Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఇజ్రాయిల్‌ దుస్సాహసం

తెహ్రాన్‌: పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికా సహా ప్రపంచ దేశాలు సంయమనం పాటించాలన్న విజ్ఞప్తులను పెడచెవిన పెట్టిన ఇజ్రాయిల్‌… ఇరాన్‌పై ప్రతీకారదాడులకు దిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై క్షిపణి దాడులు చేసింది. ఫలితంగా వివిధ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇవి ఇజ్రాయిల్‌ ప్రతీకార దాడులేనని… అమెరికా చెబుతోంది. అయితే వీటిని ధ్రువీకరించేందుకు మాత్రం ఇజ్రాయిల్‌ నిరాకరించింది.
మరోవైపు తమ గగనతలంలోకి చొచ్చుకొచ్చిన కొన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. వారంరోజుల క్రితం ఇరాన్‌ జరిపిన దాడులకు బదులు తప్పదన్న ఇజ్రాయిల్‌ అన్నంత పనీ చేసింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై క్షిపణులతో విరుచుకుపడిరది. ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెద్దఎత్తున పేలుడు శబ్దాలు వినిపించినట్లు వార్తలు వెలువడిన కాసేపటికే అమెరికా అధికారి ఒకరు ఇజ్రాయిల్‌ దాడులను ధ్రువీకరించారు. తమదేశంపై పరిమిత స్థాయిలో దాడికి దిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్‌ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించిన మరుసటిరోజే ఇజ్రాయిల్‌ దాడులు చేసింది. ఇరాన్‌ అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్‌ నగరంలో ఈ ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ముందుజాగ్రత్తగా తమ గగనతలాన్ని మూసివేసిన ఇరాన్‌ వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులు రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. అధికారులు వెంటనే గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేశారు. తెల్లవారుజామున 4.30గంటల నుంచే దుబాయ్‌ కేంద్రంగా నడిచే ఎమిరేట్స్‌, ఫ్లైదుబాయ్‌ విమానాలు పశ్చిమ ఇరాన్‌ నుంచి దారి మళ్లాయి. ఇరాన్‌ గగనతలం మూసివేసినట్లు సమాచారం అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అణుకేంద్రం భద్రం
ఇజ్రాయిల్‌ దాడులు చేసిన సమయంలో తెహ్రాన్‌, పశ్చిమ, సెంట్రల్‌ రీజియన్‌ ప్రాంతాల్లో వాణిజ్య విమానాలు నిలిపివేశారు. లౌడ్‌ స్పీకర్ల ద్వారా ఈ మేరకు ప్రయాణికులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్న అధికారవర్గాలు ఆ తర్వాత విమాన సేవలను పునరుద్ధరించినట్లు తెలిపాయి. కాగా ఇస్ఫాహాన్‌ నగరంలో ఇరాన్‌ ప్రధాన వైమానిక స్థావరం ఉంది. అణు కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. వీటినే ఇజ్రాయిల్‌ లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని ఇరాన్‌ ప్రభుత్వాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. కాగా తాము వివిధ క్వాడ్‌కాప్టర్‌ డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్‌ సివిలియన్‌ స్పేస్‌ ప్రోగ్రాం ప్రతినిధి హుస్సేన్‌ దాలిరియన్‌ తెలిపారు. అయితే ఈ ఘటన ఇస్ఫాహన్‌ ప్రాంతంలోనా, లేదా మరొక చోట జరిగిందా అనే దానిపై స్పష్టత లేదు. అయితే ఇరాన్‌ ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా గగనతలాన్ని మూసివేసింది. వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులను రద్దు చేసింది. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఇక ఇస్ఫాహాన్‌లో ఉన్న అణు కేంద్రంపై ఎలాంటి దాడి జరగలేదని, అది సురక్షితంగా ఉందని ఇరాన్‌ మీడియా వెల్లడిరచింది. ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో ఇరాన్‌ అణు కేంద్రాలకు ఎలాంటి నష్టం జరగలేదని ఐరాస న్యూక్లియర్‌ వాచ్‌డాగ్‌, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) కూడా ధ్రువీకరించింది.
ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం: ఇజ్రాయిల్‌
ఇరాన్‌లో పేలుళ్లు ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులేనని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. కానీ, దీనిపై స్పందించేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం నిరాకరించింది. ‘ప్రస్తుతానికి మేం ఏం మాట్లాడలేం’ అని పేర్కొనడం గమనార్హం. మరోవైపు, ఈ దాడులకు కొన్ని గంటల ముందే ఇజ్రాయిల్‌, అమెరికా రక్షణ మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్నట్లు పెంటగాన్‌ వెల్లడిరచింది. అయితే, అందులో ఈ దాడి ప్రణాళికల గురించి ఇజ్రాయెల్‌ ప్రస్తావించలేదని తెలిపింది. కానీ, రానున్న 24-48 గంటల మధ్యలో ఇరాన్‌పై దాడి చేస్తామని మాత్రం సూచనప్రాయంగా అగ్రరాజ్యానికి చెప్పినట్లు సమాచారం.
ఇజ్రాయిల్‌ను వీడండి: ఆస్ట్రేలియా సూచన
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న క్రమంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇజ్రాయిల్‌లోని ఆస్ట్రేలియన్లు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని హెచ్చరించింది. ఈ దాడులతో గగనతలాన్ని మూసివేసే అవకాశముందని పేర్కొంది.
ఇరాన్‌-ఇజ్రాయిల్‌ మధ్య ఘర్షణలకు కారణమిదే!
సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన గగనతల దాడిలో రివల్యూషనరీ గార్డ్స్‌ దళానికి చెందిన ఏడుగురు సైనికాధికారులు మృతి చెందారు. అవి ఇజ్రాయిల్‌ దాడులుగా భావించిన ఇరాన్‌… గత శనివారం 170డ్రోన్లు, 30కి పైగా క్రూజ్‌, 120కి పైగా బాలిస్టిక్‌ క్షిపణులతో ఇజ్రాయిల్‌పై ప్రతీకారదాడులు చేపట్టింది. ‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌’ పేరుతో డ్రోన్లను ప్రయోగించింది. ఆ తర్వాత సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయిల్‌ ఇరాక్‌ గగనతలం మీదుగా వస్తున్న డ్రోన్లను బహుళ అంచెల రక్షణ వ్యవస్థతో కూల్చివేసింది. క్రూజ్‌ క్షిపణులనూ విజయవంతంగా అడ్డుకుంది. కాగా ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌లో ఇరాన్‌తోపాటు లెబనాన్‌, సిరియా, ఇరాక్‌లోని మిలిటెంట్‌ సంస్థలూ పాల్గొన్నాయి. ఇజ్రాయిల్‌పై డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపించగా వాటిని అమెరికా సహకారంతో ఇజ్రాయిల్‌ దళాలు అడ్డుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img