. దిల్లీలోనూ పోరాటాలు చేద్దాం
. చంద్రబాబు, పవన్‌పై ఒత్తిడి తీసుకువద్దాం
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర`విశాఖ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. విశాఖలోని పౌర గ్రంథాలయంలో వామపక్ష పార్టీలు, కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల అధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాటం కార్మికులకు మాత్రమే పరిమితం కాకూడదని, దీనిని ప్రజాపోరాటంగా ముందుకు తీసుకువెళ్లాలని, దిల్లీలోనూ పోరాట కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారని గుర్తు చేస్తూ… ఇప్పుడు మౌనం వహిస్తున్న వారిపై ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంపై ఈనెల 7న విజయవాడలో వామపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేశామని, దీనిలో ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకువెళ్లడంపై, చలో అమరావతి వంటి కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. ఎన్నికల ముందు కంటే ఆ తరువాతే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ముప్పు పెరిగిందని అన్నారు. అనేక రకాలుగా స్టీల్‌ప్లాంట్ కుంటుపడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అనకాపల్లి జిల్లాలో మిత్తల్ స్టీల్‌ప్లాంట్ కోసం ముడిసరుకుతో పాటు అవసరమైన అన్ని వనరులూ సమకూర్చడానికి సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం… ప్రభుత్వ రంగ విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ విషయంలో చొరవ చూపకపోవడాన్ని తప్పుపట్టారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడకుండా ఎన్ని మంచి పనులు చేసినా ప్రజలు గుర్తించరన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ దిశగా ముందుకు వెళుతోందని, కేంద్ర ప్రభుత్వం ఎస్ఈజెడ్లు పెట్టిన మాదిరిగా రాష్ట్రంలో ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్కులు పెట్టాలంటూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారని, గతంలో ఈ పని ఏపీఐఐసీ చేసేదని గుర్తు చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపీలు… దీనిపై ప్రధాని మోదీని కలుసుకునేందుకు చొరవ చూపడం లేదని విమర్శించారు. సుదీర్ఘ పోరాటం వల్లే విశాఖ ఉక్కును ఇంతవరకు కాపాడుకుంటూ రాగలిగామని, ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సందర్భాల్లో ప్రధాని మోదీని కలిసినా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడలేదని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌కు నష్టాల ముద్ర వేసి ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని అన్నారు. స్టీల్‌ప్లాంట్ గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం 1,358 రోజులకు చేరుతుందని, అయినా కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌లోని ఉక్కు ఉత్పత్తి విభాగాలు 9,500 ఎకరాల్లో ఉన్నాయని, ఆ భూముల విలువే నాలుగు లక్షల కోట్ల రూపాయలు కాగా యంత్రాల విలువ రూ.50 వేల కోట్లని చెప్పారు. రుణాలపై ప్రతినెలా అసలు, వడ్డీ కలిపి 550 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని, ఈ రుణాన్ని పునర్వ్యవస్థీకరించకుండా ఏం చేసినా ప్రయోజనం ఉండదని అన్నారు. కార్మికులు నిరాశ, నిస్పృహలకు లోనయ్యేలా యాజమాన్యం రోజుకో సమస్యను ముందుకు తీసుకొస్తోందని మండిపడ్డారు. ప్రతి నెలా స్టీల్ ప్లాంట్ విక్రయాలు 2,500 కోట్ల రూపాయలు కాగా గత నాలుగు నెలలుగా పదివేల కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయని చెప్పారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కార్మికులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు యాజమాన్యం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై విశాఖ ఎంపీ భరత్, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ స్పందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏవీ వర్మ రాజు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం సమష్టి పోరాటం అవసరమని అన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఉద్యమంపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకొస్తామని తెలిపారు. సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ ఎంఎల్ఎన్డీ జిల్లా కార్యదర్శి వై.కొండయ్య, సీపీఐ ఎంఎల్ నాయకులు ఆడారి అప్పారావు, ఎం.రామచంద్రరాజు, సీపీఐ ఎంఎల్ ప్రజా పోరు నాయకులు కె.దేవా, ఎంసీపీఐయూ నాయకులు కె.శంకర్రావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎస్‌జే అచ్యుతరావు, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి, విదసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బూసి వెంకటరావు, ఇస్కఫ్ జిల్లా కార్యదర్శి డి.మార్కండేయులు, భారత్ బచావో నాయకుడు సువర్ణరాజు వేమన, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.విమల, సీపీఐ ఉత్తరాంధ్ర జిల్లా కార్యదర్శులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.