Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

ప్రజాస్వామ్యంలో రాజద్రోహ చట్టాలు అవసరమా?

వి.గంగా సురేష్‌

నువ్వు ప్రకటించే భావాలతో నాకు అంగీకారం లేకపోవచ్చు కానీ ఆ భావాలు ప్రకటించే నీ హక్కును కాపాడటానికి నా ప్రాణాలైనా ఇస్తాను అన్నారు ఫ్రెంచి తత్వవేత్త ‘‘వోల్టెయిర్‌’’ ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్న అభిప్రాయాలు ,భావాలు కలిగిన వ్యక్తులు ,రాజకీయ సంస్థలు ఉన్నాయి అందరి అభిప్రాయాలను గౌరవించడం వారి భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడడమే నిజమైన ప్రజాస్వామ్యం. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులులో భాగంగా అధికరణ 19(1)ఎ లో ప్రతి పౌరుడు వారి భావాలను ఆలోచనలను అభిప్రాయాలను పంచుకునేందుకు రాజ్యాంగం హక్కు కల్పించింది. ప్రభుత్వ విధానాల పట్ల భిన్నఅభిప్రాయాలు వ్యక్తపరిచినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన వారిపై రాజద్రోహ నేరంమోపుతూ ఐపిసి 124 ఎ కింద కేసులు పెట్టి నిర్బంధిస్తున్నది ఈ రాజద్రోహచట్టం ఐపీసీ 124ఎ పౌర హక్కులకు రాజకీయ హక్కులకు భంగం కలుగు తుందని వాటిని రద్దు చేయాలని చాలా రోజులుగా పౌర సమాజం కోరుతున్నది వాటిని రద్దు చేయకపోగా రాజా ద్రోహ చట్టాన్ని మరింత పటిష్టం చేసేందుకు పౌర, రాజకీయ హక్కులు కాలరాసేందుకు ఇటీవల 22వ న్యాయ సంఘం(లా కమిషన్‌ ) శిక్షను 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలకు పెంచుతూ, పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రాజ్యాంగం కల్పించిన పౌర, రాజకీయ హక్కులు అంటూ ఏమీ ఉండవు ప్రజాస్వామ్య వ్యవస్థ కాస్త రాచరిక వ్యవస్థగా మారబోతున్నది.
బ్రిటిష్‌ ఇండియాలో మొదటి లా కమిషన్‌ చైర్మన్‌ అయిన థామస్‌ మెకాలే 1837లో భారత శిక్షాస్మృతి (ఐపిసి) ముసాయిదాను తయారు చేశారు అయితే ఈ ముసాయిదాలో రాజద్రోహం చట్టం అనేది లేదు 1870 నాటి కాలంలో స్వాతంత్ర పోరాటం ఉదృతంగా సాగుతున్న కాలంలో స్వాతంత్ర ఉద్యమాన్ని కట్టడిచేసి అణిచివేసేందుకు అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం 124A రాజద్రోహ చట్టం చేర్చి అనేకమంది స్వాతంత్ర సమరయోధులపై కేసు బనాయించి జైలు శిక్ష కూడా విధించింది. వీరిలో జోగేంద్ర చంద్రబోస్‌, బాలగంగాధర్‌, భగత్‌సింగ్‌, జవహర్‌లాల్‌ నెహ్రూతో పాటు హింసను విడనాడాలని బోధిస్తూ అహింస మార్గాన్ని ఎంచుకొని శాంతిదూతగా పేరు పొందిన మహాత్మాగాంధీ పై సైతం ఈ రాజద్రోహ చట్టాన్ని ఉపయోగించి జైల్లలో నిర్బంధించారు
రాజద్రోహచట్టంపై పార్లమెంటు రాజ్యాంగ సభలలో కూడా చర్చలు జరిగాయి.1962 కేదార్నాథ్‌ సింగ్‌ కేసులో సుప్రీం కోర్టు ఒక వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, విమర్శించినంతమాత్రాన, అది రాజద్రోహం కిందికి రాదని హింసను ప్రేరేపించడం శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం యుద్ధాన్నిప్రకటించడం వంటి చర్యలు రాజద్రోహ నేరం కిందికి వస్తాయని స్పష్టంగా చెప్పింది.
అయితే ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలపై, ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్తలపై రాజద్రోహం కేసు బనాయిస్తూనే ఉన్నారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతుల పైన, పర్యావరణ కార్యకర్తల పైన, జర్నలిస్టుల పైన, సామాజిక కార్యకర్తల పైన, పౌర హక్కుల కార్యకర్తల పైన వాళ్లు వీళ్లు అని లేకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు హక్కుల కోసం గళం విప్పి మాట్లాడేవారు ప్రభుత్వాన్ని విమర్శించేవారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు చేసేవారిపై రాజద్రోహం కింద జైల్లో నిర్బందిస్తున్నారు. జాతీయ నేర గణాంకాలు నివేదిక (ఎన్‌సిబిఆర్‌) ప్రకారం రాజద్రోహ చట్టం కింద 2014 నుండి 20 వరకు దాదాపు 399కేసులు నమోదు కాగా కేవలం 6 కేసులలో మాత్రమే దోషులుగా తేల్చింది కోర్టు ఏ స్థాయిలో ఈ చట్టం దుర్వినియోగం అవుతుందో మనందరికీ స్పష్టంగా తెలుస్తున్నది. రాజద్రోహ చట్టమే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం కూడా కొన్ని చట్టాలు చేసింది వీటిలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యుఎపిఎ) 1961 ప్రజా హక్కుల కోసం పోరాటం చేస్తున్న సామాజిక రాజకీయ కార్యకర్తలపై తీవ్ర నేర ఆరోపణలు చేస్తూ ‘‘ఉపా ‘‘చట్టం కింద కేసు నమోదు చేస్తున్నదీ ఎన్‌ సి బి ఆర్‌ నివేదిక ప్రకారం 2015 నుండి 19 వరకు 7840 కేసులు నమోదు కాగా కేవలం 155 కేసులలో దోషులుగా న్యాయస్థానం తేల్చింది. గిరిజన హక్కుల ఉద్యమ కారుడు స్టాన్‌స్వామిపై ఈ చట్టం కింద కేసు నమోదు చేసి జైల్లో నిర్బంధిస్తే ఆయన జైల్లోనే మరణించిన పరిస్థితి. మరొకరి సహాయం లేకుండా చక్రాల కుర్చీ నుండి ఒక్క అడుగు కదలలేని స్థితిలో ఉన్న ఆచార్య జి ఎన్‌ సాయి బాబా పై పెట్టి జైల్లో నిర్బంధించింది.
జాతీయ భద్రతా చట్టం 1980, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం 1958 వంటి చట్టాలను అడ్డుపెట్టుకొని ప్రజా వ్యతిరేక విధానాల గురించి మాట్లాడుతున్న వారిపై ప్రజా హక్కుల గురించి పోరాడేవారిపై ఈ చట్టాలను ప్రయోగిస్తూ రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను పౌర హక్కులను రాజకీయ హక్కులను కాలరాస్తున్నది.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు మాత్రం ఇచ్చిన విడిగా కులం మతం భాష దేశభక్తి ధర్మం పేరుతో సున్నితమైన అంశాలను రెచ్చగొడుతూ విద్వేషాలు రంగుల్చుతూ మనుషుల మద్య విభజన తీసుకొచ్చే విధంగా ప్రసంగాలు చేస్తున్నా వారి పైన ఎటువంటి సాధారణ కేసులు కూడా పెట్టరు. మచ్చుకు హిందీ మాట్లాడని వారు ఈ దేశం నుండి వెళ్లిపోవాలి ఈ దేశంలో ఉండాలంటే హిందీనీ ప్రేమించాలి అని బీజేపీి నేత ఉత్తరప్రదేశ్‌ మంత్రి సంజయ్‌ నిషాత్‌ విద్వేషకర మాటలు మాట్లాడుతారు, భవిష్యత్తులో మూడు రంగుల జాతీయ జెండాను తొలగించి కాషాయ జెండాను జాతీయ జెండాగా చేస్తామని కర్ణాటకకు చెందిన బీజేపీి మాజీ మంత్రి ఈశ్వరప్ప మాట్లాడారు. ఈ దేశంలో ముస్లింలు క్రైస్తవులు ఉండకూడదు దేశం నుండి వెళ్లిపోవాలని కూడా మాట్లాడొచ్చు కానీ అటువంటి బీజేపీి, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు నాయకుల పైన ఎటువంటి సాధారణ చర్యలు కూడా ఉండవు.
ఇండియాకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా కొనసాగుతూనే ఉన్నది ఈ చట్టాన్ని చేసిన బ్రిటన్‌ దేశంలో నిరంకుశత్వానికి స్వస్తి పలికి ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు రాజద్రోహ చట్టానికి కాలం చెల్లిందని 2009 లో రద్దు చేశారు. భారత ప్రజలకు పౌర, రాజకీయ హక్కులు కల్పిస్తామని అంతర్జాతీయ పౌర, రాజకీయ హక్కుల ఒడంబడికలో సంతకాలు చేసింది ప్రభుత్వం అయినా వాటిని నిరంతరం కాలరాస్తూనే ఉన్నది ఆధునిక ప్రజాస్వామ్య దేశంలో బ్రిటిష్‌ కాలం నాటి రాజద్రోహం చట్టం అవసరం లేదని అనేకమంది న్యాయ నిపుణులు రాజకీయ పార్టీలు తేల్చి చెప్పారు. గత సంవత్సరం అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ వి రమణ కూడా రాజద్రోహ నేరచట్టం ఐపిసి124ఎ ని తాత్కాలికంగా నిలుపుదల చేశారు అయితే 22వ లా కమిషన్‌ మాత్రం పౌర రాజకీయ హక్కులు లేకుండా చేసేందుకు రాజద్రోహ చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని సిఫారసు చేసింది.
వ్యాస రచయిత సెల్‌: 9849181961

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img