న్యూదిల్లీ: సుప్రీంకోర్టు చర్రితలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఇకపై సుప్రీంలో జరిగే అన్ని కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రూపొందించిన యాప్ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. లోటుపాట్లు సవరించి త్వరలో అమలులోకి తీసుకురానున్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. యూట్యూబ్ వేదికగా వాటిని ప్రసారం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో తొలి విచారణ ‘సేన వర్సెస్ సేన’ కేసుపై జరిగింది. మహారాష్ట్ర శివసేన పార్టీలో షిండే వర్గం తిరుగుబాటు, ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవ డం వంటి పరిణామాలపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అసలైన శివసేన తమదేనంటూ ఠాక్రే, షిండే వర్గాల మధ్య పోరు నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. కేసుల విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అనుకూలంగా సుప్రీం కోర్టు 2018లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ… ఆచరణలోకి రాలేదు. అయితే, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ రోజు… ఆయన నేతృత్వంలోని ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం అదే తొలిసారి. ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనం విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఈ చారిత్రక నిర్ణయంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 వంటి కీలక కేసులకు సంబంధించిన విచారణలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా వీక్షించారు.