Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నాడు పురోగతి నేడు తిరోగతి

అమర్‌జిత్‌ కౌర్‌

వీరోచిత పోరాటాలు, మహత్తర త్యాగాల అనంతరం భారతదేశానికి బ్రిటీష్‌ వలస పాలకుల నుంచి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం లభించింది. అనంతరం మౌలిక సదుపాయాల కల్పన, సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం, సహజ వనరుల అన్వేషణ, ప్రభుత్వ రంగ పరిశ్రమలతో సహా జాతీయ సంపద సృష్టి ద్వారా దేశం మంచి పురోగతి సాధించింది. అభివృద్ధి కృషిలో దేశ ప్రజలు, రైతులు, కార్మికులు, మేధావులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు క్రియాశీలంగా భాగస్వాములయ్యారు. 194243లో బెంగాల్‌ కరవు, పిఎల్‌480 కింద పొందిన సహాయంతో నిమిత్తం లేకుండా వ్యవసాయ రంగంలో మన అవసరాలను కొంతమేర తీర్చగలిగిన స్థాయిలో స్వయం సమృద్ధిని సాధించాము. వామపక్షాలు, ప్రగతిశీల శక్తుల తోడ్పాటుతో ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం ఫలితంగా బీమా, బ్యాంకుల జాతీయకరణ జరిగింది. ఈ అభివృద్ధి క్రమంలో మధ్యతరహా, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు ఏర్పడి లక్షలాది మందికి జీవన భృతి అవకాశాలు కలిగాయి. ప్రభుత్వ రంగం ప్రభావశీలంగా అభివృద్ధి చెందింది. స్వయం సమృద్ధి ఆర్థిక నమూనాను 1950ల నుంచి పార్లమెంటు చర్చలలో భారతీయ జనసంఫ్‌ు (బీజేపీ పూర్వ అవతారం), కాంగ్రెస్‌లో మితవాద పక్షం, కొన్ని ఇతర మితవాద శక్తులు వ్యతిరేకించాయి. సహజ వనరులు, జాతీయ వనరుల ద్వారా అభివృద్ధి, దేశ సార్వభౌమత్వాన్ని సాధించేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్‌ యూనియన్లు అండగా నిలిచాయి. అయితే కార్మిక వర్గం, రైతులు అభివృద్ధిలో భాగస్వాములైనప్పటికీ అసమాన పంపిణీ వ్యవస్థ మూలంగా ఫలితాలు వీరికి దక్కలేదు. కొద్దిమంది సంపన్నుల చేతుల్లోకి అపార సంపద వెళ్లిపోయింది. మరోవైపు ఇంజనీరింగ్‌, ఉత్పత్తి, అన్వేషణ, అణుశాస్త్రం, అంతరిక్ష శాస్త్రం తదితర అనేక రంగాలలో గొప్ప విజయాలను దేశం సాధించింది. అలాగే విద్య, శిక్షణ, ఉద్యోగాలు, పనిచేసే చోట భద్రత, గౌరవనీయమైన వేతనాలు, సామాజిక భద్రత రంగాలలో సమాన అవకాశాల కోసం, అనేక కార్మిక హక్కులు, న్యాయపరమైన హక్కులు, ప్రయోజనాల కోసం ఉద్యమాలు జరిగాయి. 1991లో స్వేచ్ఛా మార్కెట్‌ ఆర్థిక శక్తులకు అనుకూలంగా నయా ఉదారవాద ఆర్థిక సమూనా ప్రవేశించింది. దీంతో అందరికీ న్యాయం, సమాన అవకాశాల హక్కు ఎజెండా వెనుక పట్టు పట్టింది. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, డబ్ల్యుటీవోల నయా ఉదారవాద ఎజెండాకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ట్రేడ్‌ యూనియన్లు కీలక పాత్ర వహించాయి. అంతర్జాతీయ ఆర్థిక పెట్టుబడుల ఎజెండా ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించింది. దేశ, విదేశీ కార్పొరేట్‌లు మార్కెట్‌లను, వ్యాపారాలను, సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థల సంపదపై అజమాయిషీ సాధించాయి. కార్మిక చట్టాలను హరించి నాలుగు కోడ్లను తీసుకొచ్చారు. రైతులను, వ్యవసాయ కార్మికులను వ్యవసాయం నుంచి బయటకు గెంటేందుకు కార్పొరేట్‌ వ్యవసాయం కోసం మూడు దుష్ట చట్టాలను తెచ్చారు. ఆర్థిక మంత్రి ప్రకటన ప్రకారం వ్యూహాత్మక, వ్యూహాత్మకం కాని లాభాలు పొందే సంస్థలన్నింటిని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. రైల్వేలు, రైల్వే ప్లాట్‌ఫారాలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఇంధన, గ్యాస్‌, విద్యుత్‌, స్టీలు, బొగ్గు, రాగి, టెలికాం, పోస్టల్‌ విభాగాలను ప్రైవేటీకరించటానికి పథకాలు రచిం చారు. అంతేకాదు ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా తదితర అన్ని ముఖ్యమైన విభాగాలను ప్రైవేటు పరం చేస్తున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేని బీజేపీ, సంఫ్‌ు పరివార్‌ స్వాతంత్య్రం వచ్చిన తరవాత దేశ నిర్మాణంలో ఎలాంటి పాత్రను పోషించలేదు. ప్రజల కనీస హక్కుల కోసం సైతం పాటుపడలేదు. ఎల్లవేళలా స్వేచ్ఛా మార్కెట్‌ శక్తులకే అండగా నిలిచాయి. దేశంలో అన్ని నిత్యావసరాల ధరలు అపారంగా పెరిగాయి. పెట్రోలు రు.62 నుంచి 112లు వరకు, డీజిలు రు.55 నుంచి 100కు పైగా, గ్యాస్‌ సిలిండర్‌ రు.414 నుంచి 834కు పెరిగాయి. నిరుద్యోగం ఏనాడు లేనంతగా పెరిగింది. జీవనభృతి సమస్య ఆందోళన కలిగిస్తోంది. నిరుద్యోగం పెరుగుతూనే ఉంది కాని తరగటం లేదు. