Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

వ్యవసాయం లాభసాటయ్యేదెప్పుడు ?

భారతీయ వ్యవసాయంలో సవాళ్లను పరిష్కరించడానికి బహుముఖ విధానం అవసరం. వ్యవసాయ పనితీరును మెరుగు పరచడం, ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం, గ్రామీణాభివృద్ధికి భరోసా ఇవ్వడానికి ఈ సవాళ్లను పరిష్కరించడం అత్యవసరం. నేల క్షీణతను అరికట్టడానికి పర్యావరణ అనుకూల పద్దతులు పాటించాలి. డ్రిప్‌, స్ప్రింక్లర్‌ సిస్టంలతో సహా, సమర్థవంతమైన నీటి నిర్వహణ పద్దతులు అవలంబించాలి. మారుతున్న వాతావరణ విధానాలకు అనుగుణంగా విభిన్న పంటరకాలు, పద్ధతులను అనుసరించాలి. రసాయన ఎరువుల స్థానే సేంద్రీయ ఎరువులు వాడాలి. వ్యవసాయ యంత్రాలను వాడాలి.

డి.జె.మోహన రావు

ప్రజల ఆహార అవసరాలు తీరడానికి వ్యవసాయం తప్పనిసరి. మనదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయ యోగ్యమైన భూమిని కలిగి ఉంది. దేశ ఆర్థికవ్యవస్థలో వ్యవసాయం కీలకపాత్ర పోషిస్తుంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జనాభాలో యాభై శాతానికి పైగా జీవనోపాధిని కలిగిస్తుంది. యాభై యెనిమిది శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయమే ఆధారం. దేశ జి.డి.పిలో వ్యవసాయ వాటా సుమారు పద్దెనిమిది శాతం. దేశం శ్రామికశక్తిలో యాభై ఎనిమిదిశాతం ఈ రంగంలోనే ఉన్నారు. ఆహార పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాలు వ్యవసాయం నుండే లభిస్తున్నాయి. అధిక జనాభాతో అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ప్రజల ఆహార భద్రతను నిర్ధారించడంలోను, పరిశ్రమలు, సేవారంగాల వృద్ధికి వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాని ఇప్పుడు దేశంలో వ్యవసాయం పర్యావరణ, ఆర్థిక, సంస్థాగత, సాంకేతికత పరంగా సవాళ్ళను ఎదుర్కుంటోంది.
ప్రపంచీకరణ వలన రైతు ఆదాయం తగ్గింది. దేశంలోని చాలా ప్రాంతాలలో సాగువిధానాలు ప్రాచీన పద్ధతిలోనే కొనసాగిస్తున్నారు. నాణ్యమైన విత్తనాల కొరత పెద్ద సమస్యగా మారింది. దేశంలోని దాదాపు అరవైఐదు శాతం వ్యవసాయం రుతుపవన వర్షపాతంపై ఆధారపడిఉంది. వాతావరణ మార్పులు అస్థిర ఋతుపవనాలకు కారణమవుతున్నాయి. వర్షపాతంలో హెచ్చు తగ్గులు కరువులు, వరదలకు దారితీస్తున్నాయి. ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తి ఏటా అస్థిరత్వానికి గురవుతోంది. దేశంలో గణనీయమైన సంఖ్యలో చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. తరతరాలుగా కుటుంబ సభ్యులమధ్య జరిగిన భూ విభజన వలన, జనాభా ఒత్తిడి కారణంగా, చిన్న రైతులు అప్పులు తీర్చుకోవడానికి తమ భూమిలో కొంత భాగాన్ని అమ్ముకోవడం వలన సాగుభూమి చిన్న కమతాలుగా మారిపోతున్నాయి. ఇవి చిన్నాభిన్నంగా ఉండడం వలన నీటిపారుదల సరిగా జరగడంలేదు. యాంత్రీకరణకు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించడానికి ఆటంకం కలుగుతుంది. ఇది పంటల ఉత్పాదకతను తగ్గిస్తుంది.
భూమి పరిమాణం చాలా తక్కువగా ఉన్నప్పుడు సాగు ఆర్థికంగా ఉండదు. భూ వనరులపై అధిక జనాభా ఒత్తిడి కారణంగా వర్షాధార ప్రాంతాలు, ముఖ్యంగా పొడి భూములు తక్కువ దిగుబడిని ఎదుర్కొంటున్నాయి. వరి, గోధుమలు, పత్తి, నూనె గింజలతో సహా భారతీయ పంటల దిగుబడులు అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. హరిత విప్లవం, అస్తవ్యస్త నీటిపారుదల వ్యవసాయ పద్ధతులు భూమి క్షీణతకు దారితీశాయి. మానవ కార్యకలాపాలవల్ల వర్షాధార ప్రాంతాలు కూడా నేలకోతను, క్షీణతను ఎదుర్కొంటుంది. ఒకే పంటను పదే పదే సాగుచేయడంవల్ల నేల పోషకాలను కోల్పోయి నిస్సారంగా మారింది. చాలా ప్రాంతాలలో సాగునీరు కోసం భూగర్భజలాలను అధికంగా వాడడం వల్ల భూగర్భజల స్థాయిలు క్షీణించాయి. