Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

మన కాలపు చింఫీుజ్‌

ఐత్‌ మాతోవ్‌

నేను డిగ్రీ చదివే రోజుల్లో ఓసారి శ్రీకాకుళం వెళ్లాను మాఊరు అమలాపురం నుంచి రెంటికీ మధ్య దూరం ఆరేడు గంటలు. పగటి పూట ప్రయాణం. చలం మ్యూజింగ్స్‌ పుస్తకం చదువుతూ బస్సులో కూర్చున్నాను. ఓ నలభై ఐదు నిమిషాల ప్రయాణం, ఇరవై పేజీలు చదివి ఉంటా. అంతే ఆ ఇరవై పేజీలు నాలో సుడులు తిరుగుతూ నా ఆలోచనలు నాకే అంతు పట్టక ఆ ఆరేడు గంటల ప్రయాణం సాగింది. మధ్యలో టీ కోసం, సిగరెట్టు కోసం ఆగాను కానీ ఆ రెండు నాకు రుచించలేదు. చలం మ్యూజింగ్స్‌ నన్ను నిలువ నీయలేదు. ఇదిగో మళ్లీ మూడున్నర దశబ్దాల తర్వాత ఈ మారుతీ పౌరహితం రాసిన ‘‘ప్రణయ హంపి’’ చారిత్రక నవల నన్ను మళ్లీ ఆనాటి మ్యూజింగ్స్‌ స్థితికి తీసుకు వెళ్లింది. ఈ నవల వచ్చాక చాలా మంది ఫేస్‌బుక్‌ లో తమ తొలి స్పందన రాశారు. ఏకబిగిన చదివేశామని, ఇది పూర్తయ్యేవరకు కన్ను తిప్ప లేకపోయామని చెప్పుకొచ్చారు. అమెరికాలో వుంటున్న మాజీ కమ్యూనిస్టు, నేటి హిపోక్రాట్‌ తాను రెండు నవలలు చదువుతుండగా ఈ ప్రణయ హంపి తన చేతికి వచ్చిందని, ఆ రెంటిని ఆపేసి ఇది చదివేశానని చెప్పాడు. ఈ నవలావధానం ఏమిటో నాకు అర్ధం కావట్లేదు. సరే, నా మటుకు నాకు రెండు, మూడు చాప్టర్లు చదివాక ఇక ముందుకు వెళ్లడం సాధ్యం కాలేదు. ఈ ప్రణయ హంపి నవలలో…
‘‘సాహసం, కవిత్వం, అందం, శృంగారం, ప్రేమ వీటి కోసమే మనం సజీవంగా వుంటాం’’ అంటుంది నవలలో కధానాయిక ముద్దుకుప్పాయి. ఈ లైన్లు చదివాక ఇక ముందుకు వెళ్లగలమా! నిజంగా మనం వీటి కోసమే సజీవంగా వున్నామా..! ఈ సంక్షుభిత సమాజంలో ఇది సాధ్యమేనా అనిపిస్తుంది. అనిపించడం కాదు. ఆ ఆలోచనలలోకి తీసుకుపోతుంది. నా మహా రచయిత, చింఫీుజ్‌ ఐత్‌ మాతోవ్‌ రాసిన ‘‘జమీల్యా’’ కు ఈ ముద్దుకుప్పాయికి మధ్య అనేకానేక పోలికలు కనబడతాయి. ఈ రెండు నవలల నేపథ్యం యుద్దము- ప్రేమే కావడం యాదృచ్ఛికం కానే కాదు. ఈ రెండు నవలల్లోనూ కథానాయకులు, కథానాయికలు ఇద్దరూ అణగారిన కులాలకు చెందిన వారే. ఇద్దరూ అనివార్యంగా యుద్ధ బీభత్సానికి చెదిరిపోయిన రెండు గుండెలే. అందుకే ఈ మారుతి పౌరహితాన్ని నేను మన కాలపు ఐత్‌ మాతోవ్‌ అన్నాను. ప్రణయ హంపి చారిత్రక నవల దసరా ఉత్సవాలతో ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవాల కోలాహలం మన కళ్ల ముందే జరుగుతున్న భ్రాంతి కలిగిస్తారు మారుతి. దీన్ని జర్నలిస్ట్‌ పరిభాషలో అయితే సీన్‌ రిపోర్టింగ్‌ అంటారు. ఆ సీన్‌ రిపోర్టింగ్‌ ఈ దసరా ఉత్సవాలలో ఎంత గొప్పగా ఉందంటే ‘‘వ్యాపారులు రత్నాలను కందులవలె రాశులుగా పోసి అమ్మకానికి పెట్టారు’’ అంటారు. ఈ ఉత్సవాన్ని చదువుతుంటే ఆ రాశులలో రత్నాలను కొనుగోలు చేయడానికి నేనూ అక్కడ మోకాళ్లపై కూర్చున్న భ్రాంతిని కలిగించారు మారుతి పౌరోహిత్యం.
