Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ప్రజాస్వామ్యానికీ మంగళం!

డాక్టర్‌. సీ.ఎన్‌. క్షేత్రపాల్‌ రెడ్డి,
9059837847

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారత దేశంలో ప్రజాస్వామ్యానికి విలువలేదని పాలకులు తేల్చేశారు. దేశ ఔన్నత్యానికి ప్రతీక అయిన ప్రజాస్వామ్యం విద్యార్థులకు భారంగా మారిందనే ప్రభుత్వపు వింతవాదన తెరపైకి వచ్చింది. ఇటీవలే రాజదండం చేతబూని పార్లమెంటు లోకి ప్రవేశించిన ప్రధాని నరేంద్రమోదీ సంఫ్‌ు పరివార్‌ సిద్ధాంతానికి అనుగుణంగా దేశంలో ఇకపై రాజరికం తరహా పాలన సాగబోతున్నట్టు తన చేతల ద్వారా ప్రకటించారు. రాజరికానికి ప్రతీక అయిన రాజదండం ప్రతిష్ఠాపన పూర్తయి వారం గడవక ముందే అందుకు తగినట్టు దేశంలోని ప్రజాస్వామ్యానికి పాతర వేసేందుకు అవసరమైన కీలకమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే నూతన విద్యావిధానాన్ని అడ్డం పెట్టుకుని పాఠశాలస్థాయిలో పదో తరగతి విద్యార్థులకు నేర్పుతున్న ప్రజాస్వామ్యం పాఠ్యాంశానికి ఎన్‌సీఈఆర్‌టీ ద్వారా మంగళం పాడిరచేశారు. అలాగే రసాయనశాస్త్రంలోని ఆవర్తన పట్టిక, జాతీయ, ఆర్తిక, రంగానికి వ్యవసాయ రంగం సమకూరుస్తున్న ఆదాయం, ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లు, సహజవనరుల సుస్థిర నిర్వహణ లాంటి కీలక అంశాలను పదవ తరగతి పాఠ్యపుస్తకాల నుంచి తొలగించారు.
భారతదేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడుతోందని స్వీడన్‌లోని గూటెన్‌బర్గ్‌ వర్సిటీకి అనుబంధంగా పని చేస్తున్న వీ-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 2020లో విడుదల చేసిన నివేదిక వెల్లడిరచింది. ఉదారవాద ప్రజాస్వామ్య సూచీ (లిబరల్‌ డెమొక్రసీ ఇండెక్స్‌) పేరుతో మొత్తం 179 దేశాల్లోని ప్రజాస్వామ్య పరిస్థితులను పరిశీలించిన ఆ సంస్థ ఇచ్చిన ర్యాంకుల్లో భారత్‌ది 90వ స్థానం డెన్మార్క్‌ తొలి స్థానం పొందగా, మన పొరుగు దేశాలైన శ్రీలంక 70వ స్థానం, నేపాల్‌ 72వ స్థానంతో మన కన్నా మెరుగైన ర్యాంకులను పొందాయి. మోదీ పాలనలోకి వచ్చాక దేశంలోని పౌర సమాజం, ప్రతిపక్షా లకు స్థానం సన్నగిల్లడంతోనే భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి పడిరదని ఆ నివేదిక స్పష్టంగా తెలిపింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో దేశంలోని పౌర సమాజం, మీడియా, రాజకీయ పరిస్థితుల గురించి క్షుణ్ణంగా తెలుసుకునే నివేదికను తయారుచేసి విడుదల చేసినట్టు వీ-డెమ్‌ డైరెక్టర్‌ స్టాఫన్‌ లిండ్బర్గ్‌ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. దేశంలోని భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియా స్వాతంత్య్రం, పౌర సమాజానికున్న స్వేచ్ఛ, ఎన్నికలు జరిగే విధానం, నాణ్యత, మీడియాలో భిన్నాభిప్రాయలకున్న స్థానం, విద్యా స్వేచ్ఛ తదితర ప్రజాస్వామ్య మూలస్తంభాల ఆధారంగానే తమ పరిశీలన జరిగిందని తెలిపారు. భారత్‌లో ఇవన్నీ క్రమంగా బలహీనపడు తున్నాయని తెలిపారు. మోదీ పాలనలోనే వీటి క్షీణత గణనీయంగా జరిగిందని పేర్కొంటూ భారత్‌ ప్రజాస్వామ్య వ్యవస్థలేని దేశాల జాబితాలో చేరడానికి చాలా దగ్గరగా ఉందని హెచ్చరించారు. ఈ హెచ్చరిక వెలువడిన రెండేళ్ల కాలంలోనే భారత్‌లో ప్రజాస్వామ్యానికి మంగళంపాడే చర్యలకు ప్రభుత్వమే కంకణం కట్టుకుని పనిచేస్తున్నట్టు అర్థమవుతోంది. ఇందులో భాగమే ఎన్‌సీఈఆర్‌టీ తాజాగా తీసుకున్న నిర్ణయం అనుకోక తప్పదు. భారత్‌లో ప్రజాస్వామ్యం నశిస్తే భావ ప్రకటన స్వేచ్ఛ, లౌకికవాదం, మత జోక్యం లేని ప్రభుత్వం, గణతంత్ర వ్యవస్థ, చట్టం ముందు అందరూ సమానత్వం అనే భావనలు, ప్రాథమిక హక్కులు అపహాస్యానికి గురవుతాయి. ఇప్పటికే భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వతంత్రతకు ముప్పు, భిన్నాభిప్రాయాలను అణచి వేతకు ప్రభుత్వమేఅండగా నిలుస్తోందనేసూచనలు లేకపోలేదు. పార్లమెంటును మత రాజకీయాలకు కేంద్రంగా మార్చివేస్తూ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చిన పాలకులు ఇక విద్యార్థులకు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలుసుకోకుండా ఎన్‌సీఈఆర్‌టీ ద్వారా పాఠశాల స్థాయిలోనే నిషేధించడం నియంతృత్వంతో కూడిన అధికార దుర్వినియోగమే.
