హైదరాబాద్‌లో ఆరు నెలల్లో ట్రైజిన్ కార్యకలాపాలు
వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు, శిక్షణ
విశాలాంధ్ర`హైదరాబాద్: ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్‌పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. ఈ కంపెనీ డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది. హైదరాబాద్‌లో ట్రైజిన్ కంపెనీ అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో 1,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకొని శిక్షణను అందిస్తుంది. ఈ కంపెనీ మొత్తం ఆదాయం 160 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీలో పని చేస్తున్న 2,500 మందిలో వెయ్యి మంది మన దేశంలో ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు వంద మంది ఉన్నారు. మరో ఆరు నెలల్లోనే తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది. రెండు దశాబ్దాలకు పైగా ఐక్య రాజ్య సమితితో పాటు అనుబంధ విభాగాలకు ఈ కంపెనీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. గత ఏడాది నుంచి ట్రైజిన్ కంపెనీ తమ సేవలను అందుకుంటున్న సంస్థల్లో అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ వినియోగంతో పాటు ఫలితాలపై విశ్లేషణలు చేస్తోంది. అన్ని రంగాలలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఎంచుకుంది.
ఆర్సీసీఎం విస్తరణ…మరిన్ని ఉద్యోగాలు
టెక్నాలజీ, సర్వీస్ సొల్యూషన్స్‌లో పేరొందిన ఆర్సీసీఎం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం ఆర్సీసీఎం సీఈవో గౌరవ్ సూరి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఆర్సీసీఎం మొదటిసారిగా హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని విస్తరించనుంది. అమెరికా తర్వాత విదేశాల్లో కంపెనీ పెట్టడం ఇదే మొదటి సారి. ప్రపంచ వ్యాప్తంగా తమ సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. డీఈషా గ్రూప్, బ్లాక్‌స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ మద్దతుతో ఆర్సీసీఎం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. బ్యాంకులు, హెడ్జ్ ఫండ్లు, సంస్థాగత ఆస్తుల నిర్వాహకులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతో పాటు కార్యకలాపాలపై ఈ కంపెనీ విశ్లేషణలు అందిస్తుంది. ప్రత్యేకంగా డేటా మేనేజ్మెంట్, డేటా స్ట్రాటజీలో ఈ కంపెనీకి గుర్తింపు ఉంది. హైదరాబాద్ కార్యాలయ విస్తరణతో రాష్ట్రంలో మరింత మంది యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గ్లోబల్ టెక్ కంపెనీలకు ప్రధాన గమ్య స్థానంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షించనుంది. ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో స్పష్టం చేశారు. కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని ప్రకటించారు. ఈ కంపెనీ విస్తరణ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సురెన్స్ రంగంలో హైదరాబాద్ పే కొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలబెడుతుందని అన్నారు. సాంకేతిక వృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సహకారం తప్పనిసరిగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ఆర్సీసీఎం లాంటి కంపెనీలకు తగినంత మద్దతుతో పాటు మౌలిక సదుపాయాలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుందని అన్నారు.
మౌలిక సదుపాయాలతో పాటు నైపుణ్యమున్న మానవ వనరులుండటంతో హైదరాబాద్ ను తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్లు కంపెనీ సీఈవో గౌరవ్ సూరీ తెలిపారు.