Monday, April 22, 2024
Monday, April 22, 2024

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలి

ఉజ్జిని రత్నాకరరావు

తెలంగాణ ఉద్యమం నీళ్లలో పుట్టిన నిప్పు, పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే సరిపోదని, పునర్‌ నిర్మాణంలోనూ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ చెప్పిన మాటలు నేడు అక్షరాల నిజం అనిపిస్తుంది. ఉద్యమపార్టీ అనిచెప్పి అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌, ఆత్మబలి దానాలతో తెచ్చుకున్న తెలంగాణకు కృష్ణా జలాల విషయంలో జరుగుతున్న అన్యాయంపై కేంద్రంతో తలపడటానికి వెనుకంజ వేస్తుందనే చెప్పాలి. అందుకు నిదర్శనం ఏడు సంవత్సరాలుగా కృష్ణ్ణా నీటిలో వాటా తేల్చుకోక పోవడమే. నిన్నటిదాకా కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షించమని మొరపెట్టుకున్నా కేంద్రం నుంచి స్పందన లేదు. ఇప్పుడేమో ఈ నదులపై బోర్డులను ఏర్పాటు చేసింది. వాటిపై పూర్తి పెత్తనం తన చేతిలోకి తీసుకుంది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నీటిపారుదల శాఖ పనితీరు అంతా తమ చేతుల్లో పెట్టుకోవాలని గెజిట్‌ తీసుకొచ్చింది. రెండు రాష్ట్రాలకు సంబంధం లేని అధికారులతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ బోర్డు వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరగకుండా నది యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్యాయమే కొనసాగుతుంది. కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై లేని ఆంక్షలు, అధికారాలు మనపై ఎందుకు? మన రాష్ట్రంపై బోర్డుల రూపంలో కేంద్రం విశిష్ట అధికారాలు చెలాయించబోతోంది. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా నీటిని వాడుకునే అవకాశం లేదు. నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులు ఆగిపోతే తెలంగాణ ప్రాంతం మునుపటి దుర్భర స్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఉమ్మడిరాష్ట్రంలో కృష్ణాకు వరదలు వచ్చినప్పుడు అదనపుజలాలను ఉపయోగించుకొనుటకుగాను కరువుప్రాంతంగా ఉన్న తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండజిల్లాలకు సాగు, తాగునీరు అందించ టానికి కల్వకుర్తి (1999), ఎస్‌ఎల్‌బిసి (1983), నెట్టెంపాడు (2005), భీమా(1996), పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల(2013) పథకాలను, కరువుసీమ ప్రాంతమైన రాయలసీమకు నీరు అందించటానికి తెలుగు గంగా ఎస్‌ఆర్‌బిసి 1983, గాలేరునగరి, హంద్రీనీవా, వెలుగొండ, పోతిరెడ్డిపాడు (2005) తదితర ప్రాజెక్టులను చేపట్టి నిర్మాణ పనులు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మద్రాసుకు తాగునీరు అందించేటందుకు తెలుగుగంగను (ఎస్‌ఆర్‌బిసి), ఇంకా పోతిరెడ్డిపాడుకు అధికప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయడంతో పాటు 2004లో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుండి 44 వేల క్యూసెక్కులకు సామర్థ్యాన్ని పెంచి పూర్తి చేసారు. ఒకేసారి చేపట్టిన ఎస్‌ఎల్‌బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతలకు నిధులు ఇవ్వకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసారు. 2014 జూన్‌లో రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఆ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలని, ఇందుకు అదనపు వరద జలాలు ఉపయోగించుకోవాలని తెలంగాణలో డిరడి ఎత్తిపోతలు (2007), పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (2015) సామర్థ్యాన్ని పెంచుతూ, ఆంధ్రలో రాయలసీమ ప్రాంతానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు (2021) పెంచుతూ, సంగమేశ్వరం (రాయలసీమ) ఎత్తిపోతల (2021) శ్రీశైలం 800 ఫీట్ల అడుగుల నుండి 3 టిఎంసిలు తీసుకునే విధంగా పథకాన్ని ఆంధ్రప్రభుత్వం చేపట్టింది. వీటిపై రెండురాష్ట్రాలు ఒకరిపైఒకరు కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్రజలశాఖకు, సుప్రీంకోర్టుకు ఫిర్యాదులు