Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు టిడిపి కి లేదు

ఎం.యల్.సి వై. శివరామ రెడ్డి.

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గములో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని ఎం.యల్.సి వై. శివరామరెడ్డి అన్నారు. శనివారం ఉరవకొండ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ. నాలుగు సార్లు శాసనసభ్యునిగా గెలుపొందిన పయ్యావుల కేశవ్ వల్ల ఉరవకొండ నియోజకవర్గానికి ఒరిగింది ఏమిలేదని ఎద్దేవా చేశారు. నారాలోకేష్ ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలను ఎం.యల్.సి తీవ్రంగా తప్పు పట్టారు. అవగాహన లేని నారాలోకేష్ ద్వారా పయ్యావుల కేశవ్ అబద్దాలను చెప్పించారన్నారు. ఉరవకొండలో అభివృద్ధి తామే తమ ప్రభుత్వ హయాములో చేశామంటూ చెప్పుకు రావడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు హంద్రీనీవా ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావడానికి దివంగత నేత వై. యస్. రాజశేఖర్ రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందించడానికి వేలాదికోట్ల రూపాయలను ఖర్చు చేసిన మహానుభావుడు వైయస్సార్ అన్నారు. 86 కోట్ల రూపాయలతో పి ఏ. బి. ఆర్. డ్యామ్ నుండి ఉరవకొండ నియోజకవర్గానికి త్రాగునీటి అందించడం జరిగింది అన్నారు. ఉరవకొండలో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి 2012 వ సంవత్సరంలో తాను ప్రతిపాదనలు సిద్ధం చేసి మంజూరు చేయించానని ఎమ్మెల్సీ తెలిపారు. దీనిని కూడా కేశవ్ తానే మంజూరు చేయించినట్టు అబద్ధాలు చెప్పడం శోచనీయమన్నారు ఉరవకొండ నియోజక వర్గములోని పలు మండలాల్లో కార్యాలయాలు, గురుకుల పాఠశాలలు, పాలిటెక్నీక్ కళాశాల, బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఐ.టి .ఐ కళాశాల, పాఠశాలలకు సొంత భవనాలు, అదనపు తరగతి గదులు, మరియు ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తాను స్వయంగా ప్రతిపాదనలు సిద్దము చేసి మంజూరు చేయించినవి అని కావాలంటే ఎక్కడైనా ఈ విషయములో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాలు విసిరారు. ప్రస్తుతము కూడా దాదాపు 69 కోట్ల రూపాయలతో నియోజక వర్గములో త్రాగునీటి ఎద్దడి నివారించడానికి నిధులు మంజూరు చేయించామని, నియోజకవర్గములో దాదాపు 44 అంగనవాడికేంద్రాలకు సొంతభావనాలు మంజూరు చేయించానని తెలిపారు.
నారాలోకేష్, పయ్యావుల కేశవ్ ఇరువురు కలిసి గ్రామా సచివాలయం రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్కులు, నాడు-నేడు నియోజక వర్గములో పాఠశాలల, అంగనవాడి కేంద్రాల వద్ద ప్రతి పేదవాడి ఇంటివద్దకే వెళ్లి రేషన్ అందిస్తున్న వాహనాల వద్ద నిలబడి సేల్ఫిలు తీసుకోవాలన్నారు. రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, జలకళ, విత్తనాల పంపిణీ, ఆసరా, అమ్మఒడి, విద్యా దీవెన, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, చేయూత, వాహన మిత్ర, వేలాది సంఖ్యలో కడుతున్న జగనన్న ఇళ్లు, ఇవన్నీ పచ్చపార్టీ కళ్ళకు కనబడటం లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి పేదవాడికి అందుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. నారాలోకేష్ చేపట్టిన పాద యాత్రని, అబద్దాల చంద్రబాబుని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆ పార్టీకి కాలం చెల్లిందని, ఇకపై తాము అధికారంలోకి రాలేమని తెలిసే ఇలా అసత్య ప్రచారాలు చేస్తూ పాదయాత్ర సాగిస్తున్నారని యం.ఎల్.సి. పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో మాజీ డి.సి.ఎం.యస్. చైర్మన్ సోమర జయచంద్ర నాయుడు, విడపనకల్ మాజీ ఎంపీపీ రమణా రెడ్డి, ఉరవకొండ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమణ యాదవ్, కొనకొండ్ల సర్పంచి ఇందిరమ్మ, గంజికుంట సర్పంచ్ జయేంద్ర రెడ్డి, జరుట్ల రాంపురం సర్పంచ్ తిరుపాల్ యాదవ్, రేణుమాకులపల్లి సర్పంచ్ రామాంజినేయులు, తాట్రకల్లు సర్పంచ్ కిష్టప్ప, షేక్షాన్పల్లి సర్పంచ్ లింగన్న, మాజీ ఎంపీటీసీ దేవేంద్ర, వై.యస్.ఆర్.సి.పి నాయకులు తిప్పారెడ్డి , ఆకుకూర నాగరాజు, చంద్రమోహన్ రెడ్డి, దిద్దెకుంట సూరి, కొనకొండ్ల లాలెప్ప, పాల్తూరు మహాలింగ, డోనేకల్ సురేష్, మాలాపురం కేశన్న, పందికుంట ఎర్రిస్వామి, చాబాల గురు, వజ్రకరూరు ఏసన్న, ఉండబండ భాస్కర్ మొదలగు వారు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img