Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

వీధులే… మా వేదికలు

. జీఓ నం.1ను ఉపసంహరించుకోకుంటే తీవ్ర పరిణామాలు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల

విశాలాంధ్ర`గుంటూరు: అప్రజాస్వామిక జీఓ నం.1ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న మందడంలో సీపీఐ శ్రేణులు సోమవారం నిరసన తెలిపారు. వీధులే… తమ వేదికలని… ప్రజా సమస్యలపై గళం వినిపించేది అక్కడ నుంచేనని నినదించారు. జీఓ నం.1 పేరుతో భావప్రకటన స్వేచ్ఛను హరించాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నిరసన తెలుపుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌ కుమార్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్యను పోలీసులు అరెస్ట్‌ చేసి నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా, ఏఐటీయూసీ నాయకులు ఆకిటి అరుణ్‌ కుమార్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్‌ సుభాని, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెలా నాసర్‌ జీ, సీపీఐ తాడికొండ ఏరియా కార్యదర్శి ముప్పాళ్ల శివశంకర్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు గుండాల శ్రీహర్ష, గుంటుపల్లి వెంకటేశ్వరరావు, గుర్రంకొండ సత్యానందం, కంభంపాటి దేవుని దయ, మీరావలి, యర్రంశెట్టి శ్రీనివాసరావులను అరెస్ట్‌ చేసి తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జంగాల అజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ చీకటి జీఓ నెం.1ను ప్రభుత్వం రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమాలు చేసే కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, రైతులకు ఈ జీఓ ఒక పిడుగుపాటని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను, భావప్రకటనా స్వేచ్ఛను హరించే విధంగా జీఓ ఉందన్నారు. చట్ట వ్యతిరేకమైన చీకటి జీఓ నెం.1తో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img