Monday, April 22, 2024
Monday, April 22, 2024

పట్టాలెక్కని ట్రాక్‌మెన్ల జీవితాలు!

ఆళ వందార్‌ వేణు మాధవ్‌
పాసింజర్‌, ఫాస్ట్‌, సూపర్‌ ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ ఇలా దూసుకుపోయే రైలు ఏదైనా పట్టాలు మీద పరుగులు తీయాలంటే వారి పనితనం మీదే ఆధార పడి ఉంటుంది. ట్రాక్‌ సరిగ్గా లేకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో, ఎంతమంది జీవితాలు గాల్లో కలిసిపోతాయో మనందరికీ తెలిసిందే. ఇలాంటివేమీ జరగకుండా పట్టాలను పరిరక్షించేది, పరిశుభ్రంగా ఉంచేదీ వారే. ఒక్కమాటలో చెప్పాలంటే రైలు బండిని పరుగులు తీయించడంలో అందరికంటే ముందుండే ఆ కార్మికుల పేరే ట్రాక్‌ మెన్‌లు. రైలు పట్టాల సక్రమ నిర్వహణతో ప్రయాణికులందరినీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో గొప్ప సేవలు అందిస్తున్న ట్రాక్‌మెన్‌ల బతుకులు మాత్రం గాడిన పడడం లేదు. వారి బతుకు బండి ఎప్పటికీ పట్టాలెక్కడం లేదు. ఇందుకు కారణం ప్రభుత్వాలే. కష్టించే కార్మికుల బాగోగులను ఏలికలు పట్టించు కోకపోవడమే. భారతీయ రైల్వేలో పనిచేసే కార్మికులు వేలల్లో ఉన్నారు. వివిధ వర్గాల కార్మికుల సహకార శ్రమ లేకుండా రైల్వేలను నడపడం సాధ్యం కాదు. స్టేషన్‌ మాస్టర్లు, లోకో పైలట్లు (ఇంజిన్‌ డ్రైవర్లు) మొదలుకుని ట్రాక్‌మెన్‌ల వరకూ అందరి శ్రమ ఫలితమే భారతీయ రైల్వేలు.
అందరికంటే ఎక్కువ శ్రమ పడేది ట్రాక్‌మెన్‌లే. వారి కష్టాలకు తోడు పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. ఎక్కువ పని వల్ల శారీరక మానసిక అనా రోగ్యానికి గురవుతున్నారు. ఇది ప్రయాణీకుల భద్రతను తీవ్రంగా ప్రభా వితం చేస్తుందన్నది వాస్తవం. ప్రతి నెలా దాదాపు 40 ట్రాక్‌మెన్‌లు తమ విధి నిర్వహణలో పరు గెత్తడం వల్ల చనిపోతున్నారు. ఏటా దాదాపు 500 ట్రాక్‌ మెన్‌లు మృత్యువాత పడు తున్నారు. వీటిని ‘‘ప్రమాదాలు’’ అని పిలవలేం, ఎందుకంటే అవి నివారించ దగినవి. ఈ కార్మికులను పట్టించుకోనవసరం లేదన్నది భారతీయ రైల్వేల భావనగా కనిపిస్తోంది. మంజూరైన ట్రాక్‌ మెన్ల సంఖ్య 5 లక్షలు కాగా, ప్రస్తుతం 3 లక్షల పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇందులో దాదాపు 2 లక్షల మంది మాత్రమే ట్రాక్‌ నిర్వహణ పనులు చేస్తుండగా, అధికారుల ఇష్టానుసారంగా లక్ష మందిని కార్యాలయాల పనులు, గృహ విధులకు మళ్లిస్తున్నారు. అంటే 50 మంది ట్రాక ్‌మెన్‌లు పని చేయవలసిన చోట 20 మంది మాత్రమే ఉన్నారు. ఫలితంగా విపరీత మైన ఒత్తిడికి గురి అవుతున్నారు. మరోవైపున తగినంతమంది కార్మికులు లేక రైళ్ల భద్రతకు ముప్పు ఏర్పడుతోంది. రైల్వే ట్రాక్‌ మెయింటైనర్ల సంఖ్యను తగ్గించడమే కాదు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ప్రైవేట్‌ కార్మికుల నియామకాలు చేస్తున్నారు. ఈ కార్మికులు సరైన శిక్షణ లేక పని నాణ్యత లేక భద్రతకు భరోసా లేకుండా పోయింది. కాంట్రాక్టు కార్మికుల వేతనం నెలకు కేవలం రూ. 7500. వారికి డీఏ, ఇతర ప్రయోజనాలు నిరాకరించారు. కాంట్రాక్టర్లు నిజంగా కార్మికులు లేకపోయినా నిర్దిష్ట సంఖ్యలో కార్మికులను చూపించి వారి వేతనాలను జేబులో వేసుకుంటు న్నారు. ట్రాక్‌ నిర్వహణదారులకు ప్రమోషన్‌ల ఊసే లేదు. వారి అతిపెద్ద సమస్యలలో ఇదొటి. వీరిని నిర్దిష్ట ఇంటర్‌-డిపార్ట్‌మెంటల్‌ బదిలీ పరీక్షలకు హాజరు కావడానికి అనుమతించరు. పర్మినెంట్‌ వే సూపర్‌వైజర్ల 30,000 పోస్టులను రైల్వే తొలగించింది, పదోన్నతుల అవకాశాలను మరింత తగ్గించింది. పని గంటలు నిర్వచించలేదు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9 గంటలపాటు పనిచేసినా అధికారులు సగం రోజు మాత్రమే లెక్కిస్తారు. ఒక్కోసారి గైర్హాజరు అయినట్టూ చూపిస్తారు. పని చేసే ప్రదేశాన్ని ముందుగా నిర్దేశించకపోవ డంతో రోజూ దూరంగా ఉండే పని ప్రాంతానికి చేరటం చాలా కష్టం. వారి భుజాలపై 40-50 కిలోల ఉపకరణాలను మోసుకెళ్లాలి, విభాగాల మధ్య 8 కి.