Tuesday, October 29, 2024
Tuesday, October 29, 2024

సమసమాజ స్థాపనే ధ్యేయం

. బీసీల ఉద్యమాలకు కమ్యూనిస్టుల సంపూర్ణ మద్దతు
. ‘జనగణనలో కులగణన’ రాష్ట్ర సదస్సులో కూనంనేని

విశాలాంధ్ర-హైదరాబాద్‌: సమసమాజ స్థాపనే లక్ష్యంగా మొట్టమొదటి నుంచి ఉద్యమిస్తున్నది కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టు పార్టీ జరిపిన వర్గపోరాటాల చైతన్యమే నేటి కుల చైతన్యానికి స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు అధ్యక్షతన సోమవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ‘జనగణనలో కులగణన’ అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కూనంనేని మాట్లాడుతూ… సమాజంలో అన్ని రంగాలు, వర్గాలకు సమ న్యాయం జరగాలన్నదే కమ్యూనిస్టుల లక్ష్యమని తెలిపారు. న్యాయం కోసం బీసీలు చేస్తున్న ఉద్యమాలకు కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మద్ధ్దతు ఇస్తోందన్నారు. ప్రపంచ స్వరూపాన్ని మార్చేది ఎర్రజెండానే అన్నారు. అధికారం లేకపోయినా ప్రజల పార్టీ కాబట్టే 100 ఏళ్లు వర్థిల్లిందన్నారు. బీజేపీ కులాల వారీగా రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూనే మతాన్ని, దేవుళ్లను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం వల్లనే అధికారంలోకి వచ్చిందన్నారు. కులం కోర్రలు పికాలంటే ఆదివాసీ, గిరిజన, దళిత, బీసీ వర్గాలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం జరగాలన్నారు.
కులం… సామాజిక వాస్తవం: ప్రొఫెసర్‌ ప్రంభజన్‌ యాదవ్‌
ప్రొఫెసర్‌ ప్రభంజన్‌ యాదవ్‌ మాట్లాడుతూ… భారత దేశంలో కులం అనేది సామాజిక వాస్తవం, మనకు ఇష్టమున్నా లేకపోయినా ఏదో ఒక కులంలో పుట్టాల్సిందేనన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ మన దేశంలో సుమారు నాలుగు వేల సంవత్సరాల నుంచి పాతుకుపోయిందని తెలిపారు. 89 శాతంగా ఉన్న దళిత, బలహీన వర్గాలను బ్రాహ్మణీయ సమాజం అణిచివేయడంతో వెనుకబాటు తనానికి కారణమన్నారు. బీసీలకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్న తరుణంలో దాని సాధనకు సంఘటితంగా ఉద్యమించాల్సిదేనన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేష్‌ మాట్లాడుతూ బీసీ హక్కుల కోసం ఉద్యమిస్తూనే మరోవైపు అణగారిన వర్గాలకు జరుగుతున్న దాడులను నిలువరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా సాధన సమితి అధ్వర్యంలో చైతన్యజాతను చేపట్టనున్నామన్నారు. తాటిపాములు వెంకట్రాములు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా బీసీ కుల సంఘాలు భుజం భుజం కలిపి కలిసిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 77 ఏళ్ల స్వాతంత్య్ర భారతావనిలో ఆదివాసీ, గిరిజన, దళిత, బీసీ వర్గాలకు నేటికి రిజర్వేషన్ల కోసం అడుక్కునే పరిస్థితి ఉండడం దారుణమని గిరిజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కె.కాంతయ్య మాట్లాడుతూ బ్రాహ్మణీయ అధిపత్యం బద్దలు కొట్టాలంటే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు సాధించుకోవాల్సిం దేనని పిలుపునిచ్చారు. జి. సాయిల్‌ గౌడ్‌ (గీత పనివారుల సంఘం), బొడ్డుపల్లి కృష్ణ (రజక సంఘం), డి.టి.నర్సయ్య (మత్స కార్మిక), ధనంజయ నాయక్‌, తాటి వెంకటేశ్వరరావు, పి.యాదయ్య, మెరుగు కుమార్‌, కె.ప్రమిల, శ్రావణ్‌ కుమార్‌, ఎన్‌.రాజమౌళి, సీహెచ్‌ దశరథ్‌, ఉమా మహేశ్‌, జె.లక్ష్మి, కొలా జనార్దన్‌, చీమల శంకర్‌ హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img