Saturday, November 2, 2024
Saturday, November 2, 2024

పాదయాత్ర చేస్తా

. కార్యకర్తల ఆకాంక్ష నెరవేర్చడమే ధ్యేయం
. కాంగ్రెస్‌ పాలన రాష్ట్రానికి శాపం
. తిరోగమనంలో తెలంగాణ
. నెటిజన్ల సంభాషణలో కేటీఆర్‌ వెల్లడి

విశాలాంధ్ర-హైదరాబాద్‌: కార్యకర్తల కోరిక మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. దీపావళిరోజైన గురువారం నెటిజన్లతో జరిగిన సామాజిక మాద్యమం ఎక్స్‌ సంభాషణలో పలువురు ఈ అంశంపై కేటీఆర్‌ అభిప్రాయాన్ని కోరారు. దేశంలో అనేక పార్టీల నేతలు… ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు, పార్టీలను బలోపేతం చేసేందుకు పాదయాత్రలు చేస్తున్నారు… మీరెప్పుడు చేస్తారని అడిగారు. స్పందించిన కేటీఆర్‌… ఖచ్చితంగా తన పాదయాత్ర ఉంటుందని వెల్లడిరచారు. గంటన్నపాటు సాగిన ఈ సంభాషణలో అనేక అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ పాలన ఒక శాపంగా మారిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశాలు ఏమాత్రం లేవన్నారు. పది నెలల కాలంలో కాంగ్రెస్‌ చేసిన ఒక్క మంచి కూడా గుర్తుకు రావడం లేదన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ వేధింపులు ప్రారంభించిందన్నారు. వీటికి భయపడేది లేదని అన్నారు. సన్నవడ్లకు బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ … ఆ హామీ బోగస్‌గా మారిందని కేటీఆర్‌ అన్నారు. మద్ధ్దతు ధర లేక, రైతుబంధు లేక నష్టపోతున్న రైతన్నల తరపున పోరాడతామన్నారు. కాంగ్రెస్‌ పాలన ఫ్రమ్‌ దిల్లీ… టూ దిల్లీ… ఫర్‌ దిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి పూర్తిగా పతనం అయిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయ వనరులు మొదలుకొని అన్ని రంగాలు తిరోగమనంలో ఉన్నాయన్నారు. నిరుద్యోగం పెరిగిందన్నారు. అనేక కంపెనీలు తరలిపోతున్నాయన్నారు. ప్రణాళికలేమిటో తెలియడం లేదన్నారు. జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడం సాధ్యం కాదు అన్నారు. ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించడంపై ప్రధానంగా దృష్టి సారించామని కేటీఆర్‌ అన్నారు. హామీల అమలుపై ప్రజల పక్షాన కొట్లాడతామన్నారు. కాంగ్రెస్‌పై అప్పుడే బలమైన ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆ పార్టీని రాజ్యాంగబద్ధంగా మార్చే అవకాశం ఉన్నదా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా… మరో నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సిందే అన్నారు. సీఎం పూర్తికాలం పదవిలో ఉంటారా లేదా ఓటుకు నోటు వలన బీజేపీలోకి వెళ్తారా అన్న ప్రశ్నకు … రాజకీయాల్లో ఏదైనా జరుగుతుందని, కాంగ్రెస్‌ చరిత్ర చూస్తే ఎలాంటి పరిణామైనా జరగవచ్చు అని బదులిచ్చారు.
తాము అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో ఏనాడు ఇతరుల కుటుంబ సభ్యులను రాజకీయ అంశాల్లోకి లాగలేదన్నారు. రెండు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులను అవహేళన చేసి మాట్లాడినప్పుడు, రాజకీయాలు వదిలేయాలన్నంత భావోద్వేగానికి గురైన విషయాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు. నీచమైన రాజకీయాల కోసం తన కుటుంబాన్ని లాగుతున్న ముఖ్యమంత్రి పైన, ఆయన వందిమాగదుల పైన ప్రజల మద్దతుతో పోరాటం చేస్తాను. రేవంత్‌ అధికారంలోకి వచ్చిన తర్వతా ఈ నీచమైన రాజకీయ సంస్కృతి వేళ్లూనుకుందన్నారు. చెరువుల సంరక్షణ పేరుతో ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ అసలైన అజెండా అవినీతి మాత్రమే. మూసీ బ్యూటిఫికేషన్‌కి తాము వ్యతిరేకం కాదు కానీ లూటిఫికేషన్‌ కి వ్యతిరేకం. ఇది దేశంలోనే అతిపెద్ది అవినీతి స్కాం అవుతుందన్నారు. హైడ్రా కేవలం కొందరిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంది ఇప్పటిదాకా ఒక్క పెద్ద బిల్డర్‌ ని కూడా ముట్టుకోలేదు, కేవలం పేదలు, మధ్యతరగతి ప్రజలను మాత్రమే దోచుకుందన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు మద్ధ్దతుగా వ్యవహరిస్తున్న మీడియాకి ప్రత్యామ్నాయం సోషల్‌ మీడియా మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు కేసీఆర్‌ పేరు నిలిచే ఉంటుందన్నారు. నూతన సంవత్సరం తర్వాత ఆయన నుంచి మరిన్ని కార్యక్రమాలను చూస్తామన్నారు. విధులు మరిచి, చట్ట విరుద్ధంగా తమ కార్యకర్తలు , నాయకులపై రెచ్చిపోతున్న పోలీస్‌ అధికారులను గుర్తుపెట్టుకుంటామన్నారు. ప్రభుత్వ అధినేతలను ప్రసన్నం చేసుకునే పనుల్లో కొంతమంది పోలీసు అధికారులు బిజీగా ఉండడం వలన శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ వంటి మెట్రోపాలిటన్‌ నగరంలో నెల రోజులపాటు 144 సెక్షన్‌ విధించడం షాక్‌కు గురి చేసింది అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌-బీజేపీ కలిసి పని చేస్తున్నాయని అన్నారు. కుమ్మక్కు రాజకీయం చేస్తున్న విషయం త్వరలో ప్రజలందరికీ అర్థమవుతుంది అని పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో… జాతీయ పార్టీలను నమ్మవద్దని … ప్రజలు అక్కడి స్థానిక పార్టీలకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తమిళనాడు విజయ్‌ దళపతి ప్రారంభించిన రాజకీయ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయపరమైన అంశాలపై విభేదాలే తప్ప టీడీపీ, వైసీపీ అగ్ర నాయకులందరితో వ్యక్తిగతంగా అనుబంధం ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ బలం పుంజుకుని తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్‌ అబద్ధపు హామీలు ప్రజల్లో అవాస్తవికమైన ఆశల్ని రేకెత్తించాయని, రెండుసార్లు వరుసగా గెలవడంతో ప్రజా వ్యతిరేకత కూడా తమ ఓటమిపై కొంత ప్రభావం చూపిందన్నారు. పార్టీ మారిన 10 మంది అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం బీజేపీ చేస్తున్న మరొక జుమ్లా అయి ఉంటుందని, అయితే వారు తీసుకువచ్చే చట్టం ఎలాంటిదో చూడాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇది అసాధ్యం అని తెలిపారు. గ్రూప్‌-1 అభ్యర్థులకు తన పూర్తి మద్ధతు ఉంటుందన్నారు. యువతకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలుపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img