Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

కర్తవ్యం


` చింతపట్ల సుదర్శన్‌
ఉన్నచోటే నిలబడి ఒళ్లు విరుచుకుంది డాగీ. వీపు సాగదీసింది. నాలుకతో మూతి రాసుకుంటూ తోక ఊపసాగింది. డాగీ చేష్టలు డాంకీకి అర్థమైనవి. హలో బ్రదర్‌! ఏమిటా హడావిడి. ఎక్కడికి బయలుదేరావు అంది. ఎక్కడికేమిటి? పొట్ట తిప్పలు అందరికీ తప్పవు కదా. బ్రేక్‌ఫాస్టో, లంచో, రెక్కాడితే కాని డొక్కాడదు మరి అంది డాగీ. నువ్వు ఇప్పుడు అరుగు దిగితే రెక్క సంగతేమో కాని డొక్క మాత్రం చిరుగుద్ది జాగ్రత్త. ఏం? ఎందుకని? అంది డాగీ. నిన్నటి పేపర్‌ తింటుంటే తెలిసింది. పెద్ద బజారులో ఓ వీధి కుక్క పదిమందిని కరిచిందట. జనం గగ్గోలు పెడుతున్నారట. కుక్క కనబడితే కొట్టి చంపడానికి కర్రలతో తిరుగుతున్నారట. ఆ కుక్కనేనా? కుక్కలన్నింటినీనా? ఏ కుక్క కరిచిందో ఎవ్వడెరుగు కనిపించిందాన్నలా కొట్టి చంపుతారు. నువ్వివ్వాళ శివరాత్రి అనుకుని ‘ఫాస్టింగ్‌’ పాటించు. మధ్యాహ్నం ఎవరూ లేని వేళల్లో చెత్తకుండీకి వెళ్దువుగాని అంది డాంకీ.
అదెక్కడి కుక్కో? ఎవర్ని కరిచిందో! మధ్యన నాలాంటి అమాయకులు బలవ్వాల్సిందేనా! అసలు కరవడమెందుకు ఊరికే అరిస్తే సరిపోదా మీకు అంది డాంకీ. జనరల్‌గా జనం మాజోలికి వస్తే భయపెట్టటానికి అరుస్తాం కానీ తప్పని సరైతే తప్ప కరవం. ఒకవేళ ఏ కుక్కయినా కరిస్తే అందుకు బాధ్యులు దేశాన్ని ఏలే రాజకీయ నాయకులే అంది డాగీ. ఇదే మరి ‘ఓవరాక్షన్‌’ అంటే. రాజకీయ నాయకులకు వీధి కుక్కలకు సంబంధ మేమిటసలు. మీలాగానే వాళ్లూ అరుస్తారు. అదొక్కటే కదా కామన్‌ పాయింటు. అది అందరికీ తెల్సిన ‘ఫ్యాక్టే’ కానీ వీళ్లు చెయ్యబట్టే కదా ఊళ్లో చెట్టు అనేది లేకుండా పోయింది. వీళ్ల అండ వల్లేకదా రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ బరి తెగిస్తున్నది. చెరువుల్ని తాగేస్తున్నది, గుట్టల్ని నమిలేస్తున్నది. ఏటేటా కోటి చెట్లు నాటుతాం అని హంగామా చేస్తారు కానీ కనీసం ఈ ఊళ్లో మాలాంటి కుక్కలం ‘రెస్టు’ తీసుకోవడానికి చెట్టు నీడ కూడా లేకుండా చేశారు. ఈ ఎండల తీవ్రతకు ఏ కుక్క తల్లో అయినా పురుగు తిరక్క మానదు. అలా తిరిగినప్పుడు కసితీరా మనుషుల్ని కరవాలని ప్రతి కుక్కకూ నాతో సహా అనిపిస్తుంది. నేరం మాది కాదు పర్యావరణాన్ని చించి పోగులు పెడ్తున్న ప్రభుత్వాలది. ప్రభుత్వాలను తాము డబ్బిచ్చి కొనుక్కున్న ఓట్లతో, నడిపిస్తున్న ప్రజా ప్రతినిధులది అంది కుక్క అలుపు తీర్చుకోడానికి కింద కూలబడుతూ.
