Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వ్యక్తిగత రుణాలపై ఆంక్షలు

భారతీయ బ్యాంకుల్లో పెరిగిపోతున్న వ్యక్తిగత(పర్సనల్‌) రుణాల నియంత్రణకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్యలు తీసుకుంటున్నది. అధిక వడ్డీలతో బ్యాంకుల లాభదాయకతను పెంచుతున్న ఈ రుణాల మంజూరు పట్ల బ్యాంకుల మధ్య పోటీ ఏర్పడి అడ్డు అదుపు లేకుండా పంపిణీ జరుగుతోంది. దీంతో వాయిదాలు చెల్లింపుల్లో అవరోధాలు ఏర్పడి నిరర్థక ఆస్తులు (ఎన్‌ పీ ఏ) కూడా బాగా పెరిగిపోవడంతో బ్యాంకింగ్‌ రంగం ఒక కుదుపునకు గురి అయింది.వ్యక్తిగత రుణాలు కట్టు తప్పడం, వాటి చెల్లింపుల్లో జాప్యం నెలకొనడం, దేశ ఆర్థికాభివృద్ధికి ఇది ఎంత మాత్రం సమంజసం కాదన్న విషయాన్ని ఆర్బీఐ గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నాలుగు శాతం రుణాలు చెల్లిం పులు సక్రమంగా సాగడం లేదని పరిశీలనలు చెబుతున్నాయి. క్రెడిట్‌ కార్డు బకాయిలు రూ .1.94 లక్షల కోట్లకు చేరాయి. రుణ సంస్థలు జాగ్రత్తలు పడకపోతే అవి ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంది. పారు బాకిలతో సతమతమవుతున్న బ్యాంకులకు వ్యక్తిగత రుణాలు గుదిబండగా మారితే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ ఏడాది రెండో త్రై మాసికంలో వసూలు కావలసిన వ్యక్తిగత రుణాలు రూ. 48.26 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కొన్ని రకాల వ్యక్తిగత రుణాలు వేగంగా పెరిగిపోతుండడంపై జాగ్రత్త వహించాలని గతంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తి కాంత్‌ దాస హెచ్చరించినా కొన్ని బ్యాంకులు తేలి కగా తీసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత రుణాల విషయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల దూకుడును నిలువరించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. గృహ, విద్య, వాహన రుణాలు, బంగారం కొదవతో తీసుకున్న రుణాలను మినహాయిస్తూ వ్యక్తిగత రుణాల రిస్క్‌ను పెంచింది. ప్రతి వ్యక్తిగత రుణానికి బ్యాంకు, బ్యాంకింగే తర ఆర్థిక సంస్థల వద్ద ఉండాల్సిన పెట్టుబడిని 100 శాతం నుంచి 125 శాతానికి పెంచింది. క్రెడిట్‌ కార్డుల రుణాలు కూడా బ్యాంకుల వద్ద ఉండాల్సిన పెట్టుబడిని 125 శాతం నుంచి 150 శాతానికి పెంచింది. బ్యాంకింగే తర సంస్థలలో దాన్ని వంద నుంచి 125 శాతానికి పెంచింది. బ్యాంకింగేతర సంస్థలు బ్యాంకుల నుంచి సమకూర్చుకునే నిధుల రిస్క్‌ వెయిట్‌ ను 25 శాతానికి తీసుకెళ్లింది. ఈ చర్యల వల్ల వ్యక్తిగత రుణాలు ఇవ్వడం తగ్గుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి . అధిక వడ్డీ వచ్చే ఈ రుణాలకు వాణిజ్య బ్యాంకులు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. 1999 -2000 ఆర్థిక సంవత్స రంలో రూ 1.31 లక్షల కోట్ల వ్యక్తిగత రుణాలు ఇచ్చారు. 2023 మార్చి నాటికి అవి రూ. 41.80 లక్షల కోట్లకు చేరాయి. వ్యక్తిగత రుణాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం ప్రమాద సంకేతం. మున్ముందు ఆర్థిక వ్యవస్థ మాంద్యానికి లోనైతే వ్యక్తులు, కుటుంబాల ఆదాయాలు పడిపోయి బ్యాంకు రుణాలను తీర్చలేని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. అంతేకాక చాలామంది రూ. 50 వేల లోపు రుణాలను ఒకటికి మించి కూడా తీసుకుంటున్నారు. చాలా సందర్భాల్లో ఒకే వ్యక్తికి నాలుగు వరకు ఇలాంటి రుణాలు ఉంటున్నాయని క్రెడిట్‌ బ్యూరో నివేదికలు వెల్లడిస్తున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయాలు, ఉద్యోగాలు కోల్పోవడం, ఆర్థిక మందగమనం లాంటి కారణాలతో వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఉద్దేశపూర్వక ఎగవేత దారులుగా మారుతున్నారని నివేదికలు పేర్కొంటు న్నాయి. దీంతో పెద్ద బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఈ మొండి బకాయిలు పేరుకు పోతున్నాయి. విలువపరంగా చిన్నవే అయినా కష్టం మాత్రం ఎక్కువే ఉంటుందని రుణ దాతలు భావిస్తున్నారు. రెండో త్రైమాసికంలో పలు బ్యాంకులు వెల్లడిరచిన ఫలితాల్లో రిటైల్‌ ఎన్పీఏలు తగ్గాయని ప్రకటించాయి. దీనికి ప్రధాన కారణం రుణాలను గతంలో ఇచ్చినంత వేగంగా ఇవ్వకపోవడమే. దానివల్ల ఎన్‌పిఏ లు ఒక పెట్టున విజృంభించి దేశ ఆర్థికానికి చేటు తెస్తాయి. కరోనా తర్వాత బ్యాంకింగ్‌ వ్యవస్థలో వేగంగా మార్పులు వచ్చాయి. ఆర్థిక సంస్థలకు కొత్త సాంకేతికతను మరింత అభివృద్ధిచేసి క్షణాల్లో అప్పులు ఇస్తున్నాయి. ఇటీవల కాలంలో బ్యాంకులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఫలి తంగా బ్యాంకుల దగ్గర రుణాలు వేగంగా వృద్ధి చెందాయి. బ్యాంకులు అందిస్తున్న మొత్తం రుణాల్లో ఈ హామీలేని రుణాలవాటా మూడేళ్ల క్రితం 4.5 శాతం ఉండగా గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 7.4 శాతానికి చేరింది. రిటైల్‌ రుణాల్లోనూ 2019లో 18.6 శాతం వృద్ధి ఉంటే అందు లో హామీలేని రుణాలు 20.6 శాతం వరకు పెరిగాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సూచనలు, స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు బ్యాంకులు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ట్రాన్స్‌ యూనియన్‌ సివిల్‌ నివేదిక ప్రకారం చూస్తే కొత్త వారి రుణదరఖాస్తులను ఆమోదిం చడం 2020లో 34 శాతం, 2021లో 28 శాతం వరకు ఉండగా, 2023చివరి త్రైమాసికం నాటికి 23 శాతానికి తగ్గాయి. దీన్ని బట్టి కొత్త రుణ గ్రహీతలను బ్యాంకులు కాస్త దూరం పెట్టాయి అని అర్థం చేసుకోవచ్చు. గోపాలుని రాధాకృష్ణ సెల్‌: 9885390232

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img