Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

వైజ్ఞానిక స్పృహ వ్యాప్తిలో మహీధర నళినీ మోహన్‌

డాక్టర్‌ దేవరాజు మహారాజు

ఒక తెలుగు వారపత్రిక 1986లో నిర్వహించిన సర్వేలో మహీధర నళినీ మోహన్‌ రావు తెలుగువారిలో ప్రముఖ వ్యక్తిగా ఎన్నికయ్యారు. ఆయన ఎవరి మీదా ఆధారపడకుండా, వేటి ఆసరా తీసుకోకుండా, కేవలం తన రచనల ద్వారానే తెలుగువారి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. సైన్స్‌ రచనల ద్వారా తెలుగు జాతికి ఎంతో మేలు చేశారు. తెలుగువారిలో ఇవాళ కొంతైనా వైజ్ఞానిక అవగాహన ఉందంటే అందుకు ఒక కారణం తప్పకుండా మహీధర నళినీ మోహనరావు కూడా! ఈ విషయంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎంతోమంది వైజ్ఞానిక రచయితలకు ఆయన మార్గదర్శి. విజ్ఞాన శాస్త్ర విషయాలను కథలుగా, ముచ్చట్లుగా, హాస్యరస ప్రధానంగా నడిచే సంభాషణలుగా ఆయన మలిచిన తీరు అద్భుతం! ఆయన ఒక జీవిత కాలంలో చేసిన కృషి, అనంతకాలంగా సాగాల్సిన వైజ్ఞానిక స్పృహకు బీజం. డెబ్బయికిపైగా పుస్తకాలు, పదిహేనువందలకు పైగావ్యాసాలు ప్రచురించా లంటే ఎంత కష్టమో అది ఆ రంగంలో ఉన్న వారికి బాగా అర్థమౌతుంది.
రోదసీ శాస్త్రవేత్తగా ఎదిగి కూడా తెలుగు రచయితగా మహీధర నళినీ మోహన్‌ తనకు తాను ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ‘‘నక్షత్ర వీధుల్లో భారతీయుల పాత్ర’’ ‘‘ప్రపంచానికి ఆఖరు ఘడియలు’’ వంటి పుస్తకాలు ఏ రకంగా చూసినా అంతర్జాతీయ స్థాయినందుకున్నవే. ఈ ప్రపంచం పరిసమాప్తమౌతుందనే విషయంపై ఇప్పటికీ టెలివిజన్‌ ఛానల్స్‌లో అడపాదడపా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈయన 1959లోనే పుస్తకం రాశారు. ఈయన కవిత్వం రాశారు. ఇతర సాహిత్య రచనలు చేశారు. అయితే అవన్నీ ఈయన సైన్సు రచనల అడుగున పడిపోయాయి. 1953లో రాజమండ్రి ఆర్ట్స్‌ అండ్‌ సైన్సు కాలేజీ (ఆంధ్ర విశ్వవిద్యాలయం) నుండి బి.యస్సీ డిగ్రీ తీసుకుని, హైదరాబాదుకువచ్చిన నళినీమోహన్‌రావు 1955లో ఉస్మానియా విశ్వ విద్యాలయంనుండి యం.