు. లాభపడిరదెవ్వరు కార్పొరేట్‌లు, ఇతర పారిశ్రామిక, వర్తకవాణిజ్యవేత్తలు ఎగనామంపెట్టిన అప్పుల ముద్దుపేరు ఎన్‌పీఏలు (నిరర్థక ఆస్తులు). ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలో ఇదొక పార్శ్వం. అలా లక్షల కోట్లు దోచుకున్నవారికి శిక్షలేమీ ఉండవు. కొందరు ఘరానా పెద్దలు విదేశాలకు పోయినా ఏమీ చేయలేని నిస్సహాయత ప్రభుత్వానిది.ఇక అసలు విషయంలోకి వద్దాం. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ ప్రతి ఐదేళ్లకు తలసరి గృహవినియోగం వ్యయం సర్వే గణాంకాలు ప్రచురించాలి. 201112 తర్వాత ఆ పద్ధ్దతికి బ్రేకుపడిరది. ఇప్పుడు 2022 ఆగస్టు2023 జులై మధ్య సర్వే గణాంకాలు ప్రచురించారు. ఆ లెక్కలు ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, 201218లో వినిమయం, ఉపాధిపై సర్వేలు నిర్వహించినా, ఫలితాలు మోదీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉన్నందున ప్రభుత్వం వాటిని తొక్కిపెట్టింది. 2016 చివరిలో పెద్ద కరెన్సీనోట్ల చలామణీ రద్దుచేశాక ఆర్థికవ్యవస్థపై చూపిన దుష్ప్రభావాలు ఆ సర్వేలో ప్రతిఫలించినందున ప్రభుత్వం దాన్ని బుట్టలో పడేసింది. ఆ తర్వాత కాలంలో ప్రవేశపెట్టిన గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ (జీఎస్‌టీ) విధానం కూడా ఆర్థిక వ్యవస్థను కుళ్లబొడిచింది. పెద్దనోట్ల రద్దు ్‌, జీఎస్‌టీలను తమ ఘనకార్యాలుగా (తప్పు ఒప్పుకునే అలవాటు లేదుకదా!) చెప్పుకునే మోదీ ప్రభుత్వం నల్లేరుపై నడకగా సాగుతున్న తమ ప్రయాణానికి భంగకరమైన వాస్తవాలను వెల్లడిరచే సర్వేలను ఎలా అనుమతిస్తుంది. మన భ్రమ, అత్యాశ కాకుంటే! పేదరికం, దారిద్య్ర నిర్మూలన పథకాల రూపకల్పన నిమిత్తం ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా వాస్తవాల అధ్యయనానికై కమిటీలు వేస్తుంటాయి. మన దేశంలో కూడా వివిధ కాలాల్లో నియమించిన లక్డావాలా, సురేశ్‌ తెందూల్కర్‌, సి.రంగరాజన్‌ కమిటీలు అటువంటివే. అవి ఆహార, వినిమయం, వ్యయం ప్రాతిపదికంగా దారిద్య్రరేఖ నిర్ణయిస్తుంటాయి. ప్రపంచబ్యాంక్‌ అంతర్జాతీయ దారిద్య్రరేఖ నిర్ణయిస్తుంటుంది. కనీస ఆహారం, దుస్తులు, ఆవాసం నీటిపై వ్యయమే ప్రాతిపదిక. వైద్యం, విద్య రవాణా వగైరా పరిగణనలోకి తీసుకోదు. 2015 అంచనా ప్రకారం రోజుకు వ్యయం 1.25 డాలర్లు, 2022లో దాన్ని 2.15 డాలర్లకు సవరించారు. 2012లో ప్రపంచబ్యాంకు అంచనాల ప్రకారం ప్రపంచంలో 89.7 మిలియన్‌ నిరుపేదలున్నారు. 2022 నాటికి ఆ సంఖ్య 68.5 కోట్లకు తగ్గుతుంది. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఒక వ్యక్తి జీవన నాణ్యతలో గణనీయమైన వ్యత్యాసం తీసుకురాదనేది దీనిపౖౖె ఉన్న విమర్శ. విద్య, ఆరోగ్యంపై వ్యయాన్ని నిర్దిష్టంగా అంచనా వేసేందుకు పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుచ్ఛక్తి ఆ వ్యక్తుల జీవితాలపై చూపే ప్రభావాన్ని కలుగజేసే అవకాశాలను పరిమాణాత్మకంగా లెక్క కట్టలేము. 2011లో సురేశ్‌ తెందుల్కర్‌ కమిటీ గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ.27.20, పట్టణప్రాంతాల్లో రూ.33.30 పైసలను దారిద్య్రరేఖగా సిఫారసు చేసింది. 2014 జూన్‌లో నివేదిక సమర్పించిన రంగరాజన్‌ కమిటీ గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ.32.24 లోపు పట్టణప్రాంతాల్లో రూ.47లోపు ఆదాయార్జనను దారిద్య్రరేఖగా నిర్ణయించింది. అంటే ఐదుగురి సభ్యుల కుటుంబానికి పట్టణాల్లో నెలకు కనీసం రూ.7035, గ్రామాలలో రూ.4860 ఆదాయం మించితే వారు దారిద్య్రరేఖను అధిగమించినట్లే! ఆ లెక్కన పట్టణ జనాభాలో 26.4 శాతం మంది గ్రామీణ జనాభాలో 30.9శాతం దారిద్య్రరేఖ దిగువన ఉన్నారు. అఖిలభారత సగటు 29.5శాతం. 2011, 2012 లో దేశం మొత్తం మీద 36.3 కోట్ల నుండి దారిద్య్రరేఖ దిగువన ఉన్నారు. దీని ప్రకారం, 20092010లోని 39.6శాతం నుండి 201112 లోని 30.9శాతాన్ని తీసివేసే రెండేళ్లపైబడిన కాలంలో బిపిఎల్‌ కుటుంబాలు 8.7శాతం తగ్గాయి. అంటే 9.16 కోట్ల మందిని దారిద్య్రం నుండి పైకి తెచ్చామని యుపిఏ ప్రభుత్వం చెప్పుకున్నది.. ఇప్పుడు మోదీ ప్రభుత్వమే దారిద్య్రరేఖ నుండి 20 కోట్లమందిని గట్టెక్కించామంటోంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రీసెర్చర్స్‌ నెలకు తలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1662, పట్టణప్రాంతాల్లో రూ.1929 కొత్త దారిద్య్రరేఖగా అంచనావేశారు. గ్రామీణ దారిద్య్రం 201112లో 25.7శాం నుంచి 7.2శాతానికి, పట్టణాల్లో దారిద్య్రం 4.6 శాతానికి తగ్గినట్లు వీరి అంచనా. కనీస ఆహారం, దుస్తులు, ఆవాసం మాత్రమే ఈ రేఖ నిర్ణయానికి ప్రమాణం అని మరిచిపోరాదు.
