Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దమ్ము దగ్గరే దుమ్ము

ఆకాశాన్ని తాకిన సాగు ఖర్చులు
వరి నాటు పై అన్నదాత సంశయం

విశాలాంధ్ర – అర్ధవీడు : మండలంలోని బొల్లుపల్లి, పాపినేనిపల్లి పంచాయతీల వరి రైతులకు పెద్ద చిక్కొచ్చి పడింది. వీరికి ఉన్న సుమారు 250 ఎకరాల మాగాణికీ నీటి వనరుగా మూడు చెరువులు వున్నాయి. నిండు కుండల్లా అవి నీటితో తొణుకుతున్నాయి. అలుగులు సెలయేటిని తలపిస్తున్నాయి. ఈ పాటికే పోసిన వరి నారు నాటుకు సిద్ధమైంది. దమ్ము చేసేందుకు ఇక్కడివే కాక పక్క ఊళ్ళ నుండీ ట్రాక్టర్లు వచ్చి చేరాయి. ఆదునూ అక్కున చేర్చుకుంటానంటోంది. రైతు మాత్రం చిక్కు ప్రశ్నల్లో చిక్కుకున్నాడు. నాటాలా .. వద్దా ? నాటితే పెట్టుబడి బరాయించగలమా? నాటకపోతే .. బియ్యం కొనుక్కుంటే సరిపోదా ? ఒకవేళ ఈపాటికే నాటిన, నాటబోతున్న మిర్చి, మొక్క జొన్న గత ఏడాదిలా ఆశించిన ఫలితం ఇవ్వక పోతే …కాలం గడిసేదెట్టా? వంటి సంశయ ప్రశ్నలతో రైతులు తలలు పట్టుకుని లెక్కలు కడుతున్నారు. మాగాణి దమ్ము చేయడానికి ట్రాక్టర్ యజమానులు గంటకు రూ .1600 నుండి 1800, ఎకరం లెక్కన రూ 3500 లు డిమాండ్ చేస్తున్నారు. ఆకాశమే హద్దుగా డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యం లో తాము ఏమి చేయగలమని యజమానులు చెబుతున్నారు. ఈ లెక్కన దమ్ము చేసే దగ్గరే దుమ్మై పోతం కదా అని రైతుల వేదన పడుతున్నారు. కష్టమో , నష్టమో ..ముందుకెళితే నాటు ఖర్చు రూ .10 నుండి 12 వేలకు తాకుతోంది. ఈ దశను దాటినా ఎరువులు , పురుగు మందుల ధరలు ఉరిమి చూస్తున్నాయి. డిఎపి కట్ట రూ 1900 పలుకుతోంది. యూరియా రూ .350( బ్లాక్ రేటు) , కాంప్లెక్స్ ఎరువులైన 28-28-0, 14-35-14, బస్తా ధర రూ . 1700 , ఈ ప్రాంతంలో అధికంగా వాడే 20-20-0-13 ఎరువు రూ 1400 , పోటాష్ రూ 1000 లు పలుకుతున్నాయి. ఇవన్నీ గతంతో పోలిస్తే 50 శాతం పెరిగాయి. వీటికి తోడు పురుగు, తెగుళ్ల మందులు వుండనే వున్నాయి. వీటిని మోతాదులో వాడితే తెగులు పోదు, పురుగు చావదు. మోతాదుకు మించి వాడితే దిగుబడి రాదు. సాగు చేస్తే చెడిపోతాం. చేయకపోతే కడుపు కాల్చుకుంటాం ..ఎలా ? అనే మీమాంసతో రైతులు తలలు పట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img