Monday, April 22, 2024
Monday, April 22, 2024

బీజేపీ మణిపూర్‌లో ప్రయోగం చేస్తుందా?

ఆశిస్‌ బిస్వాస్‌

మణిపూర్‌లో పరిస్థితి ఏ మాత్రం చక్కబడలేదు. ఘర్షణలు, దాడులు, గృహ దహనాలు, అల్లర్లను అదుపుచేయలేక రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ సమీపంలోఉన్న మిజోరం ముఖ్యమంత్రి జొరమ తంగను సహాయ చేయమని అర్థించారు. మెయితీలు, కుకీలు, మిజోల మధ్య ఏర్పడిన సామాజిక విభజన మరింత ప్రగాఢమైంది. మణిపూర్‌లో మంటలురేగి దాదాపు 50రోజులైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అల్లర్లను అదుపు చేయడంలో విఫలమయ్యాయి. గత కొన్ని వారాలుగా ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి ప్రధాని మోదీ, అమిత్‌ షా తీసుకుంటున్న నిర్ణయాలు, చొరవలు హింసాత్మక పరిస్థితులు చక్కబడకపోగా పాత వివాదాలన్నీ తిరిగి తలెత్తాయి. దీనితో పరిస్థితి మరింత దిగజారింది. హిందువులుగా పరిగణించి మెయితీలకు బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్‌లు అనుగుణంగా వ్యవహరించడమే తాజా పరిణామాలకు మూలమని రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్‌ మంటల్లో కాలిపోతుంటే మోదీ ఉక్రెయిన్‌లో శాంతి గురించి మాట్లాడుతున్నారని గిరిజన జాతులు మండిపడుతున్నాయి. మహిళలతో సహా నిరసన ప్రదర్శనలు జరిపారు. తమకు రక్షణ కల్పించాలని కుకీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు. దిల్లీ జంతర్‌మంతర్‌లో ధర్నా జరిపారు. గిరిజనులు, గిరిజనేతరులు కేంద్రం ఉద్దేశాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మంటల్లో కాలిపోతున్న రాష్ట్రంలో దీర్ఘకాలిక లక్ష్యాలను గురించి బీజేపీ ప్రభుత్వం వ్యూహాలు పన్నుతున్నట్లున్నదని సందేహిస్తున్నారు.
మణిపూర్‌ సరిహద్దులుదాటి వెళ్లి నాగాలాండ్‌, మిజోరంలో తలదాచుకుంటున్నవారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవారు ఎక్కువయ్యారు. వివిధ సాయుధగ్రూపులు విచ్చలవిడిగా హింసాకాండ జరుపుతున్నా బీజేపీ కేంద్ర నాయకులు ఆషామాషీగా పరిగణించి చర్యలు తీసుకుంటున్నారని భావిస్తున్నారు. అనేక రోజులుగా అల్లర్లు కొనసాగడానికి బీజేపీ ప్రభుత్వాలు ఆస్కారమిచ్చాయి. ఫలితంగా మణిపూర్‌లోనే గాకుండా చుట్టుపక్క రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వంపైన ప్రధాని మోదీపై వ్యతిరేకత బాగా పెరిగింది. కుకీలకు మైన్మార్‌ నుండి ఆయుధాల సరఫరాను ఆరికట్టేందుకు అక్కడి బాధ్యులతో మాట్లాడామని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెపుతున్నారని స్థానిక మీడియా తెలియజేస్తోంది. మణిపూర్‌లో ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడు కూడా మైన్మార్‌ నుండి సాయుధ గ్రూపులకు ఆయుధాలు సరఫరా అయ్యాయి. మెయితీలు, కుకీలలో సాయుధగ్రూపులు ఉన్నాయి. మరోవైపు తిరుగుబాటు జాతీయ యూనిటీ ప్రభుత్వం (ఎన్‌యుజి) మణిపూర్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని, ఆయుధాలు సరఫరా చేయవద్దని దేశంలోని సాయుధ గ్రూపులకు విజ్ఞప్తి చేయడం సానుకూలచర్య. అయితే సైనిక బారెక్‌ల నుండి దాదాపు నాలుగువేలకుపైగా ఆధునిక ఆయుధాలను మణిపూర్‌లో సాయుధగ్రూపులు ఎత్తుకెళ్లాయని వాటినే ప్రస్తుతం ఉపయోగిస్తు న్నారని తెలుస్తోంది. అలాగే మరణాల సంఖ్య