Friday, March 24, 2023
Friday, March 24, 2023

పడి… లేచిన కెరటం కేఎల్‌

న్యూదిల్లీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో విఫలం కావడంతో మూడో టెస్టు నుంచే కేఎల్‌ రాహుల్‌ను తప్పించారు. చివరి టెస్టులోనూ చోటు దక్కలేదు. వన్డే జట్టులోనూ అవకాశం వస్తుందా..? లేదా..? అని అంతా భావించారు. అనూహ్యంగా జట్టులో చోటు కల్పించారు. కానీ, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఈ స్థానం తనకెంతో ఇష్టమైంది అన్నట్లుగా ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరు అద్భుతం. మిడిలార్డర్‌లో తానెంత ముఖ్యమైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. కీలకమైన అర్ధశతకం (75 నాటౌట్‌)తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ ఉన్నప్పటికీ.. కేఎల్‌ రాహుల్‌తోనే హార్దిక్‌ కీపింగ్‌ చేయించాడు. అక్కడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. స్మిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను కళ్లుచెదిరేలా డైవ్‌ చేస్తూ ఒడిసిపట్టాడు. దీంతో ఆశ్చర్యపోవడం స్మిత్‌ వంతైంది. ఇలాంటి ఫీట్‌ కేఎల్‌ రాహుల్‌ నుంచి రావడం విశేషం.
పోటీనే కారణమా…?
వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును బీసీసీఐ సమాయత్తం చేస్తోంది. అందులో భాగంగా ప్రతి మ్యాచ్‌నూ సునిశితంగా పరిశీలిస్తోంది. దీంతో సీనియర్లకు పోటీగా యువత ప్రదర్శనతో అదరగొడుతుంది. ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, సంజూ శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌.. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రపంచ కప్‌ జట్టులో చోటు దక్కాలంటే యువతతో పోటీ పడి మరీ ఆడాలి. కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా ఇతర విభాగాల్లో ప్రతిభ నిరూపించుకోవాలి. అదృష్టవశాత్తూ కేఎల్‌ రాహుల్‌కు కీపర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించగల సత్తా ఉంది. ఇప్పుడదే ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో తనను నిరూపించుకోవడం రాహుల్‌కు ఉపయోగపడిరది. మిడిలార్డర్‌లో రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ లేకపోవడంతో ఈ సిరీస్‌లో రాహుల్‌కు అవకాశం లభించింది. దానిని చక్కగా వినియోగించుకుని తన స్థానాన్ని సుస్థిరం చేసుకొనే దిశగా ప్రయత్నించాడు.
ఐపీఎల్‌నూ వినియోగించుకోవాలి
తొలి వన్డేలో క్లిష్లమైన సందర్భంగా అర్ధశతకంతో జట్టును విజయతీరాలకు చేర్చిన రాహుల్‌ తన ప్రదర్శనతో సంతృప్తి పడకూడదు. లేకపోతే సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురవ్వక తప్పదు. మిగిలిన రెండు వన్డేల్లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాలి. ఆ తర్వాత మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌లోనూ రాణించాలి. అప్పుడు జూన్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం జట్టులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. వన్డే ఫార్మాట్‌లోనే ఆసియా కప్‌, భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ ముందున్న నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌ విశ్రమించకూడదు.

ప్రశంసల వర్షం
మొన్నటి వరకు విమర్శలు గుప్పించిన వారే ప్రశంసలు కురిపిస్తే ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి అవకాశం కేఎల్‌ రాహుల్‌కు లభించింది. ఆసీస్‌పై సూపర్‌ ఇన్నింగ్స్‌తో సోషల్‌ మీడియాలో అభినందనలు కురిశాయి. ఎప్పుడూ రాహుల్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శించే మాజీ ఆటగాడు వెంకటేశ్‌ ప్రసాద్‌ కూడా ఈసారి స్వరం మార్చాడు. ‘తీవ్ర ఒత్తిడి సమయంలోనూ కేఎల్‌ ఆడిన తీరు అద్భుతం. అతడి నుంచి వచ్చిన సూపర్‌ ఇన్నింగ్స్‌ల్లో ఇదొకటి’ అని వెంకటేశ్‌ ప్రసాద్‌ ట్వీట్‌ చేశాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img