Monday, May 20, 2024
Monday, May 20, 2024

ప్రాబల్య వర్గాలతో కొలువుదీరిన కర్నాటక మంత్రివర్గం

    బీజేపీ అవినీతికర పాలనతో విసిగిపోయిన కర్నాటక ప్రజలు హస్తం పార్టీకి 135 అసెంబ్లీ స్థానాలతో ఘన విజయం చేకూర్చారు. తొలుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ సహా 8మంది మంత్రులు ప్రమాణంచేయగా మే 27న మరో 24 మంది మంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో మొత్తం మంత్రివర్గ సభ్యుల సంఖ్య 34కు పెరిగింది. 2024 మేలో కీలకమైన లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి 43 శాతం ఓట్లు రాగా బీజేపీ 36శాతం ఓట్లతో 66 స్థానాలు గెలిచినా కర్నాటకలో ఇప్పటికీ బలంగానే ఉంది. కాంగ్రెస్‌ తరపున 39 మంది లింగాయతులు శాసనసభ్యులుగా ఎన్నిక కావడంతో సహజంగానే కొత్త మంత్రివర్గంలో అత్యధికంగా 8మంది లింగాయతులకు ప్రాతినిధ్యం కల్పించారు. మంత్రివర్గంలో ఏకైక మహిళామంత్రి లక్ష్మి హెబ్బాల్కర్‌ అత్యధిక మెజారిటీతో బెల్గాం గ్రామీణ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. సంఘసంస్కర్త బసవన్న జన్మించిన బసవన బాగేవాడి స్థానం నుండి ఎన్నికైన శివానందపాటిల్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. లక్ష్మి హెబ్బాల్కర్‌ శివానంద పాటిల్‌ ఉత్తర కర్నాటకలో ప్రాబల్యంగల పంచమశాలి లింగాయత్‌ ఉపకులానికి చెందినవారు. లక్ష్మి హెబ్బాల్కర్‌కు మహిళా, శిశు సంక్షేమశాఖను, శివానంద పాటిల్‌కు చక్కెర, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలను కేటాయించారు. బణజిగ (వ్యాపార) లింగాయత వర్గానికి చెందిన ఈశ్వర ఖండ్రే (భల్కి నియోజకవర్గం)కు అడవులు, పర్యావరణశాఖ, ఆది బనజిగ లింగాయత వర్గానికి చెందిన డా.శరణప్రకాష్‌ పాటిల్‌(సేడం)కు ఉన్నత విద్యాశాఖ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆప్తుడైన ఎం.బి.పాటిల్‌కు భారీ, మధ్య తరహా పరిశ్రమలు, ఐటి, బిటి శాఖలను, శరణ బసప్పదర్శన్‌ పూర్‌(సహపుర్‌)కు లఘు పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు కేటాయించారు. ఎస్‌.ఎస్‌.మల్లికార్జున్‌(సదర్‌ లింగాయత్‌ దావనగేరే(ఉత్తర)కు గనులు, జియాలజి, హెచ్‌.కె.పాటిల్‌ (గదగ్‌)కు న్యాయ, పార్లమెంట్‌ వ్యవహారాలు, చిన్ననీటి పారుదల శాఖలను కేటాయించారు. 
    కర్నాటకలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 20 లోక్‌సభ స్థానాలు గెలవాలి అని కాంగ్రెస్‌ లక్ష్యంగా పెట్టుకున్నది. దూరమైన లింగాయతుల విశ్వాసాన్ని చూరగొనడానికి వారికి 8మంత్రి పదవులు ఇవ్వడం కాంగ్రెస్‌కు రాజకీయంగా అవసరమే. కర్నాటక జనాభాలో 18 శాతం ఉన్న దళితులకు ఏడు మంత్రిపదవులు, 11శాతం జనాభా గల ఒక్కలిగలకు 5మంత్రి పదవులు, 12శాతం జనాభా గల ముస్లింలకు శాసనసభాపతి(యు.టి.ఖాదర్‌) మరి రెండు మంత్రి పదవులు ఇచ్చారు. బెంగళూరు నగరంలోని చామరాజ నగర్‌ నుండి గెలిచిన జమీర్‌ అహ్మద్‌ఖాన్‌కు వక్ఫ్‌, గృహవసతి, మైనారిటీ వ్యవహారాలు, బీదర్‌నుండి 4సార్లు ఎన్నికైన రహీమ్‌ఖాన్‌కు పురపాలక, హాజ్‌ శాఖలను కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి ఆర్‌.గుండురావు (బ్రాహ్మణ) కుమారుడు దినేష్‌ గుండు(గాంధీనగర్‌ బెంగళూరు)కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, మరో మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప(ఈడిగ)కు ప్రాథమిక, మాధ్యమిక విద్యశాఖలను కేటాయించారు. మధు బంగారప్ప సివమొగ్గ జిల్లాలోని సొరబ నియోజకవర్గంలో బీజేపీఅభ్యర్థి తనసోదరునిపై విజయం సాధించడం విశేషం. కాంగ్రెస్‌నే నమ్ముకున్న బి.కె.హరిప్రసాద్‌ కూడా ఈడిగ కులస్తుడే. మంత్రి పదవి వస్తుందనే నమ్మకంతో ఉన్న హరిప్రసాద్‌ ఆఖరి నిమిషంలో మంత్రిపదవి తప్పిపోవడంతో హతాశుడయ్యాడు. బెల్గాం జిల్లా సరిహద్దు అథనీ నియోజకవర్గం నుండి 72వేల భారీ మెజారిటీతో శాససభ్యుడిగా ఎన్నికైన మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్‌ సవదికి మంత్రిపదవి రాకపోవడంతో ఆయన వర్గంలో అసంతృప్తిని కలిగించింది. 