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) 6.3 శాతానికి పడి పోయింది. అయినా ఆర్థిక వ్యవస్థ అద్భుతమన్నట్టు ప్రచారం చేస్తున్నారు. కరోనా మహమ్మారి మొదటి దశలో అనాలోచితంగా ప్రకటించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మూలంగా కోట్లాది మంది వలస కార్మికులు, పేదలు జీవనభృతి లేక అల్లాడి పోయారు. ఆహార భద్రత కింద 84 కోట్ల మందికి ఆహారాన్ని అందించామని ప్రభుత్వం చెప్పుకొన్నది. అయితే తమకు రేషన్‌ అందలేదని 94 శాతం మంది చెప్పినట్టు క్షేత్రస్థాయి అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దూర ప్రాంతాలలో పని చేస్తున్న వలస కార్మికులకు ప్రయాణ సౌకర్యం లేక వందలాది మైళ్లు నడిచి ఇళ్లకు చేరుకున్నారు. ఈ దృశ్యాలను ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తున్నదే కాని ఎలాంటి సహాయం అందించలేదు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నీ (ఎంఎస్‌ఎంఇలు) మూతబడి పోయాయి. అయితే కరోనా మొదటి దశ తరవాత 6.3కోట్ల ఎంఎస్‌ఎంఇలు ఉండగా 34శాతం మాత్రమే తిరిగి ప్రారంభ మయ్యాయి. 33శాతం పూర్తిగా మూతబడిపోయాయి. కరోనా రెండో దశలో పరిస్థితి మరింత దిగజారింది. జూన్‌, జులై మాసాల్లో 80 లక్షల మంది వేతన ఉద్యోగులు నిరుద్యోగు లయ్యారు. ఉద్యోగులు, కార్మికులు దాదాపు 3 కోట్ల మంది కరోనా రెండో దశలో పనులు కోల్పోయినట్టు సిఎంఐఇ సర్వే తెలిపింది. 1525 ఏళ్ల మధ్య వయస్కులైన 54 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. మొదటి, రెండవ దశ కరోనా కాలంలో ప్రభుత్వం ప్రకటించిన సహాయ ప్యాకేజీలో ఎక్కువ భాగం కార్పొరేట్లకే వెళ్లిపోయింది. వారికి పన్నులు 35 శాతం నుంచి 29 శాతానికి తగ్గించివేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులలో వేలాది కోట్లు అప్పులు తీసుకొని ఎగవేసిన వారిలో ఎక్కువమంది కార్పొరేట్‌లే. మోదీ పాలనలో బ్యాంకులకు రుణాలను చెల్లించకుండా ఎగవేసిన మొత్తం రు.8.3 లక్షల కోట్లకు పైబడిరది. కరోనా మహమ్మారికి ఆర్థిక రంగం సంక్షోభంలోకి వెళ్లిపోయి పేదల సంఖ్య పెరిగింది. పేదలకు నెలకు రు.7,500 సహాయం చేయాలని కేంద్ర ట్రేడ్‌ యూనియన్లు చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదు.
4.9 కోట్లమంది పిల్లలు బాల కార్మికుల స్థితిలోకి వెళ్లిపోయారని ఐఎల్‌ఓ, యునెస్కో అంచనా వేశాయి. బాల కార్మికులలో 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే. కరోనా కాలంలో మరింతగా బాధితులైన వారు మహిళలు. ఉద్యోగాలు, జీవనభృతులు కోల్పోయారు. గృహహింస పెరిగింది. బాల్య వివాహాలు అధికమయ్యాయి. అసమానతలు అపారంగా పెరిగాయి. కరోనాకు ముందునాటి కంటే నేడు 40 కోట్ల మంది పేదరికంలోకి జారిపోయా రని ఐఎల్‌ఓ తెలిపింది. ఉద్యోగాలు కోల్పోయిన మహిళలలో 50శాతం మందికి కూడా ఉద్యోగాలు లభించలేదు. లాక్‌డౌన్‌ కాలం నాటి వేతనాలను కూడా తిరిగి ఇవ్వలేదు. పనులను తొలగించటం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు 2020`21 మార్చి మధ్యకాలంలో ముఖేష్‌ అంబానీ సంపద 128 శాతం పెరిగితే, అదానీ సంపద 480 శాతం పెరిగింది. బిలియనీర్ల సంఖ్య ఇదే కాలంలో వంద నుండి 140కి పెరిగింది. వీరి సంపద 12.97 లక్షల కోట్లు పెరిగింది. కరోనా బాధితులకు చికిత్స అందించటంలో కార్పొరేట్‌ ఆసుపత్రులు ఫీజులను అపారంగా వసూలు చేశాయి. నాలుగు కార్పొరేట్‌ ఆసుపత్రులు రోజుకు 500 కోట్ల రూపాయలు సంపాదించాయి. మోదీ ప్రభుత్వం పూర్తిగా సంపన్నుల కోసమే పనిచేస్తోంది. ఒక శాతం సంపన్నుల వద్ద 70 శాతం సంపద పోగుపడిరది. ప్రభుత్వాన్ని విమర్శించే వారిని అనేక క్రూర చట్టాలను విని యోగించి జైళ్లలో పెట్టి విచారణ కూడా లేకుండా హింసిస్తున్నారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img