మీ వరకు నడవాలి. ఈ ట్రాక్‌లో గంటల తరబడి కష్టపడి పని చేయడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది, ఈ పరిస్థితి ప్రయాణికుల భద్రతపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. రాత్రి పెట్రోలింగ్‌ కోసం ట్రాక్‌మెన్‌ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో 20 కి.మీ నడవాలి. దీనివల్ల విషపూరితమైన కీటకాలు, పాములు కాటువేయటం, అడవి జంతువులు దాడి చేసే అదనపు ప్రమాదం ఉంది. ఇద్దరు వ్యక్తులను ఒకచోటికి పంపితే లేదా రైళ్లను సమీపించే వారిని హెచ్చరించే భద్రతా పరికరాలను అందించి నట్లయితే అసంఖ్యాక ట్రాక ్‌మెన్‌ల జీవితాలను రక్షించవచ్చు, కానీ ఇది జరగడం లేదు. 5 కి.మీ నుండి 10 కి.మీ వరకు ట్రాక్‌లను తనిఖీ చేయడం కష్టతరమైన పని. పెరుగుతున్న జీవన వ్యయం వల్ల వారికిచ్చే వేతనాలు చాలక దుర్భరమైన పరిస్థితులను అనుభవిస్తున్నారు. వారు ట్రాక్‌లను నిర్వహించే ప్రక్రియలో మానవ మలంతో కలుషితమైన మురికి నీటిలోనే నడవవలసి ఉంటుంది. వారికి అవసర మైన భద్రతా పరికరాలు అందించకపోవడంతో అంటు వ్యాధుల బారినపడుతు న్నారు. వారికి వ్యాధి భత్యం అందదు. 50 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలతో మండు తున్న వేసవి, చలి లేదా భారీ వర్షాల్లోనూ ట్రాక్‌ల పక్కన బహిరంగ ప్రదేశంలో భోజనం చేయడం తప్ప వారికి వేరే మార్గం లేదు. తాగునీటి సౌకర్యం లేదు. 8,000 మంది మహిళా ట్రాక్‌ మెయింటెయినర్ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది, స్టేషన్లలో లేదా పని ప్రదేశాలలో ప్రత్యేక విశ్రాంతి గదులు వాషింగ్‌ లేదా మార్చుకునే గదులు లేవు. కార్మికులు సాయంత్రం 4 గంటలకు రిలీవ్‌ అవుతారు. మరొక షిఫ్ట్‌ కోసం రాత్రి 10 గంటలకే మళ్లీ రిపోర్టు చేయవలసి ఉంటుంది! ప్రయాణ సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే రెండు డ్యూటీల మధ్య ఆరు గంటలు కూడా విశ్రాంతి తీసుకోవడం లేదు. పని 8 గంటలకు మించి ఉంటే ఓవర్‌ టైం చెల్లింపు లేదు. వాస్తవానికి రాత్రి భృతి రూ. 118 నుండి రూ.152లు ఇవ్వాలి. రైల్వే బోర్డు 2018 ఫిబ్రవరి 5 సర్క్యులర్‌ ప్రకారం, ట్రాక్‌ మెయింటెయి నర్‌లకు ప్రతి ఆరు నెలలకోసారి భద్రతా బూట్లు, ఏటా రెయిన్‌కోట్‌లు, ప్రతి రెండే ళ్లకు శీతాకాలపు దుస్తులు అందించాలి. భద్రతా పరికరాలు అందించాలి. వీటిలో ఏదీ ఇవ్వడం లేదు. చాలా చోట్ల 4 ఏళ్లుగా బూట్లు అందడం లేదు! చేతి తొడుగులు నాణ్యత లేనివి ఇస్తుండడంతో అవి తొందరగా పాడవుతున్నాయి. అవి ధరించ డానికి, ఉపయోగించడానికి వీలు లేకుండా చాలా గట్టిగా తయారవుతున్నాయి. ఏళ్ల తరబడి ఎలాంటి భద్రతా అద్దాలు అందించలేదు. వారికి ఎలాంటి మెడికల్‌ కిట్‌ అందించడం లేదు. ఈ సమస్యలపై అఖిల భారత రైల్వే ట్రాక్‌ మెయింటెయినర్స్‌ యూనియన్‌ అధికారులకు విన్నవించినా వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టలేదు.
వ్యాస రచయిత సెల్‌ 8686051752

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img