Friday, May 3, 2024
Friday, May 3, 2024

తొమ్మిదో రోజు నిరసనల హోరు

సాగని ఉభయ సభలు ` సోమవారానికి వాయిదా

న్యూదిల్లీ : పెగాసస్‌, సాగు చట్టాలు సహా అనేక అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు, నినాదాలతో పార్లమెంటు వరుసగా తొమ్మిదో రోజు దద్దరిల్లిపోయింది. ప్రజాసమస్యలపై చర్చకు విపక్షాల పట్టు.. తాము అనుకున్నట్లుగా సభ నిర్వహించాలన్న అధికార పక్షం మొండితనంతో ఎగువ, దిగువ సభలు రసాభాస అయ్యాయి. వాయిదాల కొనసాగింపుతో సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ప్రతిపక్ష ఎంపీల నిరసనల మధ్య మధ్యాహ్నం వరకు సాగిన లోక్‌సభ ఆపై వాయిదా పడి తర్వాత ప్రారంభం అయిన కొద్ది సేపటికే సోమవారానికి వాయిదా పడిరది. సభలో విపక్ష నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, మాకు న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. దాంతో స్పీకర్‌ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. 315 మందికిపైగా సభ్యులు ప్రశ్నోత్తరాల సమయం కోరుకుంటుంటే ప్రతిపక్షాల ప్రవర్తన దురదృష్టకరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. పెగాసస్‌పై ఐటీ మంత్రి ఉభయ సభల్లో వివరణ ఇచ్చారని, అదసలు పెద్ద సమస్యే కాదని, కార్యకలాపాలను సజావుగా సాగనిద్దామన్నారు.
ప్రతిపక్షాల నిరసనల మధ్య బీమా బిల్లు
జనరల్‌ ఇన్సూరెన్స్‌ చట్టాన్ని సవరించి బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆమోదించాలని కోరారు. దీని వల్ల ప్రైవేటీకరణ జరగబోదని అన్నారు. సాధారణ బీమా వాణిజ్యం (జాతీయీకరణ) సవరణ బిల్లు 2021ను ఆమోదించడం వల్ల భారతీయ విపణుల నుంచి కావాల్సిన వనరుల ఉత్పత్తికి దోహదం అవుతుందని తద్వారా ప్రభుత్వ రంగ జనరల్‌ బీమాదారులు విన్నూత్న ఉత్పత్తులను రూపొందించేందుకు అవకాశం కలుగుతుందని సీతారామన్‌ అన్నారు. ఈ బిల్లును ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. దీని వల్ల పీఎస్‌యూ జనరల్‌ బీమా కంపెనీలన్నీ ప్రైవేటు పరం అవుతాయని, విదేశీ పెట్టుబడిదారులకు ద్వారాలు

తెరుచుకుంటాయని అభ్యంతరం తెలిపారు. ప్రతిపక్షాల వాదనను సీతారామన్‌ కొట్టిపారేశారు. వనరులు లేక ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు రాణించలేక పోతున్నాయని గుర్తించాలని అన్నారు. దేశ రాజధాని ప్రాంతం,దాని చుట్టుప క్కల వాయు నాణ్యత నిర్వహణ కమిషన్‌ బిల్లునూ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ఇది సభా లేక సంతా… : వెంకయ్య అసహనం
రాజ్యసభలో విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో చైర్మన్‌ వెంకయ్య నాయుడు సభను తొలుత మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సభ్యుల తీరు చట్టసభల ప్రతిష్టను దిగజారుస్తోందని వ్యాఖ్యానించారు. ‘కొందరు ప్లకార్డులు ప్రదర్శిస్తుంటే మరికొందరు ఈలలు వేస్తున్నారు. ఇంకొందరు మార్షల్స్‌ భుజాలపై చేతులు వేస్తున్నారు.. ఇదంతా వారు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదుగానీ సభా మర్యాదను మంటగలుపుతున్నారు. ఇది చట్టసభ లేక సంతా అంటూ అసహనం వ్యక్తం చేసిన వెంకయ్య నాయుడు.. ఎంపీలపై చర్చలు తప్పేట్లు లేదన్నారు. సభికులు నిరసనలు తెలుపువచ్చు, సభను బహిష్కరించనూ వచ్చుగానీ ఈ స్థాయికి దిగజారుతారని ఎన్నడూ ఊహించలేదు. సభను అసలు సాగన్విడమే లేదు. ఇది గతంలోనూ జరిగిందని కొందరు అంటున్నారుగానీ నా హయాంలో ఇలాంటివి సాగవు. ప్రశ్నోత్తరాలప్పుడు, జిరో అవర్‌లో మంత్రులు అనేక అంశాలను లేవనెత్తవచ్చుగానీ ఆ సమయాల్లో పేర్లు పిలిస్తే స్పందనే కరవు అవుతోంది.. ఇందుకు కారణం సంబంధిత మంత్రులు ఆందోళనల్లో ఉండటమే’ అని వెంకయ్య అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే మంత్రుల పేర్లను రాజ్యసభ బులెటిన్‌లో పేర్కొనాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img