Homeసినిమాడీప్‌ఫేక్‌ కంటెంట్‌పై మంచు విష్ణు సీరియస్‌.. ఖాతాలపై  'మా' నిఘా!

డీప్‌ఫేక్‌ కంటెంట్‌పై మంచు విష్ణు సీరియస్‌.. ఖాతాలపై  ‘మా’ నిఘా!

- Advertisement -

ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన డీప్‌ఫేక్‌ ఘటనపై మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వ్యవహారాన్ని కేవలం ఒక ఘటనగా చూడకూడదని.. భవిష్యత్తులో ఎదురుకాబోయే ప్రమాదాలకు ఇది ఒక హెచ్చరికగా భావించాలని అన్నారు.సినిమాల విడుదలకు ముందు ఉద్దేశపూర్వకంగా నెగెటివ్‌ ప్రచారం చేసే వారి గురించి కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.డీప్‌ఫేక్‌ వీడియోలపై రామ్‌ పోతినేని చేసిన వ్యాఖ్యలను విష్ణు ప్రస్తావించారు. ఆన్‌లైన్‌ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న రామ్‌ సూచనపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఎప్పటికీ గౌరవించాల్సిందేనని.. అయితే అదే స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని అజ్ఞాతంగా ఉంటూ ఇతరులను వేధించడానికి ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు.

సమస్య పూర్తిగా పరిష్కారం కాదు
ఒక వీడియోను తొలగించడం లేదా ఫిర్యాదు చేయడం ద్వారా డీప్‌ఫేక్‌ సమస్య పూర్తిగా పరిష్కారం కాదని విష్ణు పేర్కొన్నారు.తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌తో పాటు చిత్ర పరిశ్రమలోని అన్ని వర్గాలు కలిసి ఏఐ డీప్‌ఫేక్‌లు, ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్‌లో సినిమాలను దెబ్బతీసే ప్రయత్నాలను ఎదుర్కోవాలని ఆయన కోరారు.ఇందుకోసం శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సినిమాలపై ముందుగానే నెగెటివ్‌ ప్రచారం
ఃకొంతకాలంగా సినిమాలు, నటులు, దర్శకులను లక్ష్యంగా చేసుకుని పరిశ్రమలోనే కొందరు నెగెటివిటీని సృష్టిస్తున్నారు.సినిమా జయాపజయాలు ప్రేక్షకుల నిర్ణయంపై ఆధారపడి ఉండాలి. విమర్శలు, రివ్యూలు, ట్రోలింగ్‌.. ఇవన్నీ సినిమా ప్రపంచంలో సహజమే. కానీ, ప్రేక్షకులు సినిమా చూడకముందే.. దాన్ని దెబ్బతీయాలని చూడడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని విష్ణు వ్యాఖ్యానించారు.

ప్యారడైజ్‌ చిత్ర బృందం కూడా సినిమా విడుదలకు ముందే ఇలాంటి వాటి నుంచి రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేశారు.ఒక సినిమా విజయం లేదా వైఫల్యం మొత్తం టాలీవుడ్‌ పరిశ్రమను నిర్వచించదని అన్నారు. పరిశ్రమ అందరిదనీ.. ఎంతమంది వచ్చినా ఇక్కడ ఎవరి స్థానం వారికి పదిలంగా ఉంటుందని చెప్పారు.

నటుల ఫొటోల దుర్వినియోగంపై మా నిఘా
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా తాను ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్లు విష్ణు తెలిపారు. నటుల ఫొటోలను దుర్వినియోగం చేస్తూ వారిపై అసభ్యకరమైన కంటెంట్‌ రూపొందించే వారితో పాటు ప్రజలను తప్పుదోవ పట్టించే ఖాతాల వివరాలను మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) సేకరిస్తోందని వెల్లడించారు.ప్రతి శుక్రవారం మనం పోటీ పడొచ్చు. కానీ మిగిలిన వారమంతా ఒకరినొకరు నాశనం చేసుకునేందుకు ప్రయత్నించకూడదు.సినిమాను గెలవనివ్వండిఃః అని విష్ణు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు