Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

“సైకాలజీలో సమకాలీన ధోరణల”పై జాతీయ సదస్సు

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని అనువర్తిత మనోవిజ్ఞానశాస్త్రం (అప్లైడ్ సైకాలజీ)శాఖ “సైకాలజీలో సమకాలీన ధోరణలు” అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించనుంది. ఈ నెల 25, 26 తేదీలలో జరిగే ఈ సెమినార్ ప్రధానంగా మనోవిజ్ఞానశాస్త్రంలో నేడు వస్తున్న సాధన, పరిశోధన, బోధన, అభ్యాసాలపై దృష్టి సారిస్తుంది. ఈ సదస్సులో బెంగళూరు విశ్వవిద్యాలయం, పూర్వ అధ్యక్షులు ఆచార్య హెచ్.ఎస్. అశోక్ “21వ శతాబ్ది మనస్తత్వశాస్త్రం” గురించి కీలకోపన్యాసం చేస్తారు. వీరు ముప్పై ఐదు సంవత్సరాలు బోధన, పరిశోధనా రంగాలలో పనిచేశారు. అంతేకాదు ప్రైవేట్, ప్రభుత్వరంగ సంస్థలు, పలు విద్యాసంస్థలకోసం శిక్షణా మాడ్యూల్స్ ను తయారు చేయడంలో, వాటిని అభివృద్ధి చేయడంలో పాల్గొన్నారు.
ఈ సదస్సుకు విచ్చేస్తున్న మరో ముఖ్యమైన వక్త డాక్టర్ శుభ మధుసూధన్. వీరు గత ఇరవై సంవత్సరాలుగా క్లినికల్ సైకాలజిస్టుగా సేవలందిస్తున్నారు. వీరు “కౌమారదశలో అవసరమయ్యే రోగనివారణకు సంబంధించిన కౌన్సిలింగ్ గురించి, కుటుంబ సంబంధాల ఘర్షణ వల్ల కలిగే మానసిక సంఘర్షణల” గురించి ప్రసంగిస్తారు.
ఈ సదస్సులో బెంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ రోహిణి శివానంద ప్రారంభోపన్యాసం చేసి, మొదటి సమావేశానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇంకా ఈ సదస్సులో కెంట్ స్టేట్ విశ్వవిద్యాలయం(యు.ఎస్.ఎ)లో పి.డి.ఎఫ్. స్కాలర్ గా పనిచేసి, పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉన్న డాక్టర్ భరణికాంత్ “మానసిక ఆరోగ్యం, మంచి నడవడికతో వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరుచుకోవడం” పై ప్రసంగిస్తారు.
ఈ సదస్సు నాలుగు భాగాలుగా రెండురోజులపాటు నిర్వహించడం జరుగుతుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయం తాత్కాలిక క్యాపస్ – II లో ఈ నెల 25 ఉదయం 10.00 గం.లకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ సెమినార్ హాల్ లో ప్రారంభం అవుతుంది. ఈ సదస్సును విశ్వవిద్యాలయం గౌరవ ఉపకులపతి ఆచార్య ఎస్.ఎ. కోరి ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img