Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

కోడుమూరులో హోరాహోరి

విశాలాంధ్ర కోడుమూరు: కోడుమూరు నియోజకవర్గంలో నువ్వానేనా అన్నట్లు పోటీ నడుస్తోంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు గెలిపిస్తాయని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి దీమాగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో తనదైన శైలిలో చక్రం తిప్పుతూ విష్ణువర్ధన్‌ రెడ్డి దూసుకెళుతున్నారు. బలమైన నేతలు ఇద్దరి మధ్య పోటీగా ప్రస్తుత వాతావరణం ఉంది. కోడుమూరు కోట మాదంటే మాదేనంటూ ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’ ఈ ఇద్దరు అభ్యర్థుల మద్య నడుస్తోంది.
వరుసగా రెండు సార్లు వైసీపీ గెలుపు
1985లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎం.శిఖామణి గెలుపొందారు. 1989లో స్వతంత్ర అభ్యర్థి ఎం.మదనగోపాల్‌ … శిఖామణి (టీడీపీ)ని ఓడిరచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన శిఖామణి వరుసగా మూడు సార్లు అంటే 1994 నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శిఖామణి మరణానంతరం 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయన కుమారుడు ఎం.మణిగాంధీ టీడీపీ తరపున పోటీ చేయగా కాంగ్రెస్‌ అభ్యర్థి పి.మురళీకృష్ణ గెలిచారు. 2014 ఎన్నికల్లో మణిగాంధీ వైసీపీ నుంచి బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి మాదారపు రేణుకమ్మపై 52,384 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. కొంతకాలం తర్వాత టీడీపీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీకి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి 2019లో ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. అప్పటి ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్‌ జరదొడ్డి సుధాకర్‌ గెలిచారు. 36,045 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులును ఓడిరచారు. అనంతర పరిణామాలతో కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి, డాక్టర్‌ సుధాకర్‌ మధ్య వచ్చిన విభేదాల కారణంగా సుధాకర్‌ తిరిగి ఎమ్మెల్యే సీటు దక్కించుకోలేకపోయారు. ప్రస్తుతం మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సోదరుడు డాక్టర్‌ ఆదిమూలపు సతీశ్‌ వైసీపీ నుంచి, టీడీపీ తరపున బొగ్గుల దస్తగిరి పోటీ చేస్తున్నారు.
మూడోసారికి యత్నం: 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు మణిగాంధీ, డాక్టర్‌ సుధాకర్‌ భారీ మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపునకు కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి చాలా శ్రమించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించి, పార్టీకి హ్యాట్రిక్‌ విజయాన్ని అందించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. బలమైన నేతలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాశ్‌ రెడ్డి, ఎం మణిగాంధీ వైసీపీలో ఉండటం ఆ పార్టీకి కలిసివస్తుందన్న అంచనా ఉంది.
కోట్ల వర్గీయుల రాకతో మారిన స్థితిగతులు: మాజీ కేంద్రమంత్రి, టీడీపీ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్య ప్రకాశ్‌ రెడ్డికి కోడుమూరులో బలముంది. నిన్న, మొన్నటి వరకు కోడుమూరు అసెంబ్లీకి పోటీ చేసే బొగ్గుల దస్తగిరి తీరుపై అసమ్మతితో ప్రచారానికి దూరంగా ఉన్న కొందరు నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారికి దిశా నిర్దేశం చేశారు. ఇవన్నీ టీడీపీకి కలిసొచ్చే అంశాలుగా మారాయి.
టీడీపీ ప్రచారం ముమ్మురం: ఈసారి ఎన్నికలు ఎదురూరు విష్ణువర్ధన్‌ రెడ్డికి జీవన్మరణ సమస్యగా మారింది. కోడుమూరు కోటపై టీడీపీ జెండా ఎగురపోతే తన ఉనికికే ప్రమాదమని ఆయన భావిస్తున్నారు. పట్టుదలతో గెలుపు కోసం యత్నిస్తున్నారు. తనదైన రాజకీయం చేస్తూ నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ పరిధి గ్రామాల్లో తిరుగుతూ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.
జోరుగా కాంగ్రెస్‌ ప్రచారం:
ఇండియా కూటమి బలపర్చిన కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ కూడా ప్రచారంలో దూసుకెళుతున్నారు. వామపక్ష పార్టీ మద్దతు మరింత కలిసివచ్చే అంశంగా మారింది. అయితే ఈ నియోజకవర్గంలో మురళీకృష్ణకు మంచి పట్టు ఉంది. జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి వెళుతూ తనను గెలిపిస్తే అండగా నిలుస్తానని, సమస్యలు పరిష్కరిస్తామని హామీనిస్తున్నారు. ప్రజల నుంచి ఆయనకు ఆదరణ లభిస్తోంది. దీంతో ఈసారి కోడుమూరులో గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img