Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కోవిడ్‌ వార్డులో మంటలు – 11 మంది మృతి

మహారాష్ట్ర ప్రభుత్వాస్పత్రిలో దుర్ఘటన
విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌గా ప్రాథమిక నిర్ధారణ
బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

అహ్మద్‌నగర్‌ : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఒక ప్రభుత్వాస్పత్రి ఐసీయూ(ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)లో మంటలు చెలరేగి 11 మంది రోగులు మృతి చెందారు. ఆస్పత్రికి చెందిన కోవిడ్‌`19 వార్డులో 20 మంది రోగులు చికిత్స పొందుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ వార్డులో అనేక మంది వృద్ధులు, వెంటిలేటర్‌ లేదా ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్న వారు ఉన్నారు. కాగా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మంటలను ఆర్పివేశామని, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని అనుమానిస్తున్నప్పటికీ, అది ఇంకా నిర్ధారించలేదని నగర అగ్నిమాపక విభాగం ప్రధానాధికారి శంకర్‌ మిసాల్‌ తెలిపారు. అహ్మద్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ రాజేంద్ర భోంస్లే వివరాల ప్రకారం, ఈ ఆస్పత్రిలో కూడా ఫైర్‌ ఆడిట్‌ జరిగినప్పటికీ, మిసాల్‌ చెబుతున్నట్లు ఆడిట్‌ తర్వాత, అవసరమైన భద్రతా వ్యవస్థలను వ్యవస్థాపించే పని ‘నిధుల కొరత’ కారణంగా అసంపూర్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన అనేక మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 10 మంది రోగులు చనిపోయారని పోలీసులు పేర్కొనగా, తర్వాత మరొక రోగి మరణించాడు. ‘ఐసీయూలో 15 మంది రోగులు వెంటిలేటర్‌ లేదా ఆక్సిజన్‌పై ఉన్నారు. వారిని రక్షించడం ప్రధానం. కానీ వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆక్సిజన్‌ సపోర్టును తొలగించి బయటకు తీసుకురావడం చాలా కఠినమైన నిర్ణయమని అగ్నిమాపక దళ అధికారి ఒకరు తెలిపారు. ‘చర్చల తర్వాత, మేము వారిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని నిర్ణయిం చుకున్నాం. తరువాత ఆ రోగులను ఆక్సిజన్‌ లేదా ఇతర సహా యక వ్యవస్థలపై తిరిగి ఉంచాము’ అని ఆయన వివరించారు. మృతుల్లో 65 నుంచి 83 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు అధికంగా ఉన్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా, ఈ దుర్ఘట నకు దారితీసిన కారణాలను మిసాల్‌ నేతృత్వంలోని విచారణ కమిటీ పరిశీలిస్తుందని కలెక్టర్‌ తెలిపారు. ఇటీవలి ఫైర్‌ ఆడిట్‌ తరువాత, ఆస్పత్రికి తీసుకోవల సిన చర్యల గురించి చెప్పడం జరిగిందని, పైప్‌లైన్‌, స్ప్రింక్లర్‌ సిస్టమ్‌తో సహా సమర్థవంతమైన అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరినట్లు మిసాల్‌ వివరించారు. కానీ నిధులు లేకపోవడంతో పనులు అసంపూర్తిగా ఉన్నాయని భావించి ఆసుపత్రిలో అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే విచారం వ్యక్తం చేశారు. జిల్లా సంరక్షక శాఖ మంత్రి హసన్‌ ముష్రిఫ్‌, ప్రధాన కార్యదర్శి సీతారాం కుంటేతో మాట్లాడి ఆస్పత్రిలో చేరిన ఇతర రోగులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరైన వైద్యం అందేలా చూడాలని, ప్రమాద ఘటనపై లోతైన దర్యాప్తు జరపాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారని సీఎంవో ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. కాగా ఆస్పత్రి దిగువ అంతస్తుల నుండి పొగలు కమ్ముకున్న దృశ్యాలు, మసితో కూడిన గోడలు, విరిగిన సీలింగ్‌ ప్యానెల్‌లు, మంటలను ఆర్పివేసిన తర్వాత మరికొందరు నెమ్మదిగా వార్డులోకి తిరిగి వస్తున్న దృశ్యాలు కనిపించాయి. అలాగే మంటల్లో చిక్కుకున్న వారిలో కొందరిని బతికించడానికి వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తుండటం, మరికొంతమంది రోగులను ఆస్పత్రి వెలుపలికి తరలిస్తున్న హృదయ విదారకర దృశ్యాలు మరికొన్ని వీడియోల్లో కనిపించాయి.
ఈ అగ్ని ప్రమాద ఘటనపై అధికారిక విచారణ జరుగుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ మాట్లాడుతూ, కరోనా వైరస్‌ రోగులకు త్వరిగతిన చికిత్స అందించేందుకు ఈ ఐసీయూను కొత్తగా నిర్మాణం చేశారని, అగ్ని ప్రమాదం సంభవించడం చాలా తీవ్రమైన విషయమని అన్నారు. అన్ని ఆస్పత్రులకు ‘ఫైర్‌ ఆడిట్‌’ చేపట్టాలని కోరామని, దీనికి సంబంధించి అహ్మద్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి నివేదికను తనిఖీ చేస్తామని, సమగ్ర విచారణ జరుపు తామని మాలిక్‌ తెలిపారు. మరణించిన వారి కుటుం బాలకు ముఖ్యమంత్రి ఠాక్రే తన సంతాపాన్ని తెలియజేశారని, వారికి సాధ్యమైన ప్రతి సహాయానికి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. ఇదిలాఉండగా, బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్‌ ట్వీట్‌ చేశారు. ‘అహ్మద్‌నగర్‌ నుండి చాలా దిగ్భ్రాంతి, కలవరపరిచే వార్తలు అందాయి. వారి ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.. గాయపడిన వారు త్వరగా కోలుకోవా లని ప్రార్థిస్తున్నాను. లోతైన విచారణ జరిపి బాధ్యు లందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అహ్మద్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్‌సీపీ నాయకుడు సంగ్రామ్‌ జగ్తాప్‌ కూడా విచారం వ్యక్తం చేశారు. ‘ఈరోజు అహ్మద్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కచ్చితంగా విచారణ జరుగుతుంది’ అని ఆయన విలేకరులతో అన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో మహారాష్ట్రకు చెందిన పాల్ఘార్‌ జిల్లాలోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌కు చెందిన ఐసీయూలో మంటలు చెలరేగి 15 మంది కోవిడ్‌ రోగులు మరణించారు. అలాగే మార్చి నెలలో ముంబైకు చెందిన బందుప్‌లోని డ్రీమ్స్‌ మాల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్‌ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించి తొమ్మిది మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు.
అహ్మద్‌నగర్‌ ఘటన విచారకరం : ప్రధాని మోదీ
న్యూదిల్లీ : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి ప్రాణ నష్టం జరగడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశారు.
ప్రాణనష్టం బాధాకరం : రాహుల్‌ గాంధీ
అహ్మద్‌నగర్‌లోని ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించిన తరువాత ప్రాణనష్టం జరగడం బాధాకరమని, సహాయక చర్యలకు సహకరించాలని పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ శనివారం కోరారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ, ‘అహ్మద్‌నగర్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాద వార్త బాధాకరం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. సహాయక చర్యల్లో పాల్గొనవలసిందిగా కాంగ్రెస్‌ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img