Monday, May 20, 2024
Monday, May 20, 2024

రైతు సొమ్ము ఇప్పుడే ఇవ్వరా?

రైతు విత్తనం వేసిన దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు రైతుభరోసా కేంద్రాలే ‘‘సర్వరోగ నివారిణి’’గా రైతులకు ఎదురయ్యే ప్రతి సమస్యను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని ముఖ్యమంత్రి పదే పదే వల్లెవేస్తుంటారు. అయితే రైతుకు వ్యవసాయంలో ప్రతినిత్యం ప్రసవవేదన తప్పడం లేదు. ఖరీఫ్‌కాలంలో వరి పంట వేసిన రైతులు రెండు నెలలు గడిచినా రైతుభరోసా కేంద్రాల ద్వారా అమ్మిన ధాన్యానికి సొమ్ము అందలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 21 రోజుల్లో రైతుల సొమ్ము చెల్లిస్తామన్న హమీ ఇంకా ఎన్నాళ్ళకు అమలవుతుందంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.
రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఇంకా రైతులకు అవసరమైన ఏ వస్తువు కొనాలన్నా తక్షణం పైకం చెల్లించాల్సిందే. భరోసా కేంద్రాల్లో తమకు కావలసిన వెరైటీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఇతర వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉండవు. కాబట్టి తప్పనిసరిగా ప్రైవేటు వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తున్నది. మరో పక్క వ్యవసాయ పెట్టుబడులులేక ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడి పెట్టుబడులు తెచ్చుకోవాల్సివస్తుంది. ఈ ప్రక్రియలో కౌలు రైతులు పడే వ్యధలు వర్ణనాతీతం.
జనవరి 18 నుంచి రైతులు అమ్ముకున్న ధాన్యానికి సొమ్ము అందాల్సి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 850 కోట్ల మేర రైతులకు సొమ్ము అందాలి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘ నాయకత్వం కృష్ణాజిల్లాలోని చల్లపల్లి, మొవ్వ మండలాల్లోను, ఎన్టీఆర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, జి. కొండూరు మండలాల్లోను, ఏలూరు జిల్లాలోని పెదపాడు, దెందులూరు మండలాల్లోను, పార్వతిపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోను పర్యటించిన సందర్భాల్లో రైతుల వ్యధలను పరిశీలించింది. గత రెండు మాసాలుగా ధాన్యం సొమ్ము అందక రైతులు, కౌలు రైతులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను వారు నాయకత్వం దృష్టికి తెచ్చారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం సకాలంలో సొమ్ము చెల్లించకుండా సతాయిస్తున్నదని రైతులు వాపోయారు.
పంటకు తెచ్చిన పెట్టుబడులతోపాటు కోతలు, కుప్ప నూర్పిళ్లకు, ధాన్యం రవాణాకు అయ్యే కూలీల ఖర్చులు, అప్పులకు వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువు, తుపానులవల్ల ఈ సంవత్సరం వరి పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని, ఆర్‌బీకేల సిబ్బంది మిల్లర్లు విధిస్తున్న నిబంధనలతో మద్దతుధర రాకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తీరా కొన్న ధాన్యానికి నెలల పర్యంతం సొమ్ము చెల్లింపులు జరపకపోవడంతో రైతుల ముఖాల్లో సంతోషం కరువైంది. ధాన్యం పండిరచిన రైతు సహనానికి ప్రభుత్వం పరీక్ష పెడుతున్నది.
సొమ్ము చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరగడంతో రైతులు ఆర్‌బీకేలకు ధాన్యం తేవడం మానుకున్నారు. నేరుగా రైసు మిల్లర్లకు, వ్యాపారులకు క్వింటాకు రూ. 200 నుంచి 300 తక్కువకు అమ్ముకోక తప్పడం లేదు. సొమ్ము చెల్లింపుల్లోనే కాక ధాన్యం సేకరణలోనూ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ప్రభుత్వం సేకరించిన ధాన్యం 29.91 లక్షల టన్నులు మాత్రమే. అదే 2019`20 సంవత్సరంతో పోల్చితే 17.92 లక్షల టన్నులు తక్కువ. రైతుసంఘ నాయకత్వం సేకరించిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో సుమారు 150 కోట్లు, విజయనగరం జిల్లాలో 70 కోట్లు, పార్వతీపురం, మన్యం జిల్లాలో 48 కోట్లు రైతులకు చెల్లింపులు జరపాల్సి ఉన్నది.
ఖరీఫ్‌ కాలంలో అమ్మిన ధాన్యం సొమ్ము అందక, రబీ పంటకు పెట్టుబడులకు ఇబ్బందులు పడుతూ రైతులు తీవ్ర మనోవేదనకు గురౌతున్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగం ధాన్యం సొమ్ములు ఎప్పుడు చెల్లిస్తుందా అని ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణం స్పందించి ధాన్యం సొమ్ము చెల్లింపులు జరపకుంటే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు.

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి
సెల్‌: 9490952737

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img