Friday, December 9, 2022
Friday, December 9, 2022

వారికీ హక్కులున్నాయ్‌!

కరోనా మహమ్మారి ఎంతోమందిని బలి తీసుకున్నది. ఇంకెంతో మందిని వీధులపాలు చేసింది. పెట్టుబడిదారులూ, ప్రభుత్వాలు కుమ్మక్కైన కారణంగా ఇప్పటికే చాలా వర్గాలు అత్యంత పేదరికంలోకి వెళ్లిపోగా, కరోనా వారిని మరింత దయనీయ స్థితికి చేర్చింది. తాజాగా మాయదారి మహమ్మారి లక్షలాది మంది బాలలను కన్నవారికి దూరం చేసింది. వారిని దిక్కులేనివారిగా మార్చేసింది. కొవిడ్‌ కారణంగా ప్రపంచ్యవాప్తంగా 15 లక్షల మందికి పైగా చిన్నారులు తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయినట్లు ఇటీవల లాన్సెట్‌ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడిరచింది. ఒక్క భారతదేశంలోనే 1.19 లక్షల మంది పిల్లలపై కరోనా తన కాఠిన్యాన్ని ప్రదర్శించింది. 2020 మార్చి నుంచి 2021 ఏప్రిల్‌ వరకు 14 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల్లో 15,62,000 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులు, సంరక్షకుల్లో (అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య తదితరులు) కనీసం ఒకరిని కోల్పోయినట్లు వెల్లడిరచింది. ఇందులో 10,42,000 మంది తల్లీ లేదా తండ్రీ లేదా ఇద్దరినీ కోల్పోయినట్లు తెలిపింది. తల్లుల కంటే తండ్రులను కోల్పోయిన చిన్నారులు 5 రెట్లు అధికంగా వున్నారు. భారత్‌ విషయానికొస్తే, 1,19,000 మంది చిన్నారులు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని లేదా సంరక్షకుల్లో ఒకరిని కోల్పోయినట్లు లాన్సెట్‌ తెలిపింది. ఇందులో 1.16 లక్షల మందికి కరోనా తల్లీ లేదా తండ్రీ లేదా ఇద్దరినీ దూరం చేసినట్లు పేర్కొంది. భారత్‌లో 25,500 మంది పిల్లలు తల్లులను కోల్పోగా, 90,751 మంది చిన్నారులు తండ్రి ప్రేమకు దూరమయ్యారు. ప్రపంచంలో అత్యధికంగా మెక్సికోలో 1.41 లక్షల మంది పిల్లలు అమ్మానాన్నలు లేదా ఇతర సంరక్షకులను కోల్పోయారు. బ్రెజిల్‌, అమెరికా దేశాల్లోనూ ఈ సంఖ్య లక్షకు పైనే వుంది.
ప్రపంచ బాలల హక్కులకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థలు పిల్లల హక్కుల కోసం పోరాడుతూనే వున్నాయి. దేశాల మధ్య యుద్ధాలు జరిగినా, విపత్తులు సంభవించినా, కరోనా లాంటి వ్యాధులు ప్రబలినా, చివరకు సామాజిక విధ్వంసాలు, కుటుంబ కలహాలు, వైవాహిక చిక్కులు… ఇలా ఏది జరిగినా అత్యధికంగా నష్టపోయేది పిల్లలే. ప్రపంచంలో ఏవర్గానికి చెందిన హక్కులగురించి ఆ వర్గాలు పోరాడుతూనే వుంటాయి. కానీ హక్కులు కోల్పోయినా, పోరాటాల జోలికి వెళ్లనివారు పిల్లలు మాత్రమే. వారి హక్కుల కోసం ఎవరు పోరాడుతారు? పైగా మానవ అక్రమ రవాణా, అత్యాచారాలు వంటి పరిస్థితులు పిల్లలను మరింత అభద్రతలోకి నెట్టివేశాయి. భారత్‌లో కనీసం రాజ్యాంగం పిల్లలకు ఇచ్చిన హక్కులు కూడా అమలు కావడం లేదు. ప్రభుత్వ వైఫల్యం సహజ కారణం కాగా, ఈ సమాజం కూడా పిల్లలకు హక్కులుంటాయన్న భావనలో లేకపోవడం దురదృష్టకరం. బాలల హక్కులు కూడా మానవ హక్కులే. 18 ఏళ్లలోపు వయసు గలవారందర్నీ పిల్లలుగానే పరిగణించాలి. పిల్లల అవసరాలను గుర్తించడం, వాటిని తీర్చడం, వారి అభ్యున్నతి కోసం గరిష్టస్థాయిలో కృషిచేయడం, కోపతాపాలు, ఆగ్రహావేశాలవంటి వాటితో ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని బాధపెట్టకుండా వుండటం, గృహహింస నుంచి ఏ ఇతర హింసలకూ వారిని గురిచేయకుండా వుండటం, పిల్లలకు రాజ్యాంగం కల్పించిన వసతులన్నీ పరిరక్షించడం వంటివి బాలల హక్కుల పరిధిలోకి వస్తాయి.
