హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన మే 31 న మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘ఎస్ఎస్ఎంబి28’ నుండి ఒక చిన్న వీడియో విడుదల చేయడంతో పాటు అలాగే ఆ సినిమా టైటిల్ కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం చాలా రకాల టైటిల్స్ పరిశీలనలో వున్నాయి కానీ, ఇంతవరకు ఏదీ ఖరారు కాలేదని తెలిసింది. వెకేషన్ కి వెళ్లిన మహేశ్ బాబు రేపు మే 17న హైదరాబాద్ తిరిగొస్తున్నట్లు తెలిసింది. మహేష్ బాబు వచ్చాక, అతనికి తీసుకెళ్లి చూపించి టైటిల్‌ను ఖరారు చేస్తారని సమాచారం. ఈ హడావుడి అంతా మే 31న ఉండనుంది. అయితే తన తండ్రి కృష్ణ అభిమానులకి ఏదైనా చెయ్యాలని మహేశ్‌బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అందుకే అతను దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత సితార ఎంటర్ టైన్ మెంట్స్‌తో మాట్లాడి ఆరోజు ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పాడట. అదే రోజు కృష్ణ కౌబాయ్ సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’ కూడా విడుదల అవుతోంది. ఆ సినిమా భారత దేశం లో మొదటి కౌబాయ్ సినిమా. అందువలన, మహేష్, త్రివిక్రమ్ సినిమా నుండి వచ్చే ఆ చిన్న వీడియో ఆన్ లైన్ లో కాకుండా, కృష్ణ సినిమా విడుదల అయిన థియేటర్స్ అన్నింటిలో ఆ సినిమాతో పాటు ప్రదర్శిస్తే బాగుంటుందని ఒక సలహా రావటంతో అది బాగుందని అన్నాడని తెలిసింది. ఇప్పుడు ఈ చిత్ర నిర్వాహకులు ఆ చిన్న వీడియో, టైటిల్ ప్రకటనని ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాకి అటాచ్ చేసే విధంగా ఆలోచిస్తున్నారు. తరువాత ఆన్ లైన్ లో పెట్టాలని కూడా యోచిస్తున్నారు. ‘గుంటూరు కారం’, ‘అమరావతికి అటు ఇటు’, ‘ఊరికి మొనగాడు’ లాంటి టైటిల్ ఉండొచ్చు అని నెట్టింట చర్చ జరుగుతోంది.