    ఎన్నికలకు ముందు లక్ష్మణ్‌ సవది, మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌ శెట్టర్లకు బీజేపీ టిక్కెట్లు నిరాకరించడంతో వారు కాంగ్రెస్‌లో చేరడంతో, లింగాయతులు హస్తం పార్టీవైపు మొగ్గు చూపినందునే కిత్తూరు(ముంబై) కర్నాటకలోని 50 స్థానాలకు కాంగ్రెస్‌ 32 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగలిగింది. మధ్య కర్నాటకలో కూడా లింగాయతుల ప్రాబల్యం అధికమే. 26 స్థానాలకు గాను ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ 16, బీజేపీ 8స్థానాలు గెలిచాయి. పాత మైసూరు ప్రాంతం తొలినుండి కాంగ్రెస్‌కు బలమైనది. అయితే హెచ్‌.డి.దేవెగౌడ దేశ ప్రధాని అయ్యాక, ఆ తర్వాత ఆయన కుమారుడు హెచ్‌.డి కుమారస్వామి తొలుత బీజేపీ, ఆ తర్వాత కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పరచి ముఖ్యమంత్రిగా చక్రం తిప్పడంతో అక్కడ జనతాదళ్‌ ఎస్‌ మూడోశక్తిగా బలపడిరది. అయితే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు, ఒక్కలిగ కులానికి చెందిన డి.కె.శివకుమార్‌ కూడా కర్నాటక సి.ఎం రేసులో సిద్ధరామయ్యతో పోటీ పడటం, తొలి 30నెలలు సిద్ధరామయ్య, ఆ తర్వాత 30నెలలు డి.కె. శివకుమార్‌ ముఖ్యమంత్రిగా తమ వర్గాలతో మంత్రివర్గాలు ఏర్పరచాలి అనే అవగాహన కుదిరిందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలు మధ్యలోనే కుప్పకూలి, రాజకీయ అస్థిరత నెలకొని పాలన స్తంభించడం, అభివృద్ధి అడుగంటడంతో ఇతర వర్గాలతో పాటు ఒక్కలిగ కులస్థులకు కూడా రుచించలేదు. ఒక్కలిగ (వ్యవసాయ దారులు) అయిన శివకుమార్‌ ముఖ్యమంత్రి అవుతారని నమ్మి వారిలో అత్యధికులు కాంగ్రెస్‌ కు ఓటేయడంతో ముసూరు ప్రాంతంలోని 61స్థానాలలో కాంగ్రెస్‌కు35, జేడీఎస్‌కు19, బీజేపీికి కేవలం 4సీట్లు వచ్చాయి. బెంగళూరు మహానగరంలో మొత్తం 28స్థానాలకు గాను బీజేపీికి 16, కాంగ్రెస్‌కు 12 స్థానాలు లభించాయి. ప్రధాని మోదీ బెంగుళూరులో జరిపిన రోడ్‌షోలకు భారీ స్పందన లభించింది. 