చేసుకునేవరకు వెళ్ళారు. తక్షణమే పనులు ఆపాలని, జరుగుతున్న పనులపై డిపిఆర్‌లు పంపించాలని కెఆర్‌ఎంబి నుండి రెండు రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చారు. ఏకపక్షంగా బోర్డులు ఏర్పాటు చేసిన కేంద్రం రెండు రాష్ట్రాల మధ్య జల జగడాలు ఆసరాగా తీసుకొని సామరస్య పరిష్కారానికి కృషి చేయకపోగా, కనీసం ముఖ్యమంత్రులతో గాని, తెలుగు రాష్ట్రాల అధికారులతోగాని చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం జులై 15 అర్ధరాత్రి గెజిట్‌ విడుదల చేసారంటే రెండు రాష్ట్రాల మీద పెత్తనం చెలాయించాలనే దుష్ట పన్నాగమే. వివాదానికి మూలమైన కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు వివాదాలు లేని గోదావరి నదిపై నిర్మితమైన ప్రాజెక్టులను కూడా కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడం ఎందుకు? అన్న ప్రశ్న వినిపిస్తోంది. తాజా గెజిట్‌ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన, నిర్వహించాలనుకుంటున్న ప్రాజెక్టులు మాత్రమే కాకుండా మొత్తం ఆయకట్టు అజమాయిషీ కేంద్రం చేతుల్లోకి వెళుతుంది. అంటే రెండు రాష్ట్రాలపై పెత్తనం చెలాయించడమే. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులు జరిగిన కృష్ణా జలాలు పునఃపంపిణీ జరగాలని అందుకు కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తూ వస్తోంది. 2016లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్లోనూ ఇదే డిమాండ్‌ వినిపించింది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ ఉపసంహరించుకోవాలని అప్పుడే ట్రిబ్యునల్‌ వేయుట జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు అంగీకరించిన తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసును ఉపసంహరించుకుంది. ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై న్యాయ సలహా కోరామని అది ఏర్పాటు కావడానికి కొంత సమయం పడుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని బట్టి కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల మధ్య ఇప్పట్లో కేటాయించే అవకాశం లేదు. కాలయాపన చేసే విధంగా కనిపిస్తోంది. అంటే బచావత్‌ అవార్డు ప్రకారం 811 టిఎంసిలు ఉమ్మడి రాష్ట్రానికి జరిగిన కేటాయింపులే అప్పటివరకు అమల్లో ఉంటాయి. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512 టిఎంసిలు, తెలంగాణకు 219 టిఎంసిలు వాడుకోవాలనేది 2016 జూన్‌లో కృష్ణా బోర్డు సమావేశంలో తీసుకున్న తాత్కాలిక నిర్ణయం. ఇది ఆ సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాలను 2 రాష్ట్రాలకు సమానంగా పంచాల్సిందేనని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులే ఎక్కువ శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వాటిలో మిగులు జలాల ఆధారంగా చేపట్టినవే ఎక్కువ. ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటికీ కలిపి సుమారు 400 టిఎంసిలు అవసరం కాగా, ఇందులో తెలంగాణలోని ప్రాజెక్టులకు 200 టిఎంసిలు, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులకు 200 టిఎంసిలు అవసరం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం కుడిగట్టు కాల్వ (ఎస్‌ఆర్‌బిసి)కి 19 టిఎంసిల కేటాయింపులు ఉండగా చెన్నై తాగునీటికి 15 టిఎంసిలు అంటే 34 టిఎంసిలు నికర జలాల నుంచి కేటాయింపు ఉంది. మిగిలినవన్నీ మిగులు జలాలపై ఆధారపడినవే. 2014లో ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బిసి, హంద్రీనీవా, గాలేరునగరి, తెలుగు గంగ, వెలిగొండ, నెట్టెంపాడు ప్రాజెక్టుల్లో నెట్టెంపాడు మినహా మిగిలినవి శ్రీశైలం నుంచి నీటిని తీసుకునేవే. మరింత వరద నీటిని తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్‌ విస్తరణ పనులు చేపట్టింది. ఈ విస్తరణతో సంబంధం లేకుండా ప్రస్తుత సామర్థ్యం ప్రకారమే రోజు 90 వేల క్యూసెక్కులకు పైగా నీటిని తీసుకోవడానికి అవకాశం ఉంది. 50 శాతం తెలంగాణకు కేటాయించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img