Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

మానవవాద విప్లవకారుడు యం.ఎన్‌.రాయ్‌

డాక్టర్‌ దేవరాజు మహారాజు

అలుపెరుగని సత్యాన్వేషి, కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు, ప్రపంచ మానవవాద విప్లవకారుడు యం.ఎన్‌.రాయ్‌తీవ్ర జాతీయ వాదం లోంచి, ప్రపంచ కమ్యూనిస్టు రాజకీయాలతో మమేకమై, తర్వాత కాలంలో రాడికల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ స్థాపకుడయ్యాడు. ఒక వ్యక్తి శక్తిగా ఎలా మారగలడో తెలుసుకోవాలంటే యం.ఎన్‌.రాయ్‌ జీవితాన్ని అధ్యయనం చేయాలి. భారతీయుడైన రాయ్‌, మెక్సికన్‌ కమ్యూనిస్టు పార్టీ స్థాపకుడు (1917) కావడ మేమిటీ? విచిత్రం? అని అనిపిస్తుంది. కానీ అది వాస్తవం. ఆయనలోని నిరంతర భావజాల సంఘర్షణ ఆయనని ఏదో ఒక ఆలోచనా ధోరణికి కట్టుబడి ఉండనివ్వలేదు. రాడికల్‌ డెమొక్రటిక్‌ పార్టీ స్థాపనతోపాటు భారత రాజ్యాంగ చిత్తు ప్రతిని కూడా తయారుచేసి, ప్రచురించారు. భారత దేశానికి స్వాతంత్య్రంలభించిన సమయానికే ఆయన నూతన మానవవాదానికి మేనిఫెస్టోని రూపొందించి విడుదలచేశారు. ఒక జీవితకాలంలో ఒక వ్యక్తి ఇన్ని పనులు ఎలా చేయగలిగారన్నది అంతుపట్టని విషయం. మహా మేథావి కావడం, నిరంతరం కృషిచేస్తూ ఉండడం, దేశం పట్ల, సమాజం పట్ల తనకు ఎంతో బాధ్యత ఉందనుకోవడం ఇలా ఎన్నెన్నో కారణాల కారణంగా ఆయన తన కలల్ని సాకారం చేసుకుంటూ వచ్చారు. లేకపోతే ఒకప్పటి నలంద, తక్షశిల వంటి బౌద్ధ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన పాత్రను తను స్వీకరించడమేమిటీ? తను స్థాపించిన ఇండియన్‌ రినైజాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా దేశాన్నే కదలించడమేమిటీ? డెహ్రాడూన్‌లో ఆయన నివాసమున్న చోటు నుండే ఆ సంస్థను నిర్వహించారు. అది ఆ కాలంలో ‘హ్యూమనిస్ట్‌ హౌస్‌’ గా పేరుపొందింది. ఉత్తర భారతదేశం నుండే కాకుండా ఎంతోమంది దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఆయన అనుచరులు, అభిమానులు అక్కడికి తరలివెళ్లారు. దేశంలోని హేతువాదులపై, మానవవాదులపై, ఉద్యమ కారులపై, హక్కుల సంఘాల నేతలపై, సామాజకి ఆలోచనా పరులపై, బుద్ధి జీవులపై ఇంకా ఎంతోమందిపై యం.యన్‌.రాయ్‌ ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరోజుల్లో చాలా బలంగాపడిరది. భారతీయ సమాజంలో మనువాదుల ప్రభావంతో శతాబ్దాలుగా వేళ్లూనుకుని ఉన్న మతతత్వ భావనకి వ్యతిరేకంగా పనిచేయడమే తన సంస్థ ప్రథమ కర్తవ్యమన్నారు రాయ్‌. అందుకే ఎడ్యుకేట్‌ ద ఎడ్యుకేటెడ్‌విద్యావంతుల్ని వివేకవంతుల్ని చేద్దామన్న ఆలోచనని ఆయన దశదిశలా వ్యాప్తి చేశారు. ఆయన ఆమాట చెప్పి 75ఏళ్లు పూర్తి కావచ్చినా, ఆ నినాదానికి ఇంకా ఈ రోజుకు కూడా ప్రాముఖ్యముంది. దేశంలో నిరక్షరాస్యులైన మూర్ఖులకన్నా విద్యావంతులైన మూర్ఖుల సంఖ్యే పెరిగిపోతూ ఉండడం మనం గమనిస్తున్నాం. వారితో సమాజం ఒకవైపు రోగగ్రస్థమౌతూ ఉంటే, మరోవైపు చదువులేని సన్యాసులు పరిపాలనా పగ్గాలు చేపడుతూ ఉండడం ఎంత ప్రమాదకరం?
రాయ్‌ పుట్టినప్పుడు పెట్టిన పేరు నరేంద్ర నాథ్‌ భట్టాచార్య. అయితే కాలిఫోర్నియాలో ఉండగా, అక్కడి నిఘా విభాగాలదృష్టి మరల్చడానికి మానవేంద్ర నాథ్‌ రాయ్‌(యం. ఎన్‌.రాయ్‌)గా పేరు మార్చుకున్నాడు. అసలైతే నరేంద్రనాథ్‌ భట్టాచార్యగా 21 మార్చి 1887న పశ్చిమబెంగాల్‌ 24ఉత్తర పరగణాలు: ఆర్బేలియాలో ఒక పూజారి కుటుంబంలో పుట్టారు. బాల్యంలో తండ్రి దీనబంధు భట్టాచార్య దగ్గరే సంస్కృతం, కొన్ని సనాతన శాస్త్రాలు చదువుకున్నారు. తండ్రితోపాటు మఠాలు, ఆశ్రమాలు తిరిగారు. అప్పుడే అతనిలో కొత్త ఆలోచనలు ప్రారంభమయ్యాయి. 14వ ఏట వెళ్లి అనుశీలన్‌ సమితిలో చేరారు. ఆది రహస్యంగా పనిచేసే ఒక విప్లవ సంఘం. కానీ, కొద్ది కాలానికే ఆ సంఘం నిషేధానికి గురైంది. ఆ తర్వాత జతిన్‌ ముఖర్జీ నిర్వహణలో నడిచే జుగాంతర్‌ గ్రూపులో చేరారు. ‘జతిన్‌ ముఖర్జీని కలవడమే తన జీవితంలో ఒక గొప్పమలుపు’ అని తనగ్రంథం (చైనాలో నా అనుభవాలు)లో రాసుకున్నారు. బ్రిటీష్‌్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జుగాంతర్‌ సభ్యులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుండేవారు. ఫలితంగా కొందరు శిక్షలు అనుభవించారు. ఒకతన్ని ఉరితీశారు కూడా! 1914లో మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమైంది. ఆ కాలంలో రాయ్‌ జర్మన్‌ల సహాయంతో ఇండోనేషియాకు వెళ్లి వస్తుండేవారు. ఆయుధాలు సమకూర్చుకుని, భారతదేశం నుంచి బ్రిటీష్‌ పాలకుల్ని తరిమి కొట్టాలన్నది అప్పుడు ఆయన ఉద్దేశం.
ఆ మరుసటి సంవత్సరం 1916లో రాయ్‌ అమెరికా చేరుకున్నారు. కాని, బ్రిటీష్‌ గూఢచారులు అతని కదలికల్ని గమనిస్తూనే ఉన్నారు. రాయ్‌ శాన్‌ఫ్రాన్సిస్కోలో అడుగుపెట్ట గానే అక్కడి ప్రాంతీయ వార్తాపత్రికలో రాయ్‌ గురించి ఓ సంచలన వార్త ప్రచురితమైంది. ‘‘ప్రఖ్యాత బ్రాహ్మణ విప్లవకారుడు, ప్రమాదకారి అయిన జర్మన్‌ గూఢచారి నరేంద్రనాథ్‌ భట్టాచార్య అమెరికాలో అడుగుపెట్టాడు’’ అన్నది ఆ వార్త సారాంశం. దొరక్కుండా ఉండడానికి రాయ్‌ వెంటనే పోలో, ఆల్టోకాలిఫోర్నియాకు వెళ్లిపోయారు. అక్కడ పేరు మార్చుకుని, మానవేంద్ర నాథ్‌ రాయ్‌గా చలామణి అయ్యారు. అంటే తన 29వ ఏట తప్పనిసరై మార్చుకున్న ఆ పేరుతోనే మానవవాదిగా ప్రపంచ ప్రసిద్ధి పొందారు. అక్కడ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థిని ఎవిలిన్‌ ట్రెంట్‌తో స్నేహం పెరిగి పెండ్లి చేసుకున్నారు. అలాగే మళ్లీ తప్పనిసరై కాలిఫోర్నియా నుండి మెక్సికో చేరుకున్నారు. అక్కడ ఆయనకు తగిన భద్రత, గుర్తింపూ లభించాయి. అనతికాలంలోనే అక్కడి సోషలిస్టులకు రాయ్‌, ఒక మంచి స్నేహితుడయ్యారు. అందుకే ఆయన జ్ఞాపకాల పుస్తకంలో మెక్సికో తనకు ఒక కొత్త జన్మనిచ్చిందని