యస్సి ఫిజిక్స్‌ పట్టా తీసుకున్నారు. ఏడు సంవత్సరాలు సంఘర్షించిన తర్వాత 1960లో మాస్కో వెళ్ళారు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆరేళ్ళ సంఘర్షణ. 1969లో స్వీడన్‌లోని ఉప్సాలా అయనోస్పెరిక్‌ అబ్జర్వేటరీలో రాకెట్‌ పెలోడ్‌ నిర్మాణ శాఖలో మళ్ళీ మూడేళ్ళ పరిశోధన. ఓ సంవత్సరం పాటు బల్గేరియా అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌లో, మరో సంవత్సరం ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ వేల్స్‌లో పరిశోధనలు. ఆ కాలంలోనే పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ దృష్టిలో పడ్డారు. తర్వాత దిల్లీలోని నేషనల్‌ ఫిజికల్‌ లేబొరేటరీలో చేరి, చాలాకాలం అక్కడ సీనియర్‌ సైంటిస్ట్‌గా, డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. ఒక శాస్త్రవేత్తగా, ఒక రచయితగా ఆయన నిరంతరం కష్టపడి పని చేయడాన్ని, నిజాయితీని మాత్రమే నమ్ముకున్నారు. మాస్కో యూనివర్సిటీ నుండి భౌతికశాస్త్రంలో డాక్టరేట్‌ సంపాదించి, స్వీడన్‌లోనూ, బల్గేరియాలోనూ, ఇంగ్లండ్‌లోనూ పరిశోధనలు చేసి, పదహారు రాకెట్‌ ప్రయోగాల్లో పాల్గొన్న తెలుగు శాస్త్రవేత్త మహీధర నళినీ మోహన్‌రావు. అలాంటివాడి గురించి ఇటు రాష్ట్ర ప్రభుత్వమూ, అటు కేంద్ర ప్రభుత్వమూ ఏం పట్టించుకుందీ? వైజ్ఞానిక రంగంలో విజయ కేతనాన్ని ఎగరేస్తూ ఆ స్థాయికి ఎదగడం సామాన్య విషయం కాదు గదా? యస్‌.ఆర్‌.ఒ.యస్‌ 3 రోహిణి సాటిలైట్‌లో ఈయన రూపల్పన చేసిన పార్టికల్‌ స్పెక్ట్రోమీటర్లే ఉన్నాయి. వైజ్ఞానిక పరిశోధనారంగంతో ఏ కొద్ది పరిచయం ఉన్నవారైనా వాటి ప్రాముఖ్యాన్ని గుర్తిస్తారు. అలాగే పదహారు సార్లు రాకెట్‌ ప్రయోగాల్లో పాల్గొనడమంటే మామూలు విషయం కాదు. మైదానంలో బంతులేరిన వాడికి ‘భారత రత్న’ ఇస్తారు. ఓసారి ఓ పోటీలో ఏదో ఓ పతకం తెస్తే కోట్ల నజరానా, కలెక్టర్‌ ఉద్యోగం, బిరుదులూ ఇస్తారు. ఇవన్నీ ముప్పయిలలో ఉన్న క్రీడా కారులకు. మరి యాభై, అరవై యేళ్ళు నిత్యం జనంకోసం తపిస్తూ వచ్చిన ఇతరరంగాల వారికి ఏమీ ఉండదా? ప్రభుత్వాలకు కళ్ళూ, ముక్కూ, చెవులు లాంటివి అసలున్నాయా? అని అనుమానం వస్తోంది సామాన్యుడికి! జీవితం ధారపోసి శాస్త్రవేత్త కావడమే గొప్ప. జనాన్ని చైతన్య వంతం చేసే రచయిత కావడమే గొప్ప. జీవితాంతం ఎంత సంఘర్షిస్తూ వస్తే ఆ స్థాయిని అందు కుంటారూ? అలాంటి వారిని గుర్తించి గౌరవించుకోవడం మాత్రం ప్రభుత్వాలకు చేత కావడం లేదు. నళినీ మోహనరావు పట్ల కూడా అదే పొరపాటు జరిగింది. స్వామీజీలకు, బాబాలకు మోకరిల్లుతూ ప్రభుత్వ భూములు కేటాయించే ఈ ప్రభుత్వాలు, వేల కోట్ల బ్యాంకు రుణాలు ఎగవేసి పారిపోయే వారిపై చర్యలు తీసుకోలేని ప్రభుత్వాలుÑ సామాన్యులజీవితాలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసే ప్రభుత్వాలు ఇలాంటి వారిని ఎలా గుర్తుపడతాయి చెప్పండి? శాస్త్రవేత్తల, మేధావుల, ఆర్థిక నిపుణుల, రచయితల ముఖ్యంగా వ్యవసాయదారుల విలువ గ్రహించలేని దేశ నాయకుల నిర్ణయాలు నిస్సందేహంగా దేశాన్ని విపరీతంగా దెబ్బ తీస్తున్నాయి. చాలామంది తెలుగువారికి జరిగిన అన్యాయమే మహీధరకూ జరిగింది. ఉద్యోగరీత్యా ఆయన చేరాల్సిన స్థాయికి చేరలేదు. పోనీ నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఇవ్వాల్సిన సముచిత గౌరవమేమైనా ఇచ్చిందా? అంటే అదీ లేదు. పైరవీలు చేసుకునేవారికి పదవులూ, పద్మ అవార్డులూ ఇప్పించుకునే ప్రభుత్వాలు మరింత నిజాయితీ పెంచుకోవాల్సి ఉంది. పాపులర్‌ సైన్స్‌లో ముప్పయి పుస్తకాలు, పిల్లల కోసం పదహారు పుస్తకాలు, నాలుగు పద్య కావ్యాలు, వ్యాసాలు, క్విజ్‌లూ వగైరా మరో నలభై అయిదు పుస్తకాలు, లెక్కలేనన్ని రేడియో ప్రసంగాలు, ఏళ్ళకేళ్ళు పత్రికల్లో నిర్వహించిన శీర్షికలు చాలవా? ఇన్ని చేసినందువల్లనే కదా తెలుగువారిలో ప్రముఖుడిగానిలిచారు. అంతేకాదు 2005 అక్టోబరు 21న ఆయన కన్నుమూసేనాటికి ఇంకా పందొమ్మిది గ్రంథాలు అముద్రితంగా ఉండిపోయినయ్‌. సుప్రసిద్ధ నవలా రచయిత, జర్నలిస్టు మహీధర రామమోహనరావు వీరి తండ్రి. బహు గ్రంథకర్త. మహీధర జగన్మోహనరావు వీరి పినతండ్రి. అంటే స్వాతంత్య్ర సమరంలో ముగ్గురు కుటుంబ సభ్యులను జైలుకు పంపిన గొప్ప దేశభక్తుల కుటుంబం. ఛాందసాన్ని వెలివేసిన పండిత కుటుంబం. విప్లవ సాహిత్య చర్చకు వేదికగా నిలిచిన లోగిలి. అలాంటి ఘనకీర్తిగల కుటుంబంలో మహీధర నళినీ మోహన్‌రావు 1933లో తూర్పుగోదావరి జిల్లా ముంగండ గ్రామంలో జన్మించారు.
1968లో దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన బహుమతిని అందుకున్న నళినీ మోహన్‌రావు, ప్రజా బాహుళ్యానికి సైన్స్‌ మీద అభిమానం కలిగించినందుకు 1986లో ప్రప్రథమ ఇందిరాగాంధీ విజ్ఞాన బహుమతినీ అందుకున్నారు. 1992లో పిల్లల్లో సైన్సు ఆలోచనల వ్యాప్తికి ఎన్‌.సి.యస్‌.టి.సి జాతీయ అవార్డు, 1993లో హాస్య రచనలకు తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా అవార్డు, ఇతర బాల సాహిత్య పురస్కారాలు, సైన్సు అవార్డులూ అందుకున్నారు.
