Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

ఓటమి భయంతో వక్రభాష్యాలు

సవ్యసాచి

ఓటమి భయం కలగనేకూడదు. కలిగిందంటే వదలదు. అనుమానం పెనుభూతం అవుతుంది. ఎంతటి మహానుభావుడైనా అడ్డదార్లు వెతుకు తాడు. కురుక్షేత్రంలో ధర్మరాజు అంతటి వాడే ఓటమి భయం కలిగినప్పుడు అశ్వత్థామ హతః కుంజరహః అనాల్సివచ్చింది. కుంజరమే అశ్వత్థామ రూపం ధరించింది. వంచనతో, వక్ర భాష్యంతో ధర్మరాజు ఒడ్డున పడ్డాడు.
మోదీ ధర్మరాజంతటి ధర్మప్రభువు కాదని అందరికీ తెలుసు. ఆయన ప్రతి చిన్న అవసరానికి అడ్డదారిలో పోవడానికి వెనుకాడరు. అలాంటిది ఎన్నికలలో పరాజయం నీలినీడలు కనిపిస్తే విజృంభించక ఊరుకుంటారా ? ఎంతకైనా తెగబడతారు.
దేశంలో మొదటి, రెండో దశ పోలింగ్‌ పూర్తయ్యింది. పోలింగ్‌ సరళి మీద పార్టీలు, అభిమానులు కుస్తీలు పడతారు. తక్కువ ఓట్లు వస్తే ఏమవుతుంది? ఎక్కువ పోలింగ్‌ జరిగితే లాభనష్టాలు ఎలా ఉంటాయనే ఊహాగానాలు వెల్లువెత్తుతాయి. దీనికితోడు ఎగ్జిట్‌పోల్స్‌ వాళ్లు సమాచారం సేకరిస్తారు. అన్ని దశల పోలింగులు పూర్తి అయ్యే వరకు వాటిని మనలాంటి సామాన్యులకు గుప్తంగా ఉంచుతారు. అవిగుప్తంగా ఉన్నాయని ఎన్నికల కమిషన్‌ మనల్ని భ్రమింపజేస్తుంది. నిజానికి అధికారంలో వున్న పార్టీకి ఏదోరకంగా ‘‘ఉప్పు’’ అందుతుంది. పైగా వారికి ఇంటెలిజెన్స్‌ రిపోర్టులు అదనంగా వుంటాయి. ఇప్పుడీ గూఢచర్యలన్నీ మోదీని కలవర పరుస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్రచారం తీరు మారింది. 400 సీట్లు నావే అన్న ధీమా రెండో దశ ప్రచారంలో మాయమైంది. అంకెల ఆట ఆయనకు అచ్చి రాలేదు.
పదేళ్ల పాలనలో చెప్పుకోవడానికి సాధించిన ఫలితాలు లేవు. దేని గురించి మాట్లాడినా అవి ఎదురొస్తున్నాయి. యువతను ఉద్రేక పరుద్దామనుకుంటే నిరుద్యోగం పెనుభూతంలా ప్రత్యక్షమవుతున్నది. రైతులకు మోదీ భరోసా అంటే ఎక్కడికక్కడ తిరగబడుతున్న రైతుల నుంచి నిరసన ఎదురవుతున్నది. పేదలను ఉద్ధరించానని భ్రమ పెడదామంటే 80 కోట్ల పేదలకు తన ఉచితరేషన్‌ పథకం, ప్రపంచ ఆకలిసూచీలో అట్టడుగున వుండడం అడ్డొస్తున్నాయి. పెరిగిపోతున్న ధరలు ప్రజల్లో మంటలు రేపుతున్నాయి. అదాని, అంబానీ ఇతర బిలీయనీర్లు సంతోషంగావున్నా వారు డబ్బు దిమ్మరిస్తారే గాని ఓట్లు తెచ్చి మోదీకి గుమ్మరించలేరు. కొంతకాలంగా ఆయన రామాలయం మీద నమ్మకం పెట్టుకున్నారు. వందే భారత్‌ రైళ్లను అయోధ్య దారి పట్టించి ఓట్లు దండుకోవాలను కున్నారు. రామాలయాన్ని ప్రజలు సందర్శిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఈ సంతోషాన్ని దుర్భరంగా వున్న నిత్య జీవితం దిగమింగేస్తున్నది. అందుకే మోదీ ఓట్లకోసం కొత్త దారుల వేటలో పడ్డారు.
ఇప్పుడు మోదీ చుట్టూ ఒక పద్మవ్యూహం కనిపిస్తున్నది. మోదీ ప్రభంజనానికి ఎదురు లేదనుకుంటే పంజాబ్‌లో, హర్యానాలో ఇతర రాష్ట్రాలలో రైతులు తిరగబడుతున్నారు. బీజేపీ ప్రచారానికి అడుగడుగునా అడ్డం పడుతున్నారు. తమ గ్రామాలలోకి అడుగు పెట్టనీయం అంటూ పోస్టర్లతో ఊరేగుతున్నారు. ఆఖరికి మోదీ కంచుకోట కూడా బీటలు వారుతున్నది. అక్కడ లాయర్ల సమ్మెలు, ప్రభుత్వోద్యోగులు ఆందోళనలు, లక్షలాది వ్యాపారులు జీఎస్టీ నిబంధనలు మార్చాలని