Friday, May 3, 2024
Friday, May 3, 2024

విశాఖ ఉక్కు రక్షణకు ఉద్యమమే శరణ్యం

టి. లక్ష్మీనారాయణ

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 33 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో పరిరక్షించు కోవడానికి అన్ని రాజకీయపక్షాలు ప్రజలను కలుపుకొని ఉద్యమం చేయడమే మార్గం. విశాఖ ఉక్కు కర్మాగారం జాతి సంపద. కార్పోరేట్‌ సంస్థల పరం కాకుండా రక్షించుకోవడమే నిజమైన దేశభక్తి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ, విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ‘‘స్టీల్‌ మార్కెటింగ్‌’’ తద్వారా వర్కింగ్‌ క్యాపిటల్‌ను సమకూర్చుకోవడం, ఈ రెండు వేరు వేరు అంశాలు. రాజకీయ లబ్ది కోసం రెండిరటినీ కలగాపులగంచేసి ప్రజల్లో గందరగోళం సృష్టించడం వాంఛనీయం కాదు. ‘‘ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు’’ అన్నది బీజేపీ-ఆర్‌.ఎస్‌.ఎస్‌. భావజాలం. అయితే మోదీ ప్రభుత్వం వ్యాపారం చేయడానికే సిద్ధమైంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వందకు వంద శాతం ప్రయివేటీకరణ చేస్తామని పదే పదే పునరుద్ఘాటిస్తూ, నిర్వహణ వ్యయానికి అవసరమైన ‘‘వర్కింగ్‌ క్యాపిటల్‌’’ను కేంద్ర ప్రభుత్వం సమకూర్చకుండా సహాయ నిరాకరణ చేస్తున్నది. బ్యాంకుల నుండి అప్పు తెచ్చుకోవడానికి కూడా ‘‘బ్యాంక్‌ గ్యారెంటీ’’ లేకుండా చేసి, అవరోధాలు సృష్టిస్తున్నారు. పర్యవసానంగా విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వహణకోసం నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నది.
‘‘వర్కింగ్‌ క్యాపిటల్‌’’ను సమకూర్చుకోవడానికి విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఒక నోటిఫికేషన్‌ ఇచ్చింది. అది, ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ‘‘స్టీల్‌ మార్కెటింగ్‌’’కు సంబంధించినది మాత్రమే. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరణ చేస్తామని మోదీ ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నది. కానీ, ఇంకా నోటిఫికేషన్‌ జారీ చేయలేదు, టెండర్‌ పిలవలేదు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి పూర్తి యాజమాన్య హక్కు కేంద్ర ప్రభుత్వానిదే. అమ్మకానికి సంబంధించిన ప్రక్రియలో మోదీ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నది. అది సుస్పష్టం. కానీ, అధికారుల స్థాయిలో 2023 మార్చి 27న జారీ చేసిన నోటిఫికేషన్‌ ఆ ప్రక్రియలో భాగం కాదన్నది గమనించాలి. ఉదాహరణకు ఒక రైతుకు భూముంది. వరిసాగుచేసే నైపుణ్యం ఉంది. ట్రాక్టర్‌, ఇతర వ్యవసాయ పనిముట్లు ఉన్నాయి. కానీ, వ్యవసాయ ఖర్చులకు అంటే విత్తనాలకు, ఎరువులకు, పురుగు మందులకు, కూలీలకు, ట్రాక్టర్‌ మరమ్మత్తులకు, డీజిల్‌కు డబ్బుల్లేవు. నిధులను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను సరఫరా చేస్తాము, సేద్యం ఖర్చులకు డబ్బు సమకూర్చుతాము, పంట పండాక వడ్లు మాకు అమ్ముతావా! అన్న ప్రతిపాదనతో ఏ సంస్థ లేదా వ్యక్తి అయినా రైతును సంప్రదించవచ్చు. ఇరువురి మధ్య అవగాహన కుదిరితే వ్యాపార ఒప్పందం చేసుకొంటారు.
ఆ కోవకు చెందినదే విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యం 2023 మార్చి 27న జారీ చేసిన నోటిఫికేషన్‌. స్టీల్‌ అవసరం ఉన్న, లేదా, స్టీల్‌ వ్యాపారం చేస్తున్న సంస్థలు ముందుకొచ్చి స్టీల్‌ ఉత్పత్తికి సంబంధించి తమ వద్ద ఉన్న ముడి సరుకు అంటే ఇనుప ఖనిజం/బొగ్గు/ తదితర ముడి సరుకులు సరఫరా చేయడానికి లేదా డబ్బు చెల్లించడానికి సిద్ధపడుతూ ఆసక్తి వ్యక్తం చేస్తే, ఆ సంస్థల ఆర్థికపరిస్థితిని మదింపు వేసుకొని, నిబంధనలకు లోబడి ఒప్పందం చేసుకుంటామని విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యం వారి నోటిఫికేషన్‌లో పేర్కొన్నది. ఇది కేవలం వ్యాపారానికి సంబంధించిన వ్యవహారం. విశాఖ ఉక్కు కర్మాగారం, తన స్టీల్‌ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకొని, తమకు అవసరమైన ముడి సరుకును, నిర్వహణకు అవసరమైన