Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఒక పదం పుట్టాలేగానీ…

ఒక పదం పుట్టాలేగానీ కడుపులోంచి
దాన్ని పట్టుకుని ఇక అల్లుతుంది
లోపలి జిజ్ఞాస సాలెగూడులా…
పదాల శృంఖలాలను
వాక్యాల తీగలను
లాగీ లాగీ అటూ ఇటూ
అందమైన చేనేతవస్త్రంలా
ఇంకా సౌష్టవం అమరిక
సొంపున్న నిర్మితిని…
పిట్టలు కూడా పొద్దస్తమానం
గడ్డిపోచనో కర్రపుల్లనో
ముక్కున కరుచుకుపోయి
తుర్రుమంటూ ఎక్కడో నిర్మిస్తాయి
అబ్బురపరిచే ప్రపంచాన్ని!
మెల్లగా అంచెలంచెలుగా
పరిణామం అద్భుత ఆవిష్కరణలు
మననుంచే మనలోంచే
ప్రకృతినుంచే పదార్థంలోంచే
బుద్బుద ప్రేరణలోంచే…
దాన్ని చూసి ఏదో ఆకృతి
ఇవ్వాలని తపన దేనికో
ఉపయోగానికి తేవాలని
యాతన ఎందుకో…
అర్థం ఆపాదించేవరకూ
అంతరార్థం శోధించేవరకూ
పని పరిపూర్ణమయ్యేవరకు
కొనసాగుతూనే నిరంతరం…
దీన్నుంచి భవిష్యత్తరాలు
ఇంకా వేరే నిర్మితుల్లోకి
అడుగులేస్తూ ఆవిష్కరిస్తూ
మున్ముందుకు…
వాళ్ళూ ఆపాదిస్తూ
కొత్త వ్యాఖ్యలు చేస్తూ
కొత్త అర్థాలు వెతుకుతూ
సమన్వయంసంతులనం చేకూరుస్తూ
కోల్పోతూ అప్పుడప్పుడు…
సమానమైన ఊపిరిని అందరికీ
ఆ అందరూ కలసి-
ఓ వినూత్న ఉషోదయాన్ని తిలకిస్తూ
లేలేత ప్రభాత గీతం!!

  • రఘు వగ్గు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img