రాసుకున్నారు. అక్కడ ఉన్న రోజుల్లోనే మెక్సికన్‌ కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. ఆ తర్వాత మూడేళ్లకు 1920లో మరో ఆరుగురు నాయకులతో కలిసి భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించగలిగారు. మానవేంద్ర నాథ్‌ రాయ్‌ తర్వాతకాలంలో వ్లాదిమిర్‌ లెనిన్‌, జోసెఫ్‌ స్టాలిన్‌లను కలిసి కమ్యూనిస్టు ఇంటర్నేషననల్‌లో భాగస్వాములయ్యారు. 1926లో దాని విధి విధానాల కూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఆ విధి విధానాల్ని చైనా కమ్యూనిస్టు పార్టీ అవలంబించేట్టు ఒప్పించడానికి యం.ఎన్‌.రాయ్‌ 1927లో చైనా వెళ్లారు. కానీ, ఆ ప్రయత్నం విఫలమైంది. కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ విధివిధానాల్ని చైనా ఒప్పుకోలేదు. రాయ్‌ ఒప్పించలేక పోయారని కాబోలు, 1929లో ఆయనను కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ నుండి బహిష్కరించారు. 1920లో రాయ్‌ భారతదేశానికి తిరిగిరాగానే, ఆయనకోసం గాలిస్తున్న బ్రిటీష్‌ ప్రభుత్వం 1924నాటి కాన్పూర్‌ బోల్షివిక్‌ కుట్రకేసును వెలికితీసి ఆరెస్టు చేసింది. ఆరేళ్లు జైలుశిక్ష విధించింది. అప్పుడు ఆయనతో పాటు ఎస్‌.ఏ.డాంగే, షౌకత్‌ ఉస్మానీ వంటి ఇతర నాయకులు ఉన్నారు. ఆ కాలంలోనే రాయ్‌ తొమ్మిది సంపుటాల ‘‘ప్రిజన్‌ డైరీలు’’రాశారు. అందులో కొన్ని భాగాలు పుస్తకాలుగా అచ్చయినా, మొత్తానికి మొత్తంగా అవి అచ్చుకాలేదు. ఆ సంపుటాలు ఇప్పటికీ దిల్లీనెహ్రూ మెమోరియల్‌ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. జైలు నుంచి విడుదలై వచ్చాక రాయ్‌ నాలుగేళ్లపాటు ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో సభ్యుడిగా ఉండి బైటపడ్డారు. 1946లో రాయ్‌ డెహ్రాడూన్‌లో భారతీయ సాంస్కృతిక పునర్వికాస కేంద్రాన్ని స్థాపించారు. అది దేశానికి స్వాతంత్య్రం రాక పూర్వమే నన్నది గమనించాలి. సుమారు 76ఏళ్ల క్రితం ప్రారంభమైన ఆ సంస్థ ఆధునిక భౌతిక శాస్త్ర దృక్కోణంలో మానవవాదాన్ని ప్రచారం చేసింది. చార్వాక, లోకాయత, బౌద్ధ దర్శనాల అధ్యయనానికి వేదికైంది. అంతేకాదు, ఉపనిషత్తుల, భక్తి ఉద్యమాలకు సంబంధించిన చర్చలూ చేపట్టింది. రినైజాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ పక్షాన పత్రికలు, పుస్తకాలు ముద్రించడం, సభలూ సమావేశాలే కాదు, కార్యశాలలు నిర్వహించడం నిరంతరం కొనసాగుతూ ఉండేవి. ఫలితంగానే బలమైన మానవవాద సాహిత్యం సృష్టించడం జరిగింది. మతతత్వాన్ని మట్టు బెట్టడానికి జీవితమంతా పోరాడిన రాయ్‌, 25 జనవరి 1954 తన 67వ యేట, గుండెపోటుతో కన్నుమూశారు.
`కేంద్ర సాహిత్యఅకాడమీ విజేత, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img