ఈ ప్రణయ హంపిలో ప్రియురాలు ముద్దుకుప్పాయికి ప్రియుడు సంబజ్జ గౌడ సాహితీవేత్త కనక దాసరు చెప్పిన బియ్యం- రాగి గింజ కథ చెబుతాడు. ఇది త్రేతాయుగంలో జరిగిన కథగా, బియ్యం, రాగి గింజల్లో ఏది గొప్పదో తేల్చే కథగా వివరిస్తారు. ఈ రెంటి వివాదాన్ని శ్రీ రామ చంద్రుడు పరిష్కరిస్తాడు. ఈ రెండు ధాన్యాలలో ఎప్పటికీ నిలువ వుండే రాగులదే పై చేయిగా తీర్పునిస్తాడు. ఈ తీర్పుతో రాగి గింజ గర్వ పడదు. తన పక్కనే నిలబడిన బియ్యపు గింజను ఓదారుస్తుంది. అక్కున చేర్చుకుంటుంది. నవలలో ఈ ఉపకథ పైకి ధనిక, పేద వర్గాల మధ్య, ఉన్నత, దిగువ వర్గాల మధ్య అంతరాన్ని చూపిస్తుంది. నాకైతే ఈ ఉపకథ నేటి రాజకీయ, ప్రాంతీయ అస్తిత్వాల కథగానే తోచింది. ఆంధ్రా పాలకుల పెత్తందారి తనానికి నలిగిపోయిన రాయలసీమ వాసుల గొంతుగా రాగి గింజ కానవచ్చింది. బియ్యం ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా పండే పంట. అక్కడ రాగి పంట వుండదు. అలాగే రాయలసీమలో రాగులే ప్రధాన ఆహారం. ఇక్కడ బియ్యానికి రెండో స్థానం. నేటి ప్రాంతీయ వాద, అస్తిత్వ వాద ఉద్యమాలతో ఈ బియ్యం, రాగుల మధ్య ఎవరు గొప్ప అనే ఉపకథ రచయిత మారుతి పౌరోహితం లోలోపలి అస్తిత్వ నినాదం.
నవలలో మకుటంలేని మహారాజు అళియ రామరాయులు ముస్లిముల పట్ల ప్రేమను, వాత్సల్యాన్ని అద్భుతంగా చూపించారు రచయిత. తన సైన్యంలో వారిని అధిక సంఖ్యలో నియమించుకున్నారు. ముస్లిం వాడలలో గో వధను అంగీకరించాడు. యుద్ద సమయంలో ఆ ముస్లిం సైనికులే కోవర్టులుగా మారి తమ వారినే హతమార్చడం రామరాయులకే కాదు నవల చదివే వారికి కూడా రుచించదు. సరిగ్గా ఇది చదువుతున్నప్పుడే నా చేతిలో వున్న నవలని అసహనంగా విసిరికొట్టాను. నా మటుకు నాకు ఈ పరిణామం భీతి కొల్పింది. రచయిత పేరు పదే పదే గుర్తుకొచ్చి నా లోలోపల ఆవేదన చెందాను. వ్యక్తి స్వార్థాన్ని మొత్తం ముస్లిం సమాజానికి ఆపాదించడాన్ని చదివి కలతచెందాను. రెండురోజుల పాటు మనిషిని కాలేకపోయాను. టేబుల్‌ మీద వున్న ప్రణయ హంపి నా వైపు చూసి ‘‘పూర్తిగా చదువు’’ అని అంటున్నట్లుగా నాకనిపించింది. ఇక్కడ కూడా నేను నవల ఆమాంతం చదివించేటట్లుగా అనిపించ లేదు. రెండు రోజుల తర్వాత ఓ భయం, బెరుకు వెంటాడుతుండగా వెన్నుపోటు పొడిచిన వ్యక్తుల సమూహం కంటే ఆ ముస్లిం సమాజమే, ఆ బాదుషాలే, విడిపోయిన, ఇక కలవలేరనుకున్న ముద్దుకుప్పాయి, సంబజ్జ గౌడలను కలిపిన తీరుతో సేద తీరాను. కోపంతో ఒకింత ఏవగించుకున్న రచయిత మారుతికి మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నాను.
నవలలో వేశ్యా వృత్తిలో వున్న ‘‘వలంది’’ పాత్ర నేను రాసిన ‘‘భోగం వీధి సుగుణ’’కు తోబుట్టువులా తోచింది. ప్రేమ మాత్రమే మిగలాలని ఆకాంక్షిస్తూ… లక్షలాది ప్రాణాలను బలికొంటున్న యుద్ధం లేని రోజుల కోసం కలలు కనడం వినా ఇంకేం చేయలేమా…!?
(నేడు ఎమ్మిగనూరులో ప్రణయ హంపి చారిత్రక నవల ఆవిష్కరణ)
సీనియర్‌ జర్నలిస్ట్‌, సెల్‌: 9912019929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img