Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవలేమని అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వం

సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగుల మరియు ప్రజా వ్యతిరేకతను మూటకట్టకున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జరుగుతున్న పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవలేమని తెలిసి అక్రమాలకు పాల్పడుతోందని అనంతపురం జిల్లా సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి నారాయణస్వామి అన్నారు. మంగళవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపక్షం ప్రజాస్వామ్యానికి పూర్తిగా పాతరేసిందని గెలుపే లక్ష్యంగా అడ్డదారులు తొక్కుతూ ప్రభుత్వ అధికారులును వినియోగించుకొని ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులకు మద్దతుగా ఆర్జెడి ప్రతాపరెడ్డి సభలు సమావేశాలను, విందులను ఏర్పాటు చేసి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విసి ప్రసాద్ రెడ్డి కూడా ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారని ఆరోపించారు.వీరిపై చర్యలు తీసుకోవాలని వీరిని విధుల నుంచి తప్పించాలని ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభలో 175 స్థానాలు శాసన మండలి లో ఉన్న 58 స్థానాలను కూడా తమ పార్టీ అభ్యర్థులే గెలవాలని లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని అవినీతి, అక్రమాలకు తెర లేపారని ఆరోపించారు. పశ్చిమ రాయలసీమ కి సంబంధించి పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను గెలిపిస్తే హిందూపురం పార్లమెంటు స్థానాన్ని కేటాయిస్తానని ఆర్ జె డి ప్రతాపరెడ్డికి సీఎం హామీ ఇచ్చారని అందుకే ఆర్జెడి ప్రభుత్వ అధికారిగా కాకుండా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన విద్యార్థి సంఘాలపై ఆయనే అక్రమ కేసులు కూడా నమోదు చేయిస్తున్నాడని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో ఉద్యోగులను నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదని తెలిసి ప్రభుత్వం గెలుపు కోసం బరితెగిస్తుందన్నారు. తాము అధికారంలోకి వస్తే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని పెండింగ్ డీఏలను మంజూరు చేస్తామని వీటితోపాటు ఉద్యోగులకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చలేక పోయిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీన రావాల్సిన జీతాలు సక్రమంగా అందడం లేదని వీటితో పాటు అనేక కారణాలతో ఉద్యోగులు పట్టబద్రులు, నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే కి సిద్ధమయ్యారన్నారు. ఎన్నికల కమిషన్ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు.

ప్రజల పక్షాన పోరాడే వారిని మేధావులు, ఉపాధ్యాయులు గెలిపించాలి

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిత్యం ప్రజా సమస్యల పైన కార్మికులు ఉద్యోగుల నిరుద్యోగుల హక్కుల పైన పోరాటాలను నిర్వహిస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డిని, పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును, ఉద్యోగులు, మేధావులు తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, తాలూకా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, సహాయ కార్యదర్శి మనోహర్, ఏఐటియుసి నాయకులు చెన్నారాయుడు, జిల్లా మహిళా సంఘం నాయకురాలు పార్వతీ ప్రసాద్, ఉరవకొండ కార్యదర్శి తలారి మల్లికార్జున, వజ్రకరూరు కార్యదర్శి సుల్తాన్, విడపనకల్లు కార్యదర్శి రమేష్ కూడేరు సిపిఐ పార్టీ మండల నాయకులు రమణ, పార్టీ నాయకులు మల్లేష్,నాగరాజు, రాజు, విద్యార్థి సంఘం నాయకుడు చిరు, మహిళా సంఘం నాయకురాలు వన్నూరమ్మ, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img