నేను కాలేజీలో చేరిన తొలిదశలో నళినీ మోహన్‌రావుగారి పేరు పత్రికలలో ఎక్కువగా చూస్తుండేవాణ్ణి. సైన్సు విద్యార్థినైనా, సాహిత్య రంగంపై మక్కువ గల నన్ను సైన్సు రచనల వైపు పరోక్షంగా ఆలోచింపజేసింది ఆయనా, జమ్మి కోనేటిరావు లాంటి వాళ్ళే! ఆ రోజుల్లో (196570) వారిరువురి రచనలు పత్రికల్లో ఉధృతంగా వస్తూ ఉండేవి. సైన్స్‌ మాత్రమే కాక, నళినీ మోహన్‌ సాహిత్య రచనలు కూడా చేస్తుండేవారు. పిల్లల రచనలు, కవితలు కనిపిస్తూ ఉండేవి. అన్నిటికన్నా నన్ను ఆ రోజుల్లో బాగా ఆకర్షించినవి ‘నసీరుద్దీన్‌ కథలు’! హాస్య ప్రధానంగా సాగే ఆ కథలన్నీ చమత్కారాలతో పాఠకులకు గిలిగింతలు పెట్టేవి. ఒక రోదసీ శాస్త్రవేత్తగా ఒక విజ్ఞాన శాస్త్ర రచయితగా ఎంతో సీరియస్‌గా ఉండే మహీధరలో ఎంతో అమాయకత్వం, ఎంతో సున్నితత్వం ఉందని, అవి లేనివారు హాస్య రచనలు, పిల్లల రచనలు చేయలేరని అప్పుడు నాకు తెలియదు. ఆ విషయం కాలక్రమంలో అవగతమైంది. పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకూ అప్పుడప్పుడూ ఆయన రచనలు చదువుతూ వచ్చిన తర్వాత 1989లో హైదరాబాదులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో జరిగిన వర్క్‌షాపులో ప్రతినిధులుగా కలుసుకున్నాం. అప్పటికి ఆయన సర్వీసులోనే ఉన్నారు. దిల్లీ నుండి ప్రత్యేకంగా ఆ వర్క్‌షాపు కోసమే వచ్చారు. విరామ సమయాల్లో ఆయనతో మాట్లాడుతూ ఉంటే నాకు సమయం తెలిసేది కాదు. ఇటు సాహిత్యం గురించైనా, అటు సైన్సు గురించైనా హాయిగా మాట్లాడేవారు.
ఏది ఏమైనా ఆయన గురించి, ఆయన రచనల గురించి జరగాల్సినంత చర్చ జరగలేదు. అందుకు కారణాలున్నాయి. సైన్సు రచయితలకు ఒక వేదిక లేదు. సాహిత్య వేదికలు ఆయనను పట్టించు కోలేదు. అయితే, ఆయన తన రచనల ద్వారా ప్రయోగశాలకూ సమాజానికీ మధ్య అడ్డుగోడలు చెరపడానికి జీవితాంతం కృషి చేశారు. 1970కి పూర్వం తెలుగులో సైన్స్‌ రచయితలు ఎక్కువగా లేరు. పాతూరు నాగభూషణం, గాలి బాల సుందరరావు, హరి ఆదిశేషువు, జమ్మి కోనేటిరావు, మహీధర నళినీ మోహనరావు వంటి కొన్ని పేర్లు మాత్రమే కనిపించేవివినిపించేవి. పాఠ్యగ్రంథాలు కాక, ఇతర సరళ వైజ్ఞానిక శాస్త్ర గ్రంథాలు చదవాలని కుతూహలపడే నా బోటి ` ఆనాటి కుర్రాళ్ళంతా నళినీ మోహన్‌ పుస్తకాలు వెతుక్కుని చదువుతూ ఉండేవారు. ఒక శాస్త్రవేత్తగా ఎదుగుతూ, తాను సముపార్జించిన విజ్ఞానాన్ని సామాన్య పాఠకులకు అందించాలన్న ఆయన తపన గొప్పది! బహుశా అదే నాకు ఆదర్శమైంది కాబోలు! మొత్తానికి మొత్తంగా ఆయన కృషిని, జీవితాన్ని మననం చేసుకుంటే నా కళ్ళముందు నా కవితా చరణం ఒకటి కదలాడుతోంది.
వర్తమానాన్ని గౌరవించినవాడే
వీర కంకణ ధారుడై
కాలం మీద అజేయంగా నిలబడతాడు
వ్యాస రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, సైన్సు ప్రొఫెసర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img