Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

క్లెయిమ్‌చేయని డిపాజిట్లపై చర్యలు

గోపాలుని రాధాకృష్ణ

దేశీయ బ్యాంకుల్లో పదేళ్లుగా పేరుకుపోయినవి తమవేనని చెప్పని డిపాజిట్ల పరిష్కార విషయంలో అటు కేంద్రంలో, ఇటు రిజర్వ్‌ బ్యాంకులోను కదలిక మొదలైంది. దేశంలో ఈ డిపాజిట్ల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవితంలో అందరూ అనుకునేది తనకు, తన కుటుంబం వరకు ఏ లోటు లేకుండా జరగాలని. అయితే ఆర్థిక విషయాల్లో కొంతమేర గోప్యత పాటిస్తుండడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మన పెట్టుబడి విషయాలు కుటుంబ సభ్యులకు చెబుతున్నామా అన్న ప్రశ్నకు చాలామంది చెప్పడంలేదని సమాధానం వస్తుంది. దేశంలో అధికశాతం ప్రజలకు ఏదో ఒక బ్యాంకులో ఖాతా కచ్చితంగా ఉంటుంది. అయితే ఆయా బ్యాంకుల్లో జరిగే లావాదేవీల విషయంలో కుటుంబ సభ్యులకు తెలియజేయకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంకుల్లో పదేళ్లకుపైగా పేరుకుపోయిన డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం విడుదలచేసిన ప్రకటనచూస్తే అది స్పష్టమవుతోంది. ఇప్పటివరకు భారతీయ బ్యాంకుల్లో పదేళ్లకు పైబడి ఎటువంటి లావాదేవీలు లేకుండా, ఎవరూ క్లెయిమ్‌ చేయని డిపాజిట్లు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రూ.38,155 కోట్లు క్లెయిమ్‌ చేయని డిపాజిట్లు ఉంటే, ప్రైవేట్‌ బ్యాంకుల్లో రూ.6.87 కోట్లు ఉన్నాయి. వీటన్నింటినీ ఆయా బ్యాంకులు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు బదిలీ చేశారంటే సుమారు 11 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. ఒక్క స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుండి రూ.8 వేల కోట్ల పైచిలుకు బదిలీ చేశారంటే ఇది ఆందోళన కలిగించే విషయమే.
కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న చర్యలు కొన్ని సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. గతేడాది 100 రోజులు 100 చెల్లింపులు అనే కార్యక్రమాన్ని ఆర్‌బీఐ చేపట్టింది. జూన్‌ 1, 2023 నుంచి సెప్టెంబర్‌ 8, 2023 వరకు దేశంలోని ప్రతి జిల్లాలో ఉండే బ్యాంకుల్లో ఉన్న క్లెయిమ్‌ చేయని డిపాజిట్లు గుర్తించి వాటిని అసలైన ఖాతాదారులకు అందజేశారు. ఇందులో భాగంగా దేశంలోని 31 ప్రధాన బ్యాంకులు రూ.1432.68 కోట్లు తిరిగి చెల్లించినట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ తెలిపారు. క్లెయిమ్‌ చేయని డిపాజిట్లు బ్యాంకుల్లో ఎందుకు ఇలా పేరుకుపోతున్నాయి అని పరిశీలిస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌ చేస్తే కాలపరిమితి పూర్తి అయిన తర్వాత కూడా ఎవరు ఆ డబ్బు తీసుకోడానికి రాలేదంటే ఆ ఖాతాలకు నామిని లేకుండా ఉండవచ్చు. డిపాజిట్‌ దారుడు ఉన్నాడో, లేడో కూడా తెలియని పరిస్థితి. ఇలా కాలపరిమితితో కూడిన డిపాజిట్లే కాక పొదుపు (ఎస్‌ బి) ఖాతాల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వివిధ బ్యాంకుల్లో పదేళ్లకు పైబడిన