    గతంలోకంటే బీజేపీ సీట్లు పెరిగాయి. బెంగళూరు నగరపాలక సంస్థ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో నగరం నుండి ఎన్నికైన ఎమ్మెల్యేలలో ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. కె.జే.జార్జి(సర్వజ్ఞ నగర్‌)కి ఇంధన శాఖను. బిటిఎం లేఅవుట్‌ నుండి ఎన్నికైన రామలింగారెడ్డికి రవాణా, దినేష్‌ గుండు రావు(గాంధీనగర్‌), జకీర్‌ ఆహ్మద్‌ ఖాన్‌(చామరాజపేట), రెవిన్యూ, కృష్ణ బైరేగౌడ(బ్యాటరాయనపుర) హెబ్బాల్‌ నుండి గెలిచిన బైరతి సురేష్‌లకు మంత్రివర్గంలో స్థానంకల్పించారు. 7శాతం జనాభాగల కురుబలకు సిఎం.సిద్ధ రామయ్యతో బాటు ఆయనకు ఆప్తుడైన బైరతి సురేష్‌కు ప్రాతినిధ్యం కల్పించారు. ఒక్కళిగ సామాజిక వర్గం నుండి వ్యవసాయ మంత్రి చలువరాయ స్వామి(నాగమంగల), మైసూరు జిల్లా పెరియపట్న నుండి గెలిచిన వెంకటేష్‌కు పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ శాఖలను, చిక్కబల్లాపుర జిల్లా చింతామణి నుండి ఎన్నికైన సి సుధాకర్‌కు వైద్య, విద్యాశాఖను కేటాయించారు. ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ ప్రముఖ ఒక్కళిగ నేత. ఆయనకు భారీ, మధ్యతరహా నీటిపారుదల, బెంగళూరునగరాభివృద్ధి శాఖలను కేటాయించారు. ఎస్సీ మంత్రులు జి.పరమేశ్వర(మాల)కు కీలకమైన హోం, హెచ్‌.సి మహాదేవప్ప నాల, (టి.నర్సిపుర)కు సాంఘిక సంక్షేమశాఖ, శివరాజ్‌ తంగడిగి (వడ్డే,కనకగిరి స్థానం)కి బీసీ, ఎస్‌.టి.సంక్షేమం, రుద్రప్పల మాని లంబాని (హావేరి)కి ...శాఖను, ఆర్బ్‌ తిమ్మాపూర్‌ (మాదిగ, బాగల్‌ కోట్‌)కు ఎక్సైజ్‌ శాఖను, మాజీ కేంద్రమంత్రి కె.హెచ్‌.మునియప్ప(మాదిగ, దేవనహళ్లి) కి ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖను అప్పగించారు. 
    కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ తనయుడు, ప్రియాంక ఖర్గే (మాల, షహపూర్‌)కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖలను కేటాయించారు. షెడ్యూల్‌ తెగలలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సన్నిహితుడైన సతీష్‌ జార్కి హోలికి ప్రజాపనుల శాఖను, బళ్ళారి గ్రామీణ నియోజకవర్గంలో మాజీ రవాణా మంత్రి బి.శ్రీరాములును ఓడిరచిన బి.నాగేంద్రకు క్రీడలు, యువజన సర్వీసులు, కన్నడ సంస్కృతి శాఖలను, కె.ఎన్‌.రాజన్నకు సహకార శాఖలను కేటాయించారు. ఉత్తర కన్నడ జిల్లా భత్కల్‌ నుండి ఎన్నికైన మత్స్యకార మొగవీర తెగకు చెందిన మంకల్‌ వైద్యకు రేవులు, మత్స్య శాఖలను ఇచ్చారు. రాయచూర్‌కు చెందిన భోజరాజు (క్షత్రియ) ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకపోయినా ఆయనకు టూరిజం, శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాఖలను అప్పగించారు. భోజరాజు కుమారుడు రాయచూర్‌ నుండి పోటీకిదిగారు. రాయచూర్‌లో ముస్లింజనాభా ఎక్కువగా ఉండటంతో ముస్లింఅభ్యర్థికి అనుకూలంగా భోజరాజు కుమారుడిని విరమింపజేశారు. ఇతర నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ విజయానికి అది ఉపయోగపడిరది. అందుకు ప్రతిఫలంగా ఇచ్చిన మాట మేరకు బోజరాజును మంత్రిపదవి వరించింది. ఆయనకు త్వరలో ఎమ్మెల్సీ కూడా ఇవ్వనున్నారు. సుధాకర్‌కు మౌలిక సదుపాయాలు, ప్రణాళిక, గణాంక శాఖలను, సంతోష్‌లాడ్‌ (మరాఠా)కార్మిక, నైపుణ్యాభివృద్ధి శాఖలను అప్పగించారు. 

పతకమూరు దామోదర్‌ ప్రసాద్‌
సీనియర్‌ జర్నలిస్టు, సెల్‌: 9440990381

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img