Saturday, November 2, 2024
Saturday, November 2, 2024

సమన్వయంతో విజయం తథ్యం

. కూటమి గెలుపు ఖాయం
. ఇంఛార్జిలు… నియోజకవర్గాలు వదిలివెళ్లొద్దు
. ఎన్నికలు పూర్తయ్యే వరకూ జార్ఖండ్‌లోనే మకాం: భట్టి

విశాలాంధ్ర-హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంఛార్జిలు తమతమ నియోజకవర్గాలను వదిలివెళ్లవద్దని జార్ఖండ్‌ ఎన్నికల ఇంఛార్జి, స్టార్‌ క్యాంపెయినర్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలో శుక్రవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, పీసీసీ నేతలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జిల సమావేశం ఏర్పాటు చేశారు. భట్టి మాట్లాడుతూ… జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్‌ పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే … రామ్‌గడ్‌, బొకోరో అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు తీసుకున్నట్టు తెలిపారు. తాను జార్ఖండ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నేతలు, 90 శాతం సీనియర్లతో సంప్రదింపులు జరిపినట్టు చెప్పారు. వీరితోపాటు అభ్యర్థులు, కాంగ్రెస్‌ కమిటీ జిల్లా అధ్యక్షులు, బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీ నేతలతోనూ సమావేశమైనట్టు వెల్లడిరచారు. రామ్‌ గడ్‌, బొకోరో స్థానాలు గెలిచి తీరుతామని పార్టీశ్రేణులు గొప్ప ఉత్సాహంలో ఉన్నారని వివరించారు. కాంగ్రెస్‌ కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, సోషల్‌ మీడియాను మరింత విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని సూచించారు. సమన్వయంతో ఆయా నియోజకవర్గాల్లోనే మకాం వేయాలని తెలిపారు. తాను పరిశీలకులుగా స్థానిక నేతలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, మా బాధ్యతగా ఏ కార్యక్రమం నిర్వహించాలంటే ఆ కార్యక్రమం చేపట్టేందుకు సర్వదా సిద్ధంగా ఉన్నామని భట్టి భరోసా ఇచ్చారు. దేశంలో తిరిగి కాంగ్రెస్‌ ను అధికారంలోకి తెచ్చేందుకు ఏఐసీసీ సెక్రటరీ జనరల్‌ కేసీ వేణుగోపాల్‌ విస్తృతంగా పర్యటిస్తున్నారన్నారు. కేరళ నుంచి శ్రీనగర్‌ వరకు మొక్కవోని దీక్షతో పర్యటిస్తున్నారని, దీపావళి పండుగరోజు తెలంగాణలో సమావేశం నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ కూటమి గెలిస్తే మనమంతా గెలిచినట్టేనని, ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌ కాంగ్రెస్‌తో పాటు ఇతర అనుబంధ విభాగాలను తక్షణమే సమావేశపరచి ఎన్నికల్లో నిమగ్నం అయ్యేలా కార్యాచరణ చేపట్టాలని కోరారు.
కాంగ్రెస్‌ వార్‌ రూం నుంచి సమాచారం అందగానే నియోజకవర్గాల్లో అమలు చేస్తే కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థుల గెలుపు సునాయాసం అవుతుందన్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు తాను జార్ఖండ్‌లోనే మకాం వేస్తానని చెప్పారు. తొలుత జార్ఖండ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌, పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. హాజరైన నేతలు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img