రాజ్యాంగంలోని అధికరణ 7, 8 ప్రకారం పిల్లలకు గుర్తింపు హక్కు ఇవ్వాలి. అంటే వారుపుట్టగానే వారికి పేరు పెట్టడంతోపాటు న్యాయ బద్ధంగా ప్రభుత్వ కార్యాలయంలో నమోదు చేసి భారత జాతీయునిగా గుర్తింపునివ్వాలి. అధికరణ 23, 24 ప్రకారం, ఆరోగ్యహక్కును పిల్లలు పొందుతారు. వైద్యసాయం మొదలుకొని పౌష్టికాహారం అందివ్వడం, హానికరమైన అలవాట్ల నుంచి దూరంగా ఉంచడం సహా మంచి పని పరిస్థితుల నడుమ వారికి రక్షణ కల్పించాలి. 28వ అధికరణ ప్రకారం విద్యాహక్కు వారి సొంతం. పిల్లల క్రమశిక్షణ, జీవిత నైపుణ్యం కోసం ఉచిత ప్రాథమిక విద్య హక్కు అనివార్యం. మానసిక అభివృద్ధికి, హింస, నిర్లక్ష్యాలకు దూరంగా స్వేచ్ఛాయుత జీవితాన్ని అనుభవించడానికి ఇది అవసరం. అందుకే పిల్లలకు మన రాజ్యాంగం విద్యాహక్కు కల్పించింది. ఇక రాజ్యాంగంలోని 8, 9, 10, 16, 20, 22, 40 అధికరణలను అనుసరించి కుటుంబ సభ్యులతో కలిసి జీవించే హక్కు పిల్లలకు వుంటుంది. ప్రైవసీ హక్కు కూడా ఇక్కడి నుంచే వారికి లభిస్తుంది. 12, 13 అధికరణల ప్రకారం అభిప్రాయాలను వెలిబుచ్చే స్వేచ్ఛ పిల్లలకు వుంటుంది. అధికరణలు 38, 39ల ప్రకారం సాయుధ సంఘర్షణల నుంచి రక్షణ పొందే హక్కు వారికి వుంటుంది. ఆర్టికల్‌ 19, 32, 34, 36, 39ల ప్రకారం పీడనల నుంచి రక్షణ పొందే హక్కు వుంటుంది. జాతి, రంగు, మతం, భాష, లింగం, కులం, సామర్థ్యాల వంటి అంశాల్లో ఎన్ని తేడాలున్నా, పిల్లలందరూ సమానమే. ఇది దాదాపు అన్ని దేశాల రాజ్యాంగాలు వారికి ఇస్తున్న ప్రత్యేక హక్కు. పిల్లల హక్కుల విషయంలో ప్రభుత్వంపై నెట్టేయడం సాధ్యం కాదు. ఎందుకంటే, ముందుగా సమాజమే వారి హక్కులను గౌరవించాలి. అవి దక్కనప్పుడు 18 ఏళ్లు దాటిన పెద్దవాళ్లంతా పిల్లల హక్కుల కోసం పోరాడాల్సిందే. దానికి ప్రత్యామ్నాయాలు లేవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img