పదో తరగతి సిలబస్‌ నుంచి ప్రజాస్వామ్యం పాఠ్యాంశాన్ని తొలగించినట్టు ఎన్‌సీఈఆర్‌టీ చేసిన ప్రకటన చాలా గర్హనీయం. విద్యార్థులకు చదువు భారం కాకూడదనే ప్రజాస్వామ్యం దానికి అనుబంధంగా బోధిస్తున్న పాఠ్యాంశాలను తొలగించినట్టు ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ సక్లానీ పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రజాస్వామ్యం అవసరం లేదని కూడా వ్యాఖ్యానించారు. ఇదేదో ఇప్పుడే చేయలేదని కరోనా అనంతర కాలం నుంచి 6 నుంచి 10 వతరగతి స్థాయిలో వివిధ పాఠ్యాంశాలను తగ్గిస్తూ వస్తున్నామని తమ నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఆయన వ్యాఖ్యల వెనుక నేటి పాలకులకు ప్రజాస్వామ్యంపై ఉన్న వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవలే డార్విన్‌ పరిణామ క్రమ సిద్ధాంతాన్ని సిలబస్‌ నుంచి తొలగించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా అవేవీ లెక్కచేయని పాలకులు తాము అనుకున్న పనిచేయడానికి నిస్సిగ్గుగా మరో దుందుడుకు చర్యకు పాల్పడడం సహించరానిది. పాలకుల సలహాలు, సూచనలు, ఆదేశాలు లేకుండా ఎన్‌సీఈఆర్‌టీ ఇటువంటి కీలకమైన నిర్ణయం తీసుకుంది అనుకోవడానికివీల్లేదు. భారతదేశం ప్రపంచంలోగొప్ప ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటూనే ఇక్కడి విద్యార్థులకు ఆ పాఠ్యాంశాన్ని బోధించడానికి వీల్లేదని హుకుం జారీచేయడం వెనుక పాలక పెద్దలహస్తం ఉందనేని సుస్పష్టం.
పదో తరగతి స్థాయిలోనే విద్యార్థులకు డెమోక్రసీ విభాగంలో ఇప్పటి వరకూ బోధిస్తున్న ప్రజాస్వామ్యం, దాని పుట్టుక, రాజకీయ పార్టీలు వంటి పాఠ్యాంశాలను తొలగించి సాధించదలచుకున్న ప్రగతి ఏమిటనేది ఇప్పుడు మన ముందున్న పెద్ద ప్రశ్న. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు ఉన్న భారత్‌లో విద్యార్థులకు ప్రజాస్వామ్యమే భారమైందని అధికారులు వ్యాఖ్యా నించడం ఆత్మవంచనే అవుతుంది. ఎన్‌సీఈఆర్‌టీ తీసుకున్న నిర్ణయం దేశ ఔన్నత్యానికి గొడ్డలి పెట్టు. ఈ అనాలోచిత, అప్రజాస్వామిక నిర్ణయం కారణంగా విద్యార్థులకు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం ఆలంబనగా నడుస్తున్న ఎన్నికల వ్యవస్థ, ఏర్పడుతున్న ప్రభుత్వాలు, వాటి పని తీరును తెలుసుకునే అవకాశం కోల్పోతారు. విద్యార్థులకు రాజకీయ అవగాహన అనేది పూర్తిగా లేకుండా పోతుందని విద్యావేత్తలకు సంబంధించిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఏ మాత్రం లెక్క చేయకుండా ఇటువంటి నిర్ణయాలను ప్రకటించడం వెనక ఏ శక్తులు పని చేస్తున్నాయో పాలక పక్షం రాజకీయ సిద్ధాంత అవగాహన ఉన్న వారందరికీ ఇట్టే అర్థమవుతుంది.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాచరికంతో కూడిన మనువాద సిద్ధాంతానుగుణమైన పాలన సాగించాలనే ఈ కుట్రను అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, పౌర, ప్రజాసంఘాలు ఏకమై చేధించకపోతే దేశ భవిష్యత్తు మధ్యయుగాల నాటి అంధకారంలోకి నెట్టివేస్తారు. ఈ నేపథ్యంలో విజ్ఞత ప్రదర్శిద్దాం. ప్రజాస్వామ్య రక్షణకు, పదో తరగతి పాఠ్యాంశాల్లో ప్రజాస్వామ్య పాఠ్యాంశ పునరుద్ధరణకు బాధ్యతగా కృషి చేద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img