మూలధనాన్ని సమకూర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఈ వ్యవహారానికి, మోదీ ప్రభుత్వం ప్రకటించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విధానానికి లింకు పెట్టి మాట్లాడుకోవడం వల్ల ఫలితం శూన్యం. రాజకీయ లబ్ధికోసం, కుటిల రాజకీయనీతిలో భాగంగా, ఉద్దేశ పూర్వకంగా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నట్లు కనబడుతున్నది. ‘‘ఎద్దు ఈనిందంటే దొడ్లో కట్టివేయమన్నట్లు’’ అన్న నానుడిగా గత రెండు, మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చలు జరుగుతున్నాయి.
విశాఖ ఉక్కు కర్మాగారం ఆర్థిక స్థితిగతులపై ఆసక్తి ఉన్నవారు 2021-22 ఆర్థిక సంవత్సరం ఆర్థిక నివేదికను అధ్యయనం చేయాలి. ఆ ఏడాదిలో విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి అమ్మకాలు 5.23 మి.టన్నులు, స్థూల ఆదాయం రు.28,647 కోట్లు. 2020-21 కంటే 57శాతం అధికంగా ఆదాయాన్ని నమోదు చేసుకొన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు రు.3,480 కోట్లు సమకూర్చాయి. పన్ను చెల్లింపు తర్వాత నికర లాభం రు.913 కోట్లు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రు.21,089 కొట్లుగా ఉన్న బుణభారాన్ని 2021-22 నాటికి రు.17,148 కోట్లకు తగ్గించుకొన్నది. 7.5 మిలియన్‌ టన్నుల గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం, 2021-22లో 5.77 మి.టన్నుల ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. 2022 -23లో వర్కింగ్‌ క్యాపిటల్‌ లేకపోవడంతో, ఆసియా ఖండంలోనే అత్యాధునిక బ్లాస్ట్‌ ఫర్నేస్‌గా భావిస్తున్న మూడవ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ఏడాదికిపైగా ఆపరేషన్‌లో లేదు. దాన్ని ఆపరేషన్‌లోకి తీసుకురావడానికి రు.1000 కోట్లు అవసరమట. నిర్వహణ వ్యయం, వేతనాలు(15,696 మంది శాశ్వత ఉద్యోగులు, కార్మికులు దాదాపు 18,000 కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు), తదితర ఖర్చుల కోసం రాబోయే నాలుగైదు మాసాలకు నాలుగైదు వేలకోట్లు అవసరమని చెబుతున్నారు. ఆ మేరకు వర్కింగ్‌ క్యాపిటల్‌ను సమకూర్చుకోవడానికే యాజమాన్యం నోటిఫికేషన్‌ జారీచేసింది. వర్కింగ్‌ క్యాపిటల్‌ లేకపోవడంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 3.75 మి.టన్నులకు పడిపోయి, స్థూల ఆదాయం రు.22,770 కోట్లకు తగ్గింది. ఈ పరిస్థితి కొనసాగితే పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది.
విశాఖ ఉక్కు నాణ్యమైనది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు కర్మాగారం నోటిఫికేషన్‌కు అనుగుణంగా స్టీల్‌ కొనుగోలుపై ఆసక్తి వ్యక్తం చేస్తూ దరఖాస్తుచేసి, వర్కింగ్‌ క్యాపిటల్‌ను సమకూర్చాలి. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, నిర్మాణంలోఉన్న ఇతర ప్రాజెక్టులకు, బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకం, వగైరా నిర్మాణాలకు స్టీల్‌ అవసరం ఉన్నది కదా! అలాగే, కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ ‘‘స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’’ నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లు విశాఖ ఉక్కు కర్మాగారంలో భాగస్వామ్యం అయ్యేలా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం, పార్లమెంటు సభ్యులు, అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి.
సమస్య మౌలిక స్వభావాన్ని, కేంద్ర ప్రభుత్వం వైఖరిని, యాజమాన్యం అమలుచేస్తున్న నిర్ణయాలను నిశితంగా అధ్యయనం చేసి, స్పందించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ఉద్యమకారులపైన ఉన్నది. ‘‘నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరించినట్లు’’ వ్యవహరించే కేసీఆర్‌ మాటలను ఎవరైనా పొరపాటున నమ్మితే ‘‘కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లు’’ అన్న సామెతగా తయారవుతుంది.
వ్యాస రచయిత సామాజిక ఉద్యమకారుడు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img