Friday, May 3, 2024
Friday, May 3, 2024

రగులుతున్న అసమ్మతి సెగలు..!

అధికార పార్టీకి తలనొప్పిగా మారిన ఆచంట వ్యవహారం

విశాలాంధ్ర – పెనుమంట్ర (పశ్చిమగోదావరి): ఆసక్తికరమైన రాజకీయాలకు వేదికైన ఆచంట నియోజవర్గంలోని అధికార పార్టీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామ వేదికగా ప్రారంభమైన ఈ రగడ చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. ఇటు అసమ్మతి వర్గం, అటు ఎమ్మెల్యే వర్గీయులు మీడియా ముందుకు కొచ్చి వారి వ్యతిరేక సానకూల అభిప్రాయాలను పంచుకోవడంతో స్థానిక అధికార పార్టీలో అసలు ఏం జరుగుతుంది…. ఏం జరగబోతుంది అనే ఆసక్తి ఆయా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కొద్దికాలంగా కొందరు పార్టీ శ్రేణుల్లో గూడు కట్టుకున్న ఉన్న అసంతృప్తిని సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీనియర్ నాయకులు కడలి రామ నాగ గోవిందరాజు, వైట్ల కిషోర్ నేతృత్వంలో బహిరంగంగానే బయటపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు రానున్న ఎన్నికల్లో స్థానికంగా సీటు ఇవ్వద్దు అంటూనే… ఆయన కాకుండా మరే కులానికి చెందిన వారి కైనా టిక్కెట్టు ఇచ్చిన తామంతా పార్టీ కోసం కష్టపడి పని చేస్తామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అసమ్మతి వర్గానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే వర్గీయులు సమావేశమై రంగనాథరాజు మాకొద్దు అంటున్న వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే రంగనాథరాజు కే వినత పత్రం అందజేయడంతో అసమతి వర్గం మరొకసారి తమ దూకుడు పెంచింది. ఎక్కడ తాము అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకు తినలేదని, పార్టీకి కట్టుబడి 14 సంవత్సరాలుగా కష్టపడి పని చేశామని కేవలం తాము రంగనాథరాజు అభ్యర్థత్వాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు అసమ్మతి వర్గం మీడియా సమావేశం వేదికగా స్పష్టం చేసింది. ఎస్సీ, బీసీలను కనీసం మనుషులుగా చూడని ఎమ్మెల్యే తీరుపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు వారు వెల్లడించారు. ఈ వ్యవహారం పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. కొద్ది రోజుల్లో ఎన్నికలకు వెళుతున్న తరుణంలో ఇటువంటివి పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నట్లుగా కొందరు అంచనా వేస్తున్నారు. రంగనాథరాజుకు సీటు ఇస్తే మాత్రం తాము భవిష్యత్తు ఆలోచన చేస్తామని అసమ్మతి వర్గ ప్రకటించడం సైతం, పార్టీ అధిష్టానం సైతం క్షేత్రస్థాయిలో కాస్త లోతుగా పరిశీలన ప్రారంభించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా గతంలో జరిగిన, జరుగుతున్న విషయాలపై పార్టీ పరిశీలికులతో పాటు నిఘా వర్గాల నుంచి సమాచారం రాబట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీలో బయటపడిన ఈ అసమ్మతి సెగ పరిణామాలు వీడియో, సామాజిక మాధ్యమాలలో విస్తృత ప్రచారానికి వేదికగా మారాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img