రోడ్డెక్కారు. మోదీ పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తున్నా ఓటమి భయాన్ని దాచలేక పోతున్నారు… దీనికితోడు సోషల్‌ ఇంజినీరింగ్‌లో సిద్ధహస్తులుగా గణతికెక్కిన బీజేపీ నాయకులు ఒకపక్క రాజపుత్రులని, జాట్‌లని, మరాఠాలని, తమ ఆధిపత్య దురహంకారంతో వ్యతిరేకుల్ని చేసుకున్నారు. వాళ్లు పంచాయతీలు పెట్టి బీజేపీని ఓడిస్తామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. దీనికితోడు టిక్కెట్‌ దక్కని నాయకులలో చాలా మంది బీజేపీ నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. గతంలోలాగ నాయకులు పిలిచి సముదాయిస్తే సర్దుకుపోయే స్థితిలేదు. అంతర్గత కుమ్ములాటలలోనూ బీజేపీ అగ్రస్థానంలో వుంది. ఇవి మోదీకి ఏనాడు ఎదురుకాని చేదు అనుభవాలు.
తొలి దశ పోలింగ్‌ తర్వాత మోదీ మత విద్వేష రాజకీయానికి, ప్రతిపక్షం మీద వికృత రాజకీయానికి తెరతీశారు. ఎన్నికలకు ముందు పౌరసత్వ చట్టాన్ని అమలులోకి తెచ్చారు. దానికి తోడుగా గెలిస్తే కామన్‌ సివిల్‌ కోడ్‌ (ఉమ్మడి పౌరస్మృతిని) తెస్తామని బెదిరిస్తున్నారు. ఐనా గెలుస్తానన్న భరోసా కలగడం లేదు. ఏకపక్ష విజయానికి ప్రతిపక్షం లేకుండా చేసే దుర్మార్గాన్ని ఎంచుకున్నారు. ఇద్దరు ప్రతిపక్ష ముఖ్యమంత్రులను జైళ్లలో పెట్టించారు. వారికి ఎన్నికల్లో ప్రచారానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. వారికి బెయిల్‌ ఇచ్చి కేసులు నడిపించవచ్చు. కాని, ఆమాత్రం సమన్యాయం జరిపించే ధర్మమూర్తులూ లేరు. ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్‌ మీద మోదీ విచక్షణారహితంగా దాడి మొదలెట్టారు… ఇప్పటికే ఆ పార్టీ అకౌంట్‌ను స్తంభింపజేశారు. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక మీద మోదీ విమర్శల పేరుతో వక్రభాష్యాలు, వికృత వ్యాఖ్యానాలు కురిపిస్తున్నారు.
మోదీ 10 ఏళ్ల పాలనలోనే ఆర్ధిక అసమానతలు అనూహ్యంగా పెరిగాయని ప్రముఖ ఆర్థికవేత్త పికెటీ రిపోర్టులో వెల్లడిరచారు. కొంతమంది దగ్గర పేరుకుపోయిన సంపదను పన్నుల విధింపు ద్వారా దేశ ప్రజలకు పంపిణీ జరగాలన్నారు పికెట్టీ. కాంగ్రెస్‌ మేనిఫెస్టో కులగణన చేస్తానంది. వారి ఆర్థిక స్థితిగతులు సర్వే చేస్తానంది. దేశ సంపదలో అందరికీ న్యాయం చేయడానికి ఈ గణన అవసరం అంది. మోదీకి అది కంటకప్రాయమైంది. కాంగ్రెస్‌ ఆర్థిక సర్వేని ప్రజల ఆస్తులను దోచుకునే సర్వేగాను అది మహిళల మంగళసూత్రాలను దోచుకుపోయే సర్వేగా వక్రభాష్యం చెప్పి ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి సంపదని కాంగ్రెస్‌ పార్టీ లాగేసి ముస్లిములకు -ఎక్కువమంది పిల్లలను కనేవారికి, విదేశీ చొరబాటుదారులకీ, దోచిపెడు తుందనే విద్వేష ప్రచారం మొదలెట్టారు. ఓటమి భయంతో ఎంతటి వక్రభాష్యాలు వల్లించడానికైనా దిగజారడం భర్తృహరి సుభాషితాన్ని తలపుకు తెస్తుంది
‘‘ఆకాశంబుననుండి శంభునిశిరం బందుండి శీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి
యస్తోకాంభోధిఁ బయోధి నుండి పవనాంధోలోకముం జేరె
గంగాకూలకంష పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్‌.’’

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img