కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానానికి స్వస్తి
హక్కుల సాధనకు ఐక్యపోరాటాలే శరణ్యం
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్
విశాలాంధ్ర – హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కార్మికవర్గం తిరుగుబాటుకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.యూసుఫ్ పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) 105వ వ్యవస్థాపక దినోత్సవాలను పురస్కరించుకొని మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్వర్యంలో వైద్య ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికులు ఎర్రచీరలు… చొక్కాలు ధరించి డప్పుల దరువు, ఆటపాటలతో భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అశేష త్యాగాలతో పునీతమైన ఏఐటీయూసీ అరుణ పతాకాన్ని యూసుఫ్ ఆవిష్కరించగా, తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి ఆవిర్భావ సంబరాలను ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన యూసుఫ్ మాట్లాడుతూ… దేశంలో తొలి కార్మిక సంఘంగా 1920లో ఏఐటీయూసీ ఏర్పడిరదన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి కార్మిక చట్టాలను సాధించుకున్న చరిత్ర ఉందని అన్నారు. ఎంతోమంది విప్లవయోధులు దేశం కోసం, కార్మికవర్గ విముక్తి కోసం తమ ప్రాణాలను త్యజించారన్నారు. వారి నెత్తుటి త్యాగాల ఒరవడిలో కోట్లాది కార్మిక వర్గ గొంతుకగా శ్రమ దోపిడి వ్యవస్థపై ఏఐటీయూసీ నిలబడి కలబడి అనేక చట్టాల రూపకల్పనకు సారథó్యం వహించిందని వివరించారు. మోదీ ప్రభుత్వం … సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికవర్గంపైన వారి సంక్షేమంపైన కలం పోటుతో దాడి చేస్తుందని మండిపడ్డారు. 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్ లుగా విభజించి కార్మికుల హక్కులను సమాధి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచి కార్మికుల జీవితాలతో చెలగాటమాడే విధంగా నిర్ణయాలు తీసుకోవడం దారుణమని అన్నారు. సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వ వైద్య రంగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి వైద్య ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులందరికీ జీరో వన్ జీరో పద్దు కింద వేతనాలు అందించాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానానికి స్వస్తి పలికి వీరందరినీ శాశ్వత ఉద్యోగులను చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగా కనీస వేతనాల జీవోలు సవరణకు నోచుకోలేదని చెప్పారు. మానవత దృక్పథంతో స్పందించి జీవో 21 ని అమలు చేసి కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. జీవో 60 పకడ్భందీగా అమలు చేయాలని, 650 పడకల సామర్థ్యాన్నికి అనుగునంగా శానిటేషన్, పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికుల సంఖ్యను పెంచే విధంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం 456 పడకలకు మాత్రమే అనుమతి ఉన్నదని పేర్కొన్నారు.