విశాలాంధ్ర,షాద్ నగర్,రూరల్: రంగారెడ్డి జిల్లా పట్టణంలో స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాల్లో భాగంగా అపశృతి చోటుచేసుకుంది. మునిసిపాలిటీ ఏర్పాటు చేసిన భోజనాన్ని చేసిన కార్మికులు సుమారు14 మంది అస్వస్థతకు గురయ్యారు.వారికి వెంటనే ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. నాగన్న క్యాటరింగ్‌కు ఆర్డర్ చేసిన మున్సిపాలిటీ అధికారులు ఎప్పటిలాగే భోజనాలను తెప్పించారు. అయితే వారు భోజనం చేశాక వాంతులు విరేచనాలు అవుతుండడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా స్థానిక సిపిఎం, సిఐటియు నాయకులురాజు, శ్రీను నాయక్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని కార్మికులను ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి చేర్చినట్టు చెప్పారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్నను వివరణ కోరగా మధ్యాహ్నం కార్మికుల కోసం భోజనాలు తెప్పించామని ఎప్పటిలాగే నాగన్న క్యాటరింగ్ కు సంబంధించి ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఈ భోజనం చేసిన తర్వాత కార్మికులకు కొంత ఆస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ప్రస్తుతం భోజనానికి సంబంధించిన శాంపిల్స్ కూడా సేకరించామని వాటిని ల్యాబ్ కు పంపించడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. భోజనంలో ఏదైనా జరిగిందా లేక పచ్చదనం స్వచ్ఛదనంలో భాగంగా బ్లీచింగ్ పౌడర్ ఎక్కువగా చల్లడం పరిశుద్ధ కార్యక్రమాలు చేపట్టడం వల్ల కొంత పరిశుభ్రత లేకుండా ఏమైనా జరిగిందా, అనే కోణంలో విచారణ చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న తెలిపారు. భోజనం నాసిరకమని తెలిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం రాజు మాట్లాడుతూ…. పట్టణ మున్సిపల్ కార్మికులను నాణ్యమైన వైద్యం అందించే విధంగా కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సరైన వైద్యమందకపోతే ఆందోళన చేస్తామని అన్నారు.