Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

జగన్‌ సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు : సజ్జల

2024 ఎన్నికల్లో.. జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా.. ఎవరూ అడ్డుకోలేరని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పవన్‌ చంద్రబాబు ఏజెంట్‌గా పని చేస్తున్నారని.. తాను ఏం చేస్తానో ప్రజలకు చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.‘జగన్‌ ఏ సభకు వెళ్లినా.. దేవుడి దయ, ప్రజల దీవెనలు కావాలని.. మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ.. ప్రతిపక్ష నేతలు మాత్రం అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. జగన్‌ను అధికారంలోకి రానివ్వం.. ఓట్లు చీలనీవ్వమని అంటున్నారు. జగన్‌ అధికారంలోకి రాకుండా చూడటమే బాధ్యతగా పని చేస్తున్నారు. 2019లో పవన్‌ ఏం చేశారు. వ్యతిరేక ఓటును ఆ రోజు ఎందుకు చీల్చలేదు. తాను చంద్రబాబు తరఫున పని చేస్తున్నానని పవన్‌ చెప్పకనే చెబుతున్నారు. 175 సీట్లకు పోటీ చేస్తానని పవన్‌ ఏ రోజు చెప్పడం లేదు. సినిమా ఆర్టిస్టు కాబట్టి.. వారానికి ఒకసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే అభిమానులు చప్పట్లు కొడుతున్నారు’ అని సజ్జల సెటైర్లు వేశారు.‘పవన్‌ కళ్యాణ్‌ ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. ఒకసారి కులం అంటారు.. మరోసారి కులం లేదంటారు. ఇంకోసారి బీజేపీ రోడ్డు మ్యాప్‌ అంటారు. టీడీపీని మాత్రం ఒక్కమాట అనరు. 2014-2019 మధ్యలో చంద్రబాబు మంచి పాలన అందించి ఉంటే.. మళ్లీ అధికారంలోకి వచ్చేవారు కదా అని పవన్‌ ప్రశ్నించరు. చంద్రబాబు ఏజెంట్‌గా.. స్క్రిప్ట్‌ చదివే ఆర్టిస్టుగా పవన్‌ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. కౌలు రైతులకు సంబంధించి గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు జగన్‌ దాన్ని పక్కగా అమలు చేస్తున్నారు’ అని సజ్జల వివరించారు. ‘పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ పొలిటిషియన్‌ అయితే.. ఏపీ గురించి ఆలోచించాలి. తాను అధికారంలోకి వస్తే ఇది చేస్తానని ప్రజలకు చెప్పాలి. తాను అధికారంలోకి వస్తే.. ఇది చేస్తానని జగన్‌ చెప్పారు. దాన్నే మేనిఫెస్టోలో చేర్చి అన్నింటిని అమలు చేస్తున్నారు. అందుకే ప్రజలు జగన్‌ను నమ్ముతున్నారు. చంద్రబాబు నిజస్వరూపం మాచర్లలో మరోసారి బయటపడిరది. ఆయన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు నిజస్వరూపం గురించి ఎప్పుడో చెప్పారు. మాచర్లను అగ్ని గుండంలా చేయాలనేది చంద్రబాబు ఉద్దేశం. పిన్నెళ్లి కుటుంబం దాదాపుగా 20 ఏళ్లుగా మాచర్లలో ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇన్నాళ్లు ఇలా ఎందుకు కాలేదు. బ్రహ్మారెడ్డి వచ్చిన తరువాతే ఎందుకు ఇలా జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img