కనీసం కుక్కల కన్నా కూచోడానికి చెట్టునీడ లేదని పిచ్చెక్కి పోతున్నాయని దారెంట పోయేవాళ్లకు ‘బైటింగ్‌ గ్రీటింగ్స్‌’ చెప్తున్నాయంటున్నావు ఓ.కే. కానీ ఓట్లు కొనుక్కున్న ప్రభుత్వాలనే మాటే ‘కన్‌ఫ్యూజింగ్‌’ గా ఉంది అంది డాంకీ. నేనన్న దాంట్లో మామూలు నిజం కంటే పచ్చి నిజమే ఎక్కువ. మొన్న సాయంత్రం ఆ ఎదురుగ్గా ఉన్న అపార్టుమెంటు వాళ్లందరినీ వాళ్ల ఊర్లకి తీసుకుపోవడానికి టూరిస్టు బస్సులు వచ్చినవి కదా. బస్సు ఎక్కే వాళ్లల్లో ఒకడు మూడు వేలంటే మరొకడు ఐదువేలు అనడం వినలేదా నువ్వు. ఓటుకింత అని ఇస్తే తప్ప ఓటు వెయ్యం అనే ఓటర్లు ఎందరో ఉన్నారు. ఓటుకు నోటు సరే, ఓటేస్తే అన్ని పార్టీల వారూ పోటీలు పడి ఇస్తామనే ఉచితాలు అన్నీ బహిరంగ ‘లంచ’ ప్రకటనలే కదా! విద్య, వైద్యం, ఉద్యోగం గురించి ఎవరన్నా హామీలు ఇస్తున్నారా. మహా అయితే ఎవరయినా ఓ కోటి ఉద్యోగాలిస్తామని ఉత్తుత్తి హామీలు ఇచ్చినా జనం నమ్మరు. అందరూ బలంగా విశ్వసించేది ఉచితాలను మాత్రమే.అందువల్ల ప్రభుత్వాల్ని డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు అన్నాను, అక్షరం పొల్లు పోదు నా మాటల్లో అంది డాగీ.
అంటే డబ్బు, ఉచితాలు అందుతాయంటే తప్ప ఓట్లు వెయ్యరా ఎవ్వరూ? పౌరులకు బాధ్యతన్నదే లేదని ఆరోపిస్తున్నావా? ‘దిసీజ్‌ టూ మచ్‌’ అంది డాంకీ. ‘త్రీ మచ్‌’ అనుకున్నా ఫర్లేదు. మన గ్రౌండుకు ఎదురుగ్గా ఉన్న ఇంట్లో ఎనభై అయిదు ఏళ్లు దాటిన భార్యాభర్తలు ఇద్దరి చేతా ఓట్లు వేయించుకున్నారు అధికార్లు కారులో వచ్చి చూశావు గదా! అది పాత జనరేషన్‌ కమిట్‌మెంట్‌. ఓటు వెయ్యకపోతే ఏదో తప్పు చేశామన్న భావన ఉండేది వాళ్లల్లో. ఇప్పటి యంగ్‌ పీపుల్ని చూడు. ఎన్నికల రోజు ‘హాలీడే’ ఎంజాయ్‌ చేసేవాళ్లే ఎక్కువ. ఓటు వేయడంవల్ల ఒరిగేదేమిటి? అన్ని పార్టీలూ ఒక్కటే, అందరు లీడర్లూ ఒకటే. పదవుల కోసం పార్టీలు మార్చేవాళ్లే. మన డబ్బుతో ఉచితాలు ఇవ్వడానికి, కోట్లు కూడబెట్టుకోవడానికి, వాళ్లకు ఓట్లు వెయ్యడం అవసరమా? మనం వెయ్యకపోతే ప్రజాస్వామ్యం బతకదా? బట్టకట్టదా? అనే వాళ్లే ఎక్కువ. ఓటింగు శాతం చూస్తే తెలుస్తుంది అని డాగీ అంటుండగా అరుగు ఎక్కాడు అబ్బాయి. ఓటింగ్‌ శాతం దాకా వెళ్లిందా మీ డిస్కషన్‌ అన్నాడు కూర్చుంటూ. చూడు తంబీ ఇవాళ మన డాగీ ‘చాలా హాట్‌ గురూ’ అన్నట్టు దంచేస్తున్నది అంది డాంకీ. ఉచితాల కోసమూ, బటన్లు నొక్కించుకోడం కోసమూ, ఓటు వేసే వాళ్లు ఎక్కువయ్యారని, ఈతరం వాళ్లు ఎలక్షన్‌లను ‘లైట్‌’ తీసుకుంటున్నారని, చాలామంది ఓటు వెయ్యడానికి ఇళ్లల్లోంచి కదలడం లేదని, చదువుకున్న వాళ్లూ, అన్నీ తెలిసిన వాళ్లూ ‘రెస్పాన్సిబిల్‌’ గా ఫీలయ్యి ఓటు వెయ్యకపోతే నీతీ, జాతీ, మంచీ, మానవత్వం మంటగలిసిపోతున్నాయన్నది డాగీ.
ఏవో కుంటిసాకులు చెప్తూ, ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకం అయ్యే విధంగా ప్రవర్తించకుండా అందరూ ఓటు వెయ్యడం తమ కర్తవ్యం. ఈసారి జనం ఆ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించకపోతే మళ్లీ ఎన్నికలప్పుడు ‘ఓటు వెయ్యనివాడు నాతో సమానం’ అని వీపు మీద పెద్దపెద్ద అక్షరాలతో రాయించుకుని ఊరంతా తిరుగుతా అంది డాగీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img