ఎన్‌ఎస్‌ఎస్‌ఒ ఏమి చెబుతున్నదంటే, 2011`12లో ఆమోదించిన దారిద్య్రరేఖ రోజుకు. రూ.32కు అప్పటినుంచీ ఉన్నా ద్రవ్యోల్బణ ధోరణులను లెక్కలోకి తీసుకుంటే అది రోజుకు రూ.60 అవుతుంది. అప్పుడు దారిద్య్రం 10శాతం లోపు ఉంటుంది. ఎందుకంటే, గ్రామీణ భారత్‌లోని దిగువ 5శాతం నుండి 10శాతం జనాభా సగటు వ్యయం రూ.1782 ఉంటుంది. నీతి ఆయోగ్‌ సీఈఓ సుబ్రహ్మణ్యం అవగాహన ప్రకారం, పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన లేదా సబ్సిడీకి గ్యాస్‌ సిలిండర్‌లు వంటి వాటి ద్వారా అందుకున్న ఆహార బదిలీలు, సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుంటే, దారిద్య్ర బాధితులు 5శాతం లోపే ఉంటారు. అంతేగాక ఆరోగ్య సంరక్షణ, ఉచిత విద్య వంటి అంశాలను కూడా కలిపి చూడాలి అంటారు. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ వారి తాజా కుటుంబ వినిమయ వ్యయం సర్వే (హెచ్‌సిఇఎస్‌) ప్రకారం, ఆహారం, పానీయాల మీద పేదలు పెడుతున్న ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో 52.9శాతం నుంచి 46.4 శాతానికి తగ్గింది. అదే విధంగా పట్టణప్రాంతాల్లో అది 39.2 శాతానికి తగ్గింది. దీన్నిబట్టి వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ని సమూలంగా మార్చాల్సి ఉంటుంది. అందువల్ల రిజర్వుబ్యాంకు రిటైల్‌ ద్రవ్యోల్బణం గూర్చి పునరాలోచించాలి. దాని ప్రాతిపదికగా ఉన్న వడ్డీరేట్లను తగ్గించి వృద్ధి వేగం పెంపుదలకు తోడ్పడాలి. ఇదీ సుబ్రహ్మణ్యం ధోరణి. అయితే నిత్య జీవితావసర వస్తువుల ధరల పెరుగుదలను, ఆహారోత్పత్తుల ధరల్లో ఆకస్మిక ఎగుడు దిగుళ్లకు, పెరిగి కూర్చున్న విద్యుత్‌, ఆయిల్‌, వంటగ్యాస్‌ రేట్లు, విద్య, వైద్యం, రవాణా, ఇంటి అద్దెలు పెరుగుదల వగైరాలను పరిగణనలోకి తీసుకుని జీవన వ్యయాన్ని లెక్కిస్తే దారిద్య్రరేఖను పెంపు చేయాల్సి ఉంటుంది. కాలంతోపాటు మనుషుల అవసరాలు వారు అట్టడుగువారైనా, మధ్య తరగతులైనా పెరుగుతూ ఉంటాయి. కేవలం కూడు, గుడ్డ, గూడు మాత్రమే మనిషిని ఈ 21 వ శతాబ్దంలో సంతృప్తి పరచవు. అంతేగాక తొందరపడి దారిద్య్రరేఖ, ద్రవ్యోల్బణం, జీడీపీ అంచనాలను సవరించకూడదు. కుటుంబ వ్యయం ధోరణులు స్థిరంగా బలంగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఈ జులైలో సమాప్తం కానున్న తాజా సర్వే కోసం వేచిచూడటం మంచిది. ఎందుకంటే, దారిద్య్రం తగ్గుదల ప్రభావం కాగితాలపై లెక్కల్లోగాక ఆ శ్రేణి ప్రజల జీవనంలో ప్రతిఫలించాలి.
సీనియర్‌ జర్నలిస్టు, సెల్‌: 9390683756

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img