Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

పాదధూళితో సంపద సృష్టించవచ్చా

ప్రొ. కె.ఎస్‌. చలం

ఇటీవల ఆగ్రా దగ్గరిలోని హాత్రస్‌లో భోలేబాబా పాదధూళికోసం బురద మట్టిని కూడా ఖాతరు చేయక ఎగబడ్డ సుమారు 120 మంది భక్తులు నిర్జీవులయ్యారు. ఈ సందర్భంలోనే తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు, కొంతమంది మేధావులు సంక్షేమం కాదు, సంపద ముందు సృష్టించండి అంటున్న సామాజిక మీడియా కథనాలు అర్థం చేసుకోవాలి. నిజమే సంపద అందరికీ అవసరమే. అయితే సంపద ఆదాయం, ఆస్తి మధ్యన ఉన్న వ్యత్యాసం ఆర్థికవేత్తలకు తెలిసినంతగా సామాన్యులకు తెలియదు. సంపద సృష్టించాలంటే ముందు విలువను సృష్టించాలిగదా. సంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్తల విలువకు ప్రధాన ఆధారం ప్రయోజనం, కొరత ఉండాలి అంటారు. దీన్ని విమర్శించిన మార్క్స్‌ విలువ అన్నది ఒక వస్తువు తయారు చేయటానికి ఉపయోగించిన శ్రమ ఆధారంగా నిర్ణయించాలి అంటూ సాంప్రదాయక బూర్జువా ఆర్ధికవేత్తలను విమర్శించిన సంగతి చాలా మందికి తెలుసు. ఇక్కడ మనం సంపద గూర్చి మాట్లాడుతూ విలువగూర్చి మాట్లాడటానికి కారణం ఉంది. బూర్జువా ఆర్థికశాస్త్రం లేక వాణిజ్య ఆర్థికశాస్త్రంలో సంపదకున్న విలువ మనిషికి ఉండదు. అది వేరే అంశం. విలువ, మారకపు విలువల చుట్టూ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు తిరుగుతున్నా 21వ శతాబ్దపు పెట్టుబడిదారి విధానంలో చాలా అంశాలు ప్రజల ముందుకు వస్తున్నాయి. సమస్యలు, వాటి పరిష్కారాలు, ప్రపంచ బ్యాంక్‌ దాని సిద్ధాంత అనుచరులు కనిపెడుతూనే ఉన్నారు. ఈ నేపథó్యంలో మతం, దాని వివిధ అవతారాలు ప్రజల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం వంటి సనాతన దేశంలో పెట్టుబడిదారీ విధానాన్ని కూడా ఆకళింపు చేసుకొని తనలో ఇముడ్చుకోగల సామర్ధ్యం ఉన్నా ప్రధానంగా హిందూమతం, దాని పాయలు వంటి వివిధ అంగాలు, అంశాలు మన దేశంలో కొంతకాలంగా చూస్తున్నాం. చాలా కొద్దిమంది కొన్ని పత్రికలు, మీడియాలు మాత్రమే వీటిపై విశ్లేషణ చేస్తున్నారు.
సంపద సృష్టికి మూలాధారమైన విలువ తద్వారా ఏర్పడే ఆస్తి(ఎసెట్‌) అన్నది ప్రత్యక్ష లేక అదృశ్యమాన అంశంగానైనా ఉండాలి. అప్పుడు విలువ ఏర్పడి సంపద పెరిగి పెట్టుబడులు పెరిగి, ఆర్థికవ్యవస్థ పుంజుకొని అందరికి కావలసిన ఉద్యోగం, విద్య, ఆరోగ్యం వగైరాలు అందిస్తాయి. దానికోసం ప్రపంచ బ్యాంక్‌ చెప్పే విధానాలు, సిద్ధాంతాలు అవలంబించి ముందుకు వెళ్లాలి, అంతేగాని సంపద లేకపోయినా ఉన్న ప్రజల నుంచి వచ్చిన డబ్బును ప్రజల మీద ఖర్చుచేస్తే మిగిలేదేమిటి? ప్రజల ఆస్తులుగా పబ్లిక్‌ రంగాన్ని తయారుచేసి దాన్ని మరల ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పజెప్పటంలో జరిగే మోనటైజేషన్‌తో వచ్చే విలువ సంపదను పెంచదా! అర్ధం చేసుకోరు. అయితే ఇది ఇక్కడతో ఆగిపోదు. ఇటువంటి లావాదేవీలు ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా అదృశ్యంగా కూడా చేయటం ద్వారా వచ్చే విలువ గూర్చి తెలుసుకుందాం. ఇక్కడ విలువ అంటే నైతిక, మానవ విలువ కాదు. ఆర్థిక అంశంతో ముడిపడ్డ విలువ. ఆర్థికశాస్త్రం తన అమ్ములపొదిలో ఉన్న పద్ధతులు, భావనలతో విలువలకు అంచనా వేయగలదు. ఉదాహర ణకు మన దేశంలో లోటు వచ్చినప్పుడు కంటికి కనపడని స్పెక్ట్రమ్‌ నుంచి విలువను అంచనా వేయగలిగింది. అది కొంత సాంకేతిక అంగమయినా మనం ఇప్పుడు మనకు కనపడని భక్తి, మూర్ఖత్వం, నమ్మకం వంటి అంశాల నుంచి కూడా విలువను సృష్టించవచ్చు. మన ప్రపంచబ్యాంక్‌ మేధావులు దీనికి ఏమంటారో తెలియదుగాని జగద్గురు నారాయణ సాకార్‌ విశ్వహరి అనే భోలే బాబా ఆస్తుల విలువ వందకోట్లు అని పత్రికలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. అది ఆయన పాద ధూళి విలువ అనుకుంటే పొరపాటు. ఆయన నికరవిలువ (నెట్‌వర్త్‌) వాణిజ్య అర్థశాస్త్రం ప్రకారం, లెక్కకట్టాలంటే ఇక్కడ వీలుపడదు కాబట్టి అది ఆయనకుండే భక్తుల డిమాండ్‌ ఆధారంగా నిర్ణయించవచ్చు. అంటే భారతదేశ సనాతన నమ్మకాలను తీసిపారేయకుండా వాటికుండే విలువను మనం అంచనా వేయాలి. క్రీస్తు పూర్వమే చాణుక్యుడు అర్థశాస్త్రంలో మతానికి ఉండే ఆర్థికశక్తిని వివరించాడు. రాజ్యానికి కావలసిన వనరులు, ఆదాయం పొందటం గూర్చి 5వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. అద్భుతశక్తులు గలవని చెబుతూ ఒక దేవతను సృష్టించి ప్రచారం చేసి ఉత్సవాలు, పండగలు నిర్వహించి ప్రజల నుంచి రుసుములు, పన్నులు వసూలు చేయవచ్చు అన్నాడు. అసలు గుడి, మందిరం, విహారం, చర్చ్‌, మసీదు వంటి ప్రార్థనా స్థలాలు నాగరిక సమాజం మొదలు నుంచి ఆర్థిక వనరుగా, రాజ్యానికి రాజుకు ఆర్థిక, రాజకీయ అంగంగాఉంటూ వచ్చింది. దీనిపై ఆర్థిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు పరిశోధనలు చేశారు. ఇటీవల కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో శ్రియ అయ్యర్‌ ఈ అంశం మీదే పీహెచ్‌డీ పట్టా పొందారు. దానిపై విమర్శలు, ప్రతి విమర్శలు ఉన్నాయి. ఇక్కడ మనం పాదధూళిని ఎలా ఆర్థిక వనరుగా, సంపదగా మార్చవచ్చో తెలుసుకుంటున్నాం. మరి దీనిపై మేధావులు, మీడియా వారి స్పందన ఏమిటో తెలియదుగాని మన దేశ మత సంపద గూర్చి తెలుసుకుందాం. అదే నాటి సామ్రాజ్యవాద పెట్టుబడిదారి విధానాన్ని ఆకళింపుచేసుకొని మతతత్వాన్ని అందులో చొప్పించి రెండిరటినీ కొనసాగిస్తోంది. ఇందులో గందరగోళం, వైరుధ్యం ఏమీ లేదు. మన అవగాహనలోపమో, నిరాశక్తో అనుకోవాలి.
