Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నేర – ధన రాజకీయాలు నిలువరించాలి

జేజేసీపీ బాబూరావు

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్న భారతదేశంలో నేడు ప్రజాస్వామ్యం నేర చరితుల, ధన రాజకీయుల చేతుల్లో బందీగా కునారిల్లుతోంది. నేడు దేశంలో భూతద్దంపెట్టి వెతికినా స్వచ్ఛమైన రాజకీయాలు మచ్చుకైనా కనిపించడంలేదు. దేశంలో నీతిమంతమైన రాజకీయాలకు ఏమాత్రం చోటు లేకుండా పోవడం విచారకరం. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు అని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ చాలా సృష్టంగా నిర్వచించారు. ప్రజాస్వామ్య భారతం అంతా మాఫియా, మనీ విషపుకోరల్లో బందీగా మారి అప్రజాస్వామికంగా రూపుదాల్చుకోవడం విచారకరం. నేడు దేశంలో ప్రజాస్వామిక రాజకీయాలు కనుమరుగవుతూ క్రమంగా నేర నష్టం కలుగుతోంది. ధన రాజకీయాలు చలామణి కావడం, తద్వారా ప్రజాస్వామ్యానికి అంతులేని నష్టం కలుగుతోంది.
ఎన్నికలు – ప్రజాస్వామిక సంస్కరణలలో భాగంగా కృషిచేస్తున్న అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) అనే సంస్థ ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం ప్రస్తుత లోక్‌సభóలోని సభ్యులు ఎన్నికల సమయాలలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా 514 మంది సిట్టింగ్‌ పార్లమెంట్‌ సభ్యులలో ఏకంగా 225 మంది పార్లమెంట్‌ సభ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు అయినట్లు వెల్లడి కావడం నేర రాజకీయాల పరాకాష్టకు నిదర్శనం. ఈ విధంగా ప్రస్తుత లోక్‌సభలో 44 శాతం మంది సభ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు కాగా వారు ప్రజాప్రతినిధులుగా కొనసాగడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. లోక్‌సభ సభ్యులలో ఏకంగా 44 శాతం మంది నేర చరిత్రని కలిగి ఉండడం విస్మయానికి గురిచేయడమే కాకుండా ఆంతిమంగా ప్రజాస్వామ్య పరాభవాన్ని చాలా సృష్టంగా ఎత్తి చూపింది. ప్రస్తుత లోక్‌సభ సభ్యులలో హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, కిడ్నాప్‌, మహిళలపై నేరాలు తదితర తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఏకంగా 29 శాతం మంది లోక్‌సభ సభ్యులపై నమోదు కావడాన్ని ప్రజాస్వామ్య పరాభవానికి పరాకాష్ట. అలాగే తీవ్రమైన నేరాభియోగాలు కలిగి ఉన్న లోక్‌సభ సభ్యులలో మొత్తం 9 మందిపై హత్యా కేసులు నమోదు కాగా వారిలో ఐదుగురు బీజేపీ వారున్నారు. 28 మంది లోక్‌సభ సభ్యులపై తీవ్ర హత్యాయత్నం కేసులు నమోదు కాగా వారిలో 21 మంది లోక్‌సభó సభ్యులు బీజేపీకి చెందినవారే. నేరచరిత ఉన్న పార్లమెంట్‌ సభ్యులలో ఎక్కువ మంది బీజేపీకి చెందిన వారు అగ్రభాగాన ఉన్నారు. నేరాల్లో నిందితులుగా లోక్‌సభ సభ్యులు ఉండడం అప్రజాస్వామిక రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తుంది.
మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులలో 16 మంది లోక్‌సభ సభ్యులపై నమోదుకాగా ముగ్గురు సభ్యులపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో సగానికిపైగా లోక్‌సభ సభ్యులపై కేసులున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ సభ్యులపై ఎక్కువగా క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తన నివేదికలో తెలిపింది. మొత్తంగా ఈ నివేదిక అనేక నేర, నీచ రాజకీయాలను బహిర్గతపరిచింది. దేశ రాజకీయాలలో ప్రజాప్రతినిధుల నేరాలు రోజురోజుకు పెరుగుతుండడం విచారకరం. ప్రజాస్వామ్యంలో నేరమయ రాజకీయాలకు ఏమాత్రం స్థానం కల్పించరాదు. నేరాలను నిలువరించే దిశలో ప్రభుత్వాలు తగిన విధంగా వ్యవహరించడంలేదు అనే విమర్శలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఏడీఆర్‌ నివేదిక ప్రకారం లోక్‌సభ సభ్యులలో 5 శాతం మంది కోటీశ్వరులు ఉండగా వారి ఒక్కొక్కరి సంపద వంద కోట్లకు మించి ఉంది అనేది కాదనలేని వాస్తవం కాగా ఈ కోటీశ్వరులలో ఎక్కువ మంది బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన వారు ఉండడాన్ని ప్రత్యేకంగా గమనించవచ్చు. 73 శాతం మంది లోక్‌సభó సభ్యులు గ్రాడ్యుయేషన్‌ వరకు పూర్తి చేసినట్లు ఏడీఆర్‌ తన నివేదికలో ప్రస్తావించింది. మొత్తం లోక్‌సభ సభ్యులలో మహిళలు కేవలం 15 శాతం మాత్రమే ఉండడం తద్వారా ఆయా రాజకీయ పార్టీలు మహిళలకు సీట్లు కేటాయించడంలో డొల్లతనాన్ని చాలా సృష్టంగా ఎత్తి చూపింది అని చెప్పవచ్చు. అందువల్ల ఇకనైనా ఆయా రాజకీయ పార్టీలు మహిళలకు వారి కోటా మేరకు ఎన్నికల్లో సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది.
నేడు భారతదేశ రాజకీయాలు ఓట్లు, నోట్లు, సీట్లు అనే విధంగా మారడం అసలు సిసలైన ప్రజాస్వామ్యాన్ని పాతాళంలోకి తొక్కి వేశాయి. చెమట చుక్కలు చిందించకుండా ప్రజల సొమ్ముని దోచుకుని రాత్రికిరాత్రే కోటీశ్వరులుగా ఎదిగే అవకాశాలు భారతదేశ రాజకీయాలు కల్పించడం విచారకరం. ఈ నివేదికను చాలా సునిశితంగా పరిశీలిస్తే ఆయా పార్టీలు అన్ని కూడా నేర, ధన రాజకీయాలలో పాలుపంచుకుంటూ ప్రజాస్వామ్య పునాదులను సైతం పెకిలిస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయి అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో కనీసం గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా గెలవడానికి కూడా కోటి రూపాయల దాకా ఖర్చుచేస్తున్న హెచ్చు ఘటనలు చాలా సృష్టంగా కనిపిస్తున్నాయి. తీరా ఎన్నికల్లో గెలిచాక దోచుకోవడం, దాచుకోవడం తప్పితే వారు ప్రజలకు ఒరగబెట్టేది ఏమీ ఉండదు.
డబ్బులు ఉన్నవారే నేడు రాజకీయాలలో రాణిస్తున్నారు తప్ప సామాన్యులకు రాజకీయాలలో రాణించే అవకాశాలు కనుచూపుమేరలో కూడా కనబడడం లేదు. ఎన్నికలను సజావుగా అవినీతి, అన్యాయాలకు తావులేకుండా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్లు సైతం విఫలం కావడం కూడా నేర, ధన రాజకీయాలు మరింతగా పెట్రేగిపోవడానికి దోహదం చేస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందువల్ల ఎన్నికల కమిషన్‌ నిద్రావస్థ నుంచి మేల్కొని నేర, ధన రాజకీయాలను పూర్తిగా నిలువరించే దిశగా ప్రక్షాళన గావించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సెల్‌: 9493319690.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img