డిపాజిట్ల వివరాలు సేకరించి ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు ఈ మొత్తాలను బదిలీ చేస్తారు. అక్కడినుండి డిపాజిట్లను ఆర్బీఐకి బదిలీ చేస్తుంటారు. దేశంలోని వివిధ బ్యాంకు నుండి వచ్చే మొత్తాలను ఆర్‌బీఐ డిపాజిటర్స్‌ ఎడ్యుకేషన్‌ అవేర్నెస్‌ ఫండ్‌కు జమ చేస్తారు. ఆయా బ్యాంకులు తమ వెబ్‌సైట్‌ల నుంచి క్లెయిమ్‌ చేయని వివరాలను పరిశీలించవచ్చు. పాన్‌కార్డు ద్వారా గాని, ఫోన్‌ నెంబర్‌ ద్వారా గాని ఆ సమాచారాన్ని తెలుసుకొనే వీలుంది. కాలపరిమితితీరి క్లెయిమ్‌ చేయని డిపాజిట్లపై బ్యాంకుల్లో పొదుపు ఖాతాలకు చెల్లించే వడ్డీరేట్లు చెల్లిస్తారు. క్లెయిమ్‌ చేయని డిపాజిట్‌ దారుల విషయంలో బ్యాంకులు చాలా నిర్లిప్తతతో వ్యవహరిస్తున్నాయి. డిపాజిటర్ల సమాచారాన్ని కూడా సేకరించలేకపోతున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. అదే చిన్న చిన్న రుణాలు విషయంలోనూ, బ్యాంకులకు పడ్డ బకాయిల విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంతో ఉంటున్నారు. రుణ గ్రహీతలకు ఆకస్మిక మరణం సంభవించినా లేక ఏదైనా కారణాల వల్ల వారి జాడ తెలియకపోయినా వారి వివరాలను తెలుసుకొని పట్టుకుంటారు. వారి వద్ద నుండి ముక్కు పిండి వడ్డీతో సహా వసూలు చేస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబంలో పెద్ద చనిపోయినప్పుడు, వారి వారసులు ఆయా బ్యాంకులను సంప్రదించాలి. పాన్‌ కార్డు ద్వారాగాని, ఫోన్‌ నెంబర్‌ ద్వారా గాని, ఆధార్‌కార్డు ద్వారా గాని చనిపోయిన వ్యక్తి వివరాలను సేకరించవచ్చు. అనంతరం చట్టబద్ధమైన వారసులు ఎవరో తెలుసుకొని వారి క్లెయిమ్‌ మొత్తాన్ని పరిష్కరించాలి. అంతేగాక ఇటువంటి క్లెయిమ్‌చేయని డిపాజిట్లను పరిశీలిస్తే విదేశాలకు వెళ్లడం వలన తిరిగి రాలేకపోవడం, వచ్చినా ఆ ఖాతాలపై సరైన అవగాహన లేకపోవడం జరుగుతోంది. అలాగే వయోవృద్ధులు కానీ మరొకరు కానీ డిపాజిట్‌ చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు తెలియజేయకపోవడం, ఆ తర్వాత వారి ఆకస్మిక మరణంతో ఇటువంటి ఖాతాల సంఖ్య పెరిగిపోతున్నది. నిజమైన హక్కుదారులకు తెలియక పోవడం, నామినేషన్‌ లేకపోవడం, వ్యక్తిగత వివరాలు తెలియకపోవడంతో ఇదంతా జరుగుతోంది. డిపాజిట్‌ దారుల సమస్యలను పరిశీలించేందుకు గాను, అర్హులైన వారసులకు సహాయ సహకారాలు అందించేందుకు గాను, ఇంకా పలు రకాల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక స్థిరత్వ అభివృద్ధి మండలికి సంబంధించిన బ్యాంకులకు సూచించింది. అలాగే ప్రతి ఏటా వంద రోజులు 100 చెల్లింపుల కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో జరిపి పరిష్కారానికి కృషి చేయాలి. ప్రతీ ఖాతాలో నామినేషన్‌ ప్రక్రియను అమలు చేయాలి. ఈ విషయంలో అన్ని బ్యాంకులపై ఒత్తిడితేవాలి. అంతేకాక ఉమ్మడి ఖాతాలను ప్రారంభించేలా చూడాలి. ఇటువంటి చర్యలతో ఖాతాదారులకు వారి కుటుంబాలకు ఎంతో మేలుచేసిన వారు అవుతారు.
సెల్‌: 98853 90232

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img