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ధరతో పాటుగా లేబర్‌ ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. పంట పెట్టుబడికి రైతులు అధిక వడ్డీకి రుణాలు వాడుతున్నారు. పంట నష్టపోవడం, పంటలకు గిట్టుబాటుధర లేకపోవడం, అధిక ఖర్చులు వలన సగానికిపైగా వ్యవసాయ కుటుంబాలు అప్పుల పాలవుతున్నారు. చాలా మంది అనధికారిక వనరుల నుండి రుణాలు పొందుతున్నారు. వాణిజ్యపంటలు సాగుచేసే రైతులు ఎక్కువగా నష్ఠపోతున్నారు. కరువు, పంట నష్టాలు వలన అప్పుల ఊబిలో కూరుకుపోయి ఒక్కోసారి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నాణ్యమైన ఎరువులు ఉపయోగించపోవడం వలన నిస్సారమైననేల పంట ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనివల్ల దిగుబడితగ్గి వ్యవసాయ ఉత్పాదకత తగ్గుతుంది. అసమర్థమైన వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థలు ధరల అస్థిరతకు దారితీస్తాయి. సరైన నిల్వ, రవాణా సౌకర్యాలు లేకపోవడం వలన రైతులు వెంటనే తక్కువ ధరకే ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇది పంట అనంతర నష్టాలను మరింత పెంచుతుంది. నేరుగా మార్కెటింగ్‌ విధానం లేకపోవడం వలన వచ్చే ఆదాయంలో కొంత భాగం మధ్యవర్తుల పాలవుతున్నది. ప్రస్తుతం ఉన్న పంటల విధానం కొన్ని ప్రధాన పంటల వైపు మాత్రమే మొగ్గుచూపే విధంగా ఉన్నాయి. పంటలలో వైవిధ్యం లేకపోవడం వల్ల వ్యవసాయ రంగం తెగుళ్లు, వ్యాధులు, మార్కెట్‌ ఒడిదుడుకుల బారినపడుతుంది. సాగులో ఆధునిక సాంకేతికలు అమలు పరచడం లేదు.
భారతీయ వ్యవసాయంలో సవాళ్లను పరిష్కరించడానికి బహుముఖ విధానం అవసరం. వ్యవసాయ పనితీరును మెరుగు పరచడం, ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం, గ్రామీణాభివృద్ధికి భరోసా ఇవ్వడానికి ఈ సవాళ్లను పరిష్కరించడం అత్యవసరం. నేల క్షీణతను అరికట్టడానికి పర్యావరణ అనుకూల పద్దతులు పాటించాలి. డ్రిప్‌, స్ప్రింక్లర్‌ సిస్టంలతో సహా, సమర్థవంతమైన నీటి నిర్వహణ పద్దతులు అవలంబించాలి. మారుతున్న వాతావరణ విధానాలకు అను గుణంగా విభిన్న పంటరకాలు, పద్ధతులను అనుసరించాలి. రసాయన ఎరువుల స్థానే సేంద్రీయ ఎరువులు వాడాలి. వ్యవసాయ యంత్రాలను వాడాలి.
ప్రభుత్వాలు చేయవలసినవి:
సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతులు, వర్షపునీటి సంరక్షణను అమలు చేయాలి. తీవ్రమైన వాతావరణ సంఘటనల కోసం ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అందుబాటులోకి తేవాలి. ఆహారోత్పత్తిని పెంచేందుకు ఎప్పటికప్పుడు నిర్ణయించే ఆహార ధాన్యాల ధరలకు తగిన ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా వారు సహేతుకమైన ఆదాయాన్ని పొందేలా చూడాలి. పారదర్శక సరసమైన ధరల విధానాలను ఏర్పాటు చేయాలి. మెరుగైన ధరల ఆవిష్కరణకోసం సమర్థవంతమైన మార్కెట్‌ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. రైతులు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నేరుగా విక్రయించే ఏర్పాట్లు చేయాలి. రైతులకు ఆర్థిక సహాయం మరింత చేయాలి. రైతులు అధునాతన వ్యవసాయ సాంకేతికతలు అంది పుచ్చుకోడానికి డిజిటల్‌ వ్యవసాయ పద్ధతులపై శిక్షణ అందించాలి. భారతీయ వ్యవసాయం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించ డానికి, సుస్థిరతను ప్రోత్సహించడానికి, ఉత్పాదకతను పెంచడానికి, దేశవ్యాప్తంగా రైతుల జీవనోపాధిని మెరుగు పరచడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి.

సెల్‌: 9440485824

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img