భారతదేశ మత సంపద ముఖ్యంగా హిందూమత సంపద ఎన్ని లక్షల కోట్లు ఉంటుందో అంచనా వేయడం కష్టం. గాని, పరోక్షంగా కొన్ని అంశాలను అంచనా వేస్తే ఒక విలువ సంఖ్య వస్తుందేమో చూడవచ్చు. దానినిబట్టి నేటి ప్రజాస్వామ్య పెట్టుబడిదారీ మత రాజ్యానికి ఉండే శక్తి అర్థం చేసుకోవచ్చు. నిజానికి సూరజ్‌పాల్‌ సింగ్‌ అనే భోలే బాబా చాలా చిన్నవాడు. దేశంలో గత కొన్నిదశాబ్దాలుగా జరుగుతున్నా నమ్మకాల లావాదేవీలను పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడున్న ఆర్థిక, సామాజిక వ్యవస్థల మూలంగా మీగడ నురగ వంటి హిందువులకు మాత్రమే అవకాశాలున్న మతంతో దూరంగా ఉండే దళిత, బహుజన కులాలు తమకంటూ ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఆధునిక కాలంలో ఉత్తరాదిలో వాటిని డేరా అని, సత్సంగ్‌లని అనేక పేర్ల మీద దిగువ మధ్యతరగతి ప్రజలు మత్తుకోసం కాదు, ఒక నిట్టూర్పు కోసం బాబాలను, స్వాములను, అమ్మలను ఆశ్రయించటం మొదలుపెట్టారు. దక్షిణాదిలో కర్నాటక మినహాయించి ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దళితులు కొందరు వెనుకబడిన కులాలవాళ్లు, ఇస్లాం, క్రైస్తవ మతంలో ఉండబట్టి డేరాలు ఇంకా ప్రారంభంకాలేదు. ఒకవేళ ఆయా మతాల్లో ఉన్నా, యింకా వాటి ఆర్థిక లావాదేవీలు బైటపడలేదు. నిన్ననే బొంబాయిలో లక్షల మంది క్రికెట్‌కోసం గుమికూడటం దాన్ని వ్యాపారంగా మార్చటం అందరికీ తెలుసు. ఇది సంపదను సృష్టిస్తుంది. అటువంటి సంపద ప్రాథమికమైతే, ఆర్థిక ఉత్పత్తి శక్తులు పెరగకుండా డబ్బు రూపంలోనే విలువ పెరిగితే పైనుండే వర్గాలకు హాయినిస్తుందేమోగాని, దిగువనున్న ప్రజలకు వారే మతం వారయినా ఎదుగూబొదుగూ లేక స్థిరంగా నిలిచిపోతారు. గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా కోవిడ్‌ కాలంలో జరిగింది అదే. ప్రజలకు ఉద్యోగం, తిండిలేకపోయినా, షేర్‌ మార్కెట్‌ పెరుగుతూ ఉంది. ఆర్ధిక లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవాలి
మన దేశంలో కొన్ని రాజకీయపార్టీలు బలపడేదానికి కారణం మతానికి ఉండే ఆర్థిక సంపద, వనరులు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అనంత పద్మనాభస్వామి ఆలయం సుప్రీంకోర్టు ఆర్డర్‌ తరువాత లక్షా ఇరవైవేల కోట్లు రూపాయలు అన్నారు. తరువాత మన తిరుపతి వెంకటేశ్వరస్వామి, ఇటీవల అయోధ్య రాములవారికి 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. (గతంలో ఇటుకల ద్వారా వసూలైన 5000 కోట్లపై అంతర్యుద్ధం జరిగింది) స్వామి నారాయణ గుడుల ఆస్తుల విలువ లెక్కగట్టవచ్చు. అలాగే మసీదులు, చర్చిల పేరున ఉన్న ఆస్తులు తెలిసిందే. అసలు మన గుళ్లల్లో ఉన్న బంగారం 2500 టన్నులు ఉంటుందని అంచనా. ఆర్‌బీఐ దగ్గర 822 టన్నుల మాత్రమే. అలాగే క్రికెట్‌ ఆడి భారతరత్న అయిన సచిన్‌ బ్రాండ్‌ విలువ 1390 కోట్లు. ఇలా చెప్పుకుంటూపోతే తెలుగు రాష్ట్రాల్లో సమతాస్వాములు, సంపూర్ణానందలు వారి ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలియదు. భోలేబాబా జాతిలో దళితస్వామి కాబట్టి తక్కువ విలువ. ఇక్కడా అసమానతేనా అనవచ్చు? సమస్య అదికాదు, వారి వద్ద కూడా వారి అనుసరగణంను చూసి రాజకీయ నాయకులు వెంటబడుతున్నారు. నిజానికి హాత్రస్‌లో ఒక భయంకర దారుణం జరిగింది. ఒక దళిత యువతిని మానభంగంచేసి చంపిన నిందితులను ఇటీవలే విడుదల చేశారు. భోలేబాబాతో ఆ పాపం పక్కకుపోయింది. అందుకే ఆస్తులు, సంపద పోగేయటమేకాదు, ఆ సంపద ఎవరికోసం ఎందుకోసం కూడా తెలుసుకోవాలి. గాంధీజీ అన్నట్లు సంపద తనంత తానుగా అంత్యమూకాదు, అది పేదరికాన్ని అసమానతలను తగ్గించే సాధనం కావాలి. పాదధూళి సంపద వ్యక్తికి, ముఠాలకు, మతాలకు, రాజకీయ మాఫియాలకు చెందకుండా ప్రజలను చైతన్యపరచవలసిన కర్తవ్యం పౌరసమాజంపై ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img