Thursday, October 24, 2024
Thursday, October 24, 2024

ముంచుకొస్తున్న ‘దానా’

. నేడు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం
. ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు?
. 200 రైళ్లు దారి మళ్లింపు, రద్దు
. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: తూర్పుమధ్య బంగాళాఖాతంలో బలమైన తుపానుగా మారిన ‘దానా’ ఆందోళన కలిగిస్తోంది. ప్రభావితం కానున్న రాష్ట్రాలు ముమ్మర ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌పై పాక్షిక ప్రభావం ఉండనుండడంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం కీలక ప్రకటన విడుదల చేసింది. దానా తుపాను రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని, గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా కదిలిందని వెల్లడిరచింది. ఈ తుపాను గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పూరీ-సాగర్‌ ద్వీపం మధ్య భితార్కానికా, ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటనుందని పేర్కొంది. ఈ తుపాను ప్రస్తుతానికి పారాదీప్‌కు (ఒడిశా) 520 కిలోమీటర్లు, సాగర్‌ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్‌) 600 కిలోమీటర్లు, ఖేపుపరాకు (బంగ్లాదేశ్‌) 610 కిలోమీటర్ల దూరంలో కదులుతోందని వివరించింది. కాగా తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. గురువారం రాత్రి నుంచి 100-110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దానా తుపాను ప్రభావం నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి… తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తీర ప్రాంత జిల్లా కలెక్టర్లతో నిత్యం సమీక్ష నిర్వహిస్తూ తుపాన్‌ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం భీమిలి తీర ప్రాంతంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ‘దానా’ తుపాను నేపథ్యంలో రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. రద్దు, దారి మళ్లించిన వాటిలో సుమారు 200 సర్వీసులు ఉన్నాయి. 23, 24, 25 తేదీల్లో వీటిని రద్దు చేశారు. ఈ వివరాలను ప్రయాణికులకు తెలియజేసేందుకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాయగడ రైల్వేస్టేషన్లలో హెల్ప్‌ లైన్లు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img