పెరుగుతోంది. అధికారిక అంచనా ప్రకారం 110 మంది ఇంతవరకు చనిపోయారు. అసోం రైఫిల్స్‌దళాలు, ఇతర యూనిట్లు పెట్రోలింగ్‌ పెంచాయి. అదనంగా సైనిక దళాలను నియమించారు. రాష్ట్ర, కేంద్ర, అధికారులు ఇంటింటికి తిరిగి సోదాలు జరిపి గణనీయంగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో బీజేపీపై విశ్వసనీయత గణనీయంగా దిగజారింది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రముఖ నాయకుడిగా ఎదిగిన అసోం ముఖ్యమంత్రి హిమంత్‌ విశ్వశర్మకు కేంద్రంలో బీజేపీ, అధికార యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తాయి. అయినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాకపోవడం ఏమిటనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా మెదీ, అమిత్‌షాలు కలుగచేసుకుని సమస్యను పరిష్కరించే వారని, మణిపూర్‌లో మంటలు ఆర్పడానికి రెండు తెగల మధ్య తగాదాలు పరిష్కరించడానికి ఎందుకు శ్రద్ధపెట్టడంలేదని మణిపూర్‌ ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరితోను సంప్రదించకుండా 51మందితో శాంతి కమిటీని అమిత్‌ షా రెండురోజుల పర్యటన సందర్భంగా ఏర్పాటు చేశారు. అది అసలు పనిచేయడంలేదు. ఇప్పటికీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. మెయితీలకే బీజేపీ ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని కుకీలు, మిజోలు అనుమానిస్తున్నారు. జరుగుతున్న ఘటనలు ఇది నిజమేనని తెలియజేస్తున్నాయి. ఈ నేపధ్యంలో కుకీలు తమకు ప్రత్యేక పాలనా ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. సాయుధగ్రూపులతో బీజేపీ చేసుకున్న త్రైపాక్షిక ఒప్పందంపై ప్రభుత్వం శ్రద్ధపెట్టలేదని కుకీలు, ఇతర గిరిజన తెగలు మండిపడుతున్నాయి. కేంద్రమంత్రి ఆర్‌కె రంజన్‌సింగ్‌ ఇంటిని సాయుధ గ్రూపులు దహనంచేసినా, భద్రతాదళాలు నిలువరించలేకపోయాయి. అనధికారిక అంచనా ప్రకారం మెయితీలు, కుకీలకు చెందిన 150 మందికి పైగా చనిపోయారు. మోదీ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కారిస్తానని రెండు గ్రూపులవారు భావించారు. అది జరగకపోగా పరిస్థితులు మరింత దిగజారాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యావేత్తలు, న్యాయవాదులు, పౌరులు దాదాపు 550 మంది విడుదల చేసిన ప్రకటనలో బీజేపీ ‘విచ్ఛిన్నకర రాజకీయాలు’ అనుసరించడంతో గతంలో జరిగిన వివిధ జాతుల మధ్య జరిగిన ఘర్షణలు, పోరాటాలు తిరిగి తలెత్తాయని విమర్శించారు. ఇంత విధ్వంసం జరిగినా మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ‘విచ్చిన్నకర రాజకీయాలు’ నడుపుతున్నందువల్లనే మణిపూర్‌ మంటల్లో చిక్కుకున్నదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా మోదీ నోరువిప్పి మాట్లాడి సమస్య పరిష్కార బాధ్యత తీసుకోవాలని వారు తమ ప్రకటనలో కోరారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం మెయితీలకు అండగా నిలిచి వారి అవసరాలన్నీ తీరుస్తున్నాయని, తమను పట్టించుకోవడంలేదని కుకీలే కాదు, కేంద్ర విదేశీ వ్యవహారాల విదేశాంగ మంత్రి రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌సైతం ఆరోపించారంటే బీజేపీ ఎలాంటి విధ్వంసకర విధానాలు అనుసరిస్తున